7 నెలల గరిష్ఠానికి రూపాయి

Fri,March 15, 2019 12:37 AM

Rupee Closes At 7 Month High Against Dollar

-నాలుగు రోజుల్లో 80 పైసలు పెరిగిన విలువ
-కలిసొస్తున్న విదేశీ పెట్టుబడుల రాక

ముంబై, మార్చి 14: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్రమేణా బలపడుతున్నది. గురువారం మరో 20 పైసలు పెరిగిన రూపాయి విలువ.. 7 నెలల గరిష్ఠానికి చేరింది. 69.34 వద్ద స్థిరపడింది. గతేడాది ఆగస్టు 10 తర్వాత రూపాయి విలువ ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి. నాడు 68.83గా ఉన్నది. ఇక వరుసగా నాలుగు రోజుల్లో రూపాయి మారకం విలువ 80 పైసలు ఎగబాకడం గమనార్హం. సోమవారం 25 పైసలు, మంగళవారం 18 పైసలు, బుధవారం 17 పైసలు చొప్పున పుంజుకున్నది. దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక ఆశాజనకంగా ఉండటం.. రూపాయి విలువ పెరుగుదలకు దోహదపడుతున్నది. వచ్చే మూడేండ్లకుగాను బ్యాంకులతో డాలర్-రూపీ మార్పిడి ద్వారా వ్యవస్థలోకి 5 బిలియన్ డాలర్లను ప్రవేశపెట్టేలా రిజర్వ్ బ్యాంకు యోచిస్తున్నప్పటికీ రూపాయి మారకం విలువ పెరుగడం విశేషం అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహకర్త వీకే శర్మ అన్నారు.

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్

వరుసగా మూడు రోజులపాటు భారీ లాభాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయడంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ స్వల్పంగా 2.72 పాయింట్లు పెరిగి 37,754.89 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 1.55 పాయింట్లు అందిపుచ్చుకుని 11,343.25 వద్ద నిలిచింది. గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,080.74 పాయింట్లు, నిఫ్టీ 306.30 పాయింట్ల చొప్పున లాభపడిన విషయం తెలిసిందే. ఇక గురువారం ట్రేడింగ్‌లో ఆర్థిక, బ్యాంకింగ్, ఔషధ, విద్యుత్, ఐటీ, ఎనర్జీ, ఆటో రంగాల షేర్లు నష్టపోయాయి. మరోవైపు ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, కొరియా సూచీలు లాభపడితే, చైనా, జపాన్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో మాత్రం జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

1131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles