డెవలపర్లతో రెరా ముఖాముఖి

Tue,April 16, 2019 12:20 AM

RERA Interview with developers

-500 సంస్థలకు హియరింగ్ పిలుపు
-ఈ నెల 22 నుంచి మొదలు
-తెలంగాణ రెరా అథారిటీ సభ్య కార్యదర్శి కొమ్ము విద్యాధర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)లో నమోదు కాని ఐదు వందల మంది హైదరాబాద్ డెవలపర్లను హియరింగ్‌కు పిలువాలని తెలంగాణ రెరా అథారిటీ తాజాగా నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి వారానికి రెండుసార్లు 20 నుంచి 30 మంది డెవలపర్లను హియరింగ్‌కు పిలువాలని నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్‌లో నిర్మాణాల్ని చేపడుతున్న ఈ డెవలపర్లు రెరాలో ఇప్పటికే తమ పేరును తూతూ మంత్రంగా నమోదు చేసుకున్నారు. కాకపోతే, అట్టి నిర్మాణానికి సంబంధించిన సంపూర్ణ వివరాల్ని రెరాకు సమర్పించలేదు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకున్న అనుమతులు, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, కంపెనీ పూర్వాపరాలు, కన్సల్టెంట్ల సమాచారం, వారి నుంచి హామీ పత్రం వంటివి రెరా అథారిటీకి అందించలేదు. ఇలా దాదాపు 500 మంది రియల్టర్లు వ్యవహరించడం వల్ల మొత్తం హైదరాబాద్ నిర్మాణ రంగానికే మాయని మచ్చగా మారింది. దీంతో రెరా అమలు విషయంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోని ఇతర రాష్ట్రాల ముందు అపఖ్యాతి మూటగట్టుకునే ప్రమాదమున్నది. ఈ ఇబ్బందిని గుర్తించిన తెలంగాణ రెరా అథారిటీ.. ఒక్కో డెవలపర్‌తో స్వయంగా మాట్లాడి, వారి సమస్యల్ని పరిష్కరించే పనిలో నిమగ్నమైంది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ నిర్మాణ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్నహస్తాన్ని అందించారు. ప్రధానంగా రెరా నిబంధనల రూపకల్పన చేసేటప్పుడు అటు నిర్మాణ పరిశ్రమను ఇటు కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకున్నది. 2017 జనవరి 1 తర్వాత ప్రారంభమైన లేఅవుట్లు, నిర్మాణాల్ని రెరా పరిధిలోకి తీసుకొచ్చింది. నమోదుకున్న గడువు ముగిసినా.. పెంచుతూ వచ్చింది. అయినప్పటికీ ఈ అవకాశాన్ని పలు నిర్మాణ సంస్థలు సద్వినియోగం చేసుకోవడం లేదు. మొదట్లో రూ.50,000 అపరాధ రుసుముతో 2017 జనవరి 1 తర్వాత ప్రారంభమైన ప్రాజెక్టుల దరఖాస్తుల్ని స్వీకరించింది. అయితే అపరాధ రుసుమును ప్రస్తుతం రూ.3 లక్షలకు పెంచడంతో కొందరు డెవలపర్లు రెరా వైపు కన్నెత్తి చూడటం లేదని తెలిసింది. అందుకే ఈ నెల 22 నుంచి హియరింగ్‌కు పిలుస్తున్నామని తెలంగాణ రెరా మెంబర్ సెక్రెటరీ కొమ్ము విద్యాధర్ తెలిపారు. దీంతో వెనుకడుగు వేసిన డెవలపర్లను రెరా పరిధిలోకి తెస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles