12.5 లక్షల కోట్లు మటాష్

Thu,September 12, 2019 04:37 AM

Rs 12.5 lakh crore of investor wealth lost due to Modi govt

- ఎన్డీఏ సర్కార్ వంద రోజుల్లో భారీగా నష్టపోయిన మదుపరులు
- సెన్సెక్స్ 2,357, నిఫ్టీ 830 పాయింట్ల పతనం


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్ల పరుగుకు బ్రేకులు పడ్డాయి. నరేంద్ర మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. మే 30న అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వంద రోజుల్లో సెన్సెక్స్ ఏకంగా 2,357 పాయింట్లు లేదా 5.96 శాతం, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 830 పాయింట్లు లేదా 7.23 శాతం పతనం చెందాయి. దీంతో మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. రూ.12.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సోమవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల నికర విలువ రూ.1,41,15,315.30 కోట్లకు పడిపోయింది. నరేంద్ర మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు(మే 30) రూ.1,53,62,936.40 కోట్లుగా ఉన్నది. దేశీయ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉండటం, విదేశీ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకోవడం, కార్పొరేట్ల బలహీన ఆర్థిక ఫలితాలు ఈక్విటీ మార్కెట్లను దెబ్బతీశాయని విశ్లేషకులు వెల్లడించారు.

విదేశీ పెట్టుబడిదారులది అదే దారి..

దేశీయ మదుపరులతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కూడా భారీ స్థాయిలో నిధులను ఉపసంహరించుకున్నాయి. ఇప్పటి వరకు వీరు రూ.28,260.50 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. అప్పటికే అంతంత స్థాయిలో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన షాక్‌నుంచి ఇంకా కోలుకోలేదు. సంపన్న వర్గాలపై సర్చార్జిని విధిస్తున్నట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ప్రకటించడంతో వారిలో ఆందోళన తీవ్రతరమైంది. దీంతో ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.28 వేల కోట్లకు పైగా నిధులను తరలించుకుపోయారు. ఎన్‌డీఏ-1 ప్రభుత్వం హయాంలోనే మందకొడి పరిస్థితులు నెలకొన్నాయని, దీర్ఘకాలిక ఆదాయంపై మూలధన పన్ను వేయనున్నట్లు ఫిబ్రవరి 2018లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించడం మార్కెట్ల పతనానికి ఆజ్యం పోసిందని ఐడీబీఐ క్యాపిటల్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు.

బ్లూచిప్ సంస్థలతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లు కూడా కుదేలయ్యాయి. వీటితోపాటు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కూడా పతనానికి పరోక్షంగా దోహదం చేసింది. గడిచిన వంద రోజుల్లో అన్ని రంగాల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ సూచీ అయితే 26 శాతం పతనం చెందింది. మెటల్ 19 శాతం, మీడియా 14 శాతం, ఆటోమొబైల్ రంగం 13 శాతం, ప్రైవేట్ బ్యాంకుల సూచీ 12 శాతం, రియల్టీ 10 శాతం, ఆర్థిక సేవలు 7 శాతం, ఫార్మా 5 శాతం, ఎఫ్‌ఎంసీజీ 4 శాతం దిగువకు పడిపోయాయి. కేవలం ఐటీ రంగ షేర్లు మాత్రం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. వాహన అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఈ రంగ షేర్ల పతనాన్ని శాసించాయి.

మూడోరోజు లాభపడ్డ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభపడ్డాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 125.37 పాయింట్లు పెరిగి 37,270.82 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 32.65 పాయింట్లు అందుకొని 11,035.70 వద్ద స్థిరపడింది. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్తేజపరుచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈక్విటీలు పెరుగడానికి దోహదం చేశాయని, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు వచ్చే నెలలో జరుగనుండటం కలిసొచ్చింది. మార్కెట్లో అత్యధికంగా యెస్ బ్యాంక్ 13.47 శాతం లాభపడింది. యెస్ బ్యాంక్‌లో డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం వాటా కొనుగోలు చేయనున్నట్లు వచ్చిన వార్తలు బ్యాంక్ షేరు పుంజుకోవడడానికి కారణమయ్యాయి. వీటితోపాటు టాటా మోటర్స్, మారుతి, టాటా స్టీల్, వేదాంతా, బజాజ్ ఆటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీల షేర్లు పది శాతంవరకు లాభపడ్డాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లు మాత్రం మూడు శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ, ఆటో, మెటల్, ఇండస్ట్రీయల్, బ్యాంకెక్స్, ఫైనాన్స్, టెలికం రంగ షేర్లు లాభపడగా, ఐటీ, టెక్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టపోయాయి.

1618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles