అదుపులోనే రిటైల్ ద్రవ్యోల్బణం

Wed,August 14, 2019 12:15 AM

Retail inflation eases marginally to 3 15 percent in July

జూలైలో 3.15 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల స్వల్పంగా తగ్గింది. జూలైలో 3.15 శాతంగా నమోదైనట్లు మంగళవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) తెలిపింది. ఇంధన, విద్యుత్ చార్జీలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆహార ధరలు పెరిగినా.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం దిగివచ్చిందని సీఎస్‌వో అభిప్రాయపడింది. ఇక ఈ ఏడాది జూన్‌లో 3.18 శాతంగా ఉండగా, గతేడాది జూలైలో ఇది 4.17 శాతంగా ఉన్నది. అంతకుముందు నెల జూన్‌తో పోల్చితే కూరగాయల ధరలు గత నెల జూలైలో 4.66 శాతం నుంచి 2.82 శాతానికి దిగివచ్చాయి. అయితే పప్పుధాన్యాలు, ఇతరత్రా ఆహారోత్పత్తుల ధరలు మాత్రం 5.68 శాతం నుంచి 6.82 శాతానికి ఎగిసింది. ఈ క్రమంలోనే జూన్‌లో 2.25 శాతంగా ఉన్న స్థూల ఆహార ద్రవ్యోల్బణం.. జూలైలో 2.36 శాతానికి పెరిగింది. జూన్‌లో 2.32 శాతం ఎగబాకిన ఇంధన, విద్యుత్ చార్జీలు.. జూలైలో 0.36 శాతంగా తగ్గినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

వరదలతో ముప్పు

దేశవ్యాప్తంగా ఆహారోత్పత్తి అధికంగా ఉన్న రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, పోటెత్తుతున్న వరదలు.. అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరదల కారణంగా పంటలు వేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీంతో ఈసారి ఖరీఫ్ దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని పలువురు వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరి ఇతరత్రా పంటలు తగ్గితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగడం ఖాయమని, ఆహారోత్పత్తుల ధరాఘాతం వల్ల రిటైల్‌తోపాటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్‌సేల్ ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించే వీలుందని ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ రిసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ అన్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం కూడా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. ఇప్పటికే అన్ని ఖరీఫ్ పంటలు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 869.55 లక్షల హెక్టార్లకే పరిమితమయ్యాయని, నిరుడు 918.70 లక్షల హెక్టార్లలో సాగైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

మున్ముందు ద్రవ్యోల్బణం పెరుగొచ్చు..

వచ్చే రెండు నెలల్లో సీపీఐ ద్రవ్యోల్బణం పెరుగవచ్చని ఐసీఆర్‌ఏ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అంచనా వేశారు. అయినప్పటికీ అక్టోబర్ ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీరేట్లు మరోసారి తగ్గవచ్చన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles