రోడ్డున పడ్డ 20 వేల జెట్ ఉద్యోగులు

Fri,April 19, 2019 01:18 AM

Save Jet Airways employees appeal to Modi govt

-నిద్ర పట్టడం లేదు.. సిబ్బంది ఆవేదన
-జంతర్‌మంతర్ వద్ద ధర్నా..
- సంస్థను కాపాడాలని డిమాండ్

ముంబై, ఏప్రిల్ 18:రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు.. మా కుటుంబాలను ఆదుకోండి.. 50 ఏండ్ల వయసులో నేనెక్కడికి వెళ్లి ఉద్యోగం వెతుక్కోవాలి.. జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగుల ఆవేదన ఇది. ఓవైపు ఎటూ కదల్లేని విమానాలు.. మరోవైపు ఎక్కడికి వెళ్ళాలో తెలియని సిబ్బంది.. ఇంకోవైపు ఏం చెప్పాలో తోచని యాజమాన్యం. పాతికేండ్లకుపైగా దేశీయ విమానయాన రంగంలో సేవలందించిన జెట్ ఎయిర్‌వేస్ సంస్థలోని ప్రస్తుత పరిస్థితిది. కాదు.. కాదు.. దుస్థితి. రూ.8,500 కోట్లకుపైగా రుణ భారంతో ఎగురలేకపోయిన జెట్ ఎయిర్‌వేస్.. 20 వేల మంది సిబ్బంది జీవితాలను అగమ్యగోచరం చేసింది. కనీస అవసరాల కోసం కాస్త సాయం చేయండంటూ బ్యాంకర్లను వేడుకున్న జెట్ ఎయిర్‌వేస్‌కు నిరాశే మిగిలింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు నిలిచిపోగా, వేలాది మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. దీంతో గురువారం ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగగా, సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విలేఖరులతో మాట్లాడుతూ అత్యవసరాల కోసం భార్య నగల్ని అమ్మేస్తున్నామని, చివరకు మా వాహనాల్నీ అమ్ముకుంటున్నామని తమ బాధను దిగమింగుతూ కష్టాల్ని వివరించారు. ఈ రోజైతే పని లేదు. రేపు ఉంటుందని ఆశిస్తున్నాం అని 24 ఏండ్లుగా జెట్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్ మండల్ విశ్వాసాన్ని కనబరిచారు. తాను 21 ఏండ్లుగా, తన భార్య 16 ఏండ్లుగా జెట్ ఎయిర్‌వేస్‌లో పైలెట్లుగా ఉన్నామని, ఈ ధర్నా.. సంస్థను బతికించుకోవడానికేనని సీనియర్ పైలెట్ రోహిత్ చౌధరి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేక ఫిక్స్‌డ్ డిపాజిట్లనూ ఉపసంహరించుకుంటున్నామని సంస్థలో 17 ఏండ్లుగా పనిచేస్తున్న పైలెట్ రితేశ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించాలని జెట్ విమానాల నిర్వహణ ఇంజినీర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆశిష్ కుమార్ మహంతి డిమాండ్ చేశారు. జెట్ ఎయిర్‌వేస్ చివరి విమాన సర్వీసు బుధవారం అమృత్‌సర్ నుంచి ముంబై మధ్య ప్రయాణించిన విషయం తెలిసిందే. రాత్రి 10:24 గంటలకు అమృత్‌సర్‌లో బయలుదేరిన జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ (వీటీ-ఎస్‌జేఐ నెం. ఎస్2 3502) అర్ధరాత్రి దాటాక 12:22 గంటలకు ముంబై విమానాశ్రయంలో దిగింది. ఈ సందర్భంగా జెట్ సర్వీసులను మిస్సవుతున్నామని పలువురు ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. 25 ఏండ్లకుపైగా దేశీయ విమానయాన రంగంలో జెట్ ఎయిర్‌వేస్ సేవలు కొనసాగాయి.
JetAirways

1992 ఏప్రిల్ 1న స్థాపించబడిన జెట్ ఎయిర్‌వేస్.. 1993 మే 5 నుంచి విమాన సేవల్ని ఆరంభించింది. రూ.8,500 కోట్లకుపైగా రుణ భారాన్ని మోస్తున్న జెట్.. ఈ 13 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రస్తుతం బ్యాంకులకు 51 శాతం, సంస్థ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ దంపతులకు 24 శాతం, ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు 12 శాతం, ఇతరులకు 13 శాతం వాటాలున్నాయి. ఇదిలావుంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ).. జెట్ ఎయిర్‌వేస్ క్లియరింగ్ హౌస్ సభ్యత్వాన్ని తొలగించింది. ఈ నిర్ణయం ప్రయాణీకులకు జెట్ ఎయిర్‌వేస్ రిఫండ్లపై ప్రభావం చూపనున్నది. మరోవైపు జెట్ టికెట్లను బుక్ చేసుకుని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇబ్బంది పడుతున్న ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా తక్కువ ధరలకే ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

ప్రారంభం నుంచీ ఉన్నా..

జెట్ ఎయిర్‌వేస్‌లో దాదాపు 26 ఏండ్లుగా పనిచేస్తున్నానని, సంస్థ సంక్షోభం.. మా భవిష్యత్తును చీకటి చేసిందని 53 ఏండ్ల భోజా పూజారి అనే ఓ లగేజీ హాండ్లింగ్ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాను. దాదాపు రెండు నెలలుగా జీతం లేదు. నాకిద్దరు పిల్లలు. కుటుంబ అవసరాల కోసం ఇల్లు అమ్మేస్తానేమో అని ఒకింత భయాన్ని వెలిబుచ్చారు. నా పిల్లలకు ఏం జరుగుతున్నదో నేను చెప్పలేదన్న ఆయన ఏదో జరుగుతుందన్న భయం మాత్రం వారిలో కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. మరో బ్యాగేజ్ హ్యాండ్లర్ 50 ఏండ్ల అనిల్ సాహు మాట్లాడుతూ మళ్లీ మంచి రోజులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

400లకుపైగా పైలెట్లు జంప్

సంస్థ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయిన నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు.. ఇతర సంస్థల్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపు 400 మంది పైలెట్లు వేర్వేరు ఎయిర్‌లైన్స్‌ల్లోకి వెళ్లారని, మరో 40 మంది కూడా వెళ్లిపోతున్నారని జెట్ పైలెట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్) ఉపాధ్యక్షుడు కెప్టెన్ అసిం వలియాని తెలియజేశారు. అయితే కొందరు సీనియర్ ఉద్యోగులు మాత్రం సంస్థపట్ల విశ్వాసాన్ని చూపుతూ ఉంటున్నారని చెప్పారు. తాను 23 ఏండ్లుగా జెట్‌లో పనిచేస్తున్నానని, తన కింది పైలెట్లకు ఈ సమయంలో ఏం చెప్పాలో తెలియకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జెట్ నిర్ణయంతో ఖాళీ అయిన 440 విమాన శ్లాట్లను ఇతర సంస్థల సర్వీసులకు కేటాయిస్తామని డీజీసీఏ తెలిపింది.

జోక్యం చేసుకోలేం: బాంబే హైకోర్టు

మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. సంస్థను ఆదుకోవాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు రిజర్వ్ బ్యాంక్‌ను ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, జస్టిస్ ఎన్‌ఎం జందర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. జెట్ సంక్షోభం నేపథ్యంలో దాఖలైన రిట్ పిటీషన్‌పై ఈ మేరకు కోర్టు ప్రకటించింది. రూ.400 కోట్ల తక్షణ సాయం చేయాలంటూ బ్యాంకర్లను ఆశ్రయించిన జెట్ నిర్వాహకులకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. దీంతో జెట్ రుణదాతల కూటమికి కేంద్రం, ఆర్బీఐ తగు సూచనలిచ్చి సంస్థను నిలబెట్టేలా ఆదేశాలివ్వాలని పిటీషన్ దాఖలైంది. మరోవైపు తమ పరిధిలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీసీఏ చెబుతున్నది. పునరుద్ధరణ ప్లాన్‌ను దాఖలు చేయాలని కూడా జెట్‌ను కోరింది. అలాగే జెట్ సంక్షోభం నేపథ్యంలో టిక్కెట్ ధరలను పెంచకూడదని, ప్రయణీకులను ఇబ్బందిపెట్టేలా నడుచుకుంటే చర్యలు తప్పవని అన్ని ఎయిర్‌లైన్స్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

5 విమానాల్ని లీజుకివ్వండి: ఏఐ

జెట్ ఎయిర్‌వేస్ విమానాలన్నీ తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఆ సంస్థకు చెందిన ఐదు బోయింగ్ 777 విమానాల లీజుకు ప్రయత్నిస్తున్నది ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. వీటిని లండన్, దుబాయ్, సింగపూర్‌లకు నడుపుతామని ఎస్‌బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్‌కు ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహానీ బుధవారం ఓ లేఖ రాశారు. జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మిగతా అన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసుల సంఖ్యను పెంచుకుంటున్న విషయం తెలిసిందే.

కొనేవారు వస్తారు: బ్యాంకర్లు

జెట్ ఎయిర్‌వేస్‌ను కొనేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని బ్యాంకులు వెలిబుచ్చాయి. సంస్థలో బ్యాంకులకు మెజారిటీ వాటా ఉండగా, దీన్ని అమ్మేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో సమర్థులైన యాజమాన్యం చేతికి జెట్ వెళ్తుందని, పునర్వైభవాన్ని చూస్తుందన్న ధీమాను రుణదాతలు కనబరుస్తున్నారు. ఒకప్పుడు 124 విమానాలతో రోజూ 650 సర్వీసులను నడిపిన జెట్ ఎయిర్‌వేస్.. చివరకు ఐదు విమానాలను కూడా నడుపలేక మూతబడింది. నిజానికి తమ రుణాలను ఈక్విటీగా మార్చుకుని జెట్‌లో 51 శాతం వాటాను అందుకున్న బ్యాంకర్లు.. గత నెల రూ.1,500 కోట్ల తక్షణ సాయం చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే. అయితే బ్యాంకులు వెనుకడుగు వేయడంతో వేరే గత్యంతరం లేక విమాన సేవల్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు జెట్ ప్రకటించింది. మరోవైపు గురువారం బీఎస్‌ఈలో జెట్ షేర్ ధర 32.23 శాతం పడిపోయి రూ.163.9 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 34.62 శాతం క్షీణించింది.

కలలన్నీ కల్లలు

ఎవ్వర్ని కదిలించినా కన్నీటి పర్యంతమే. కష్టాలను ఏకరువు పెడుతున్నవారే. పిల్లల చదువు ఎలా? అని కొందరు.. అనారోగ్యం పాలైన తల్లిదండ్రులకు వైద్యం ఎలా? అని మరికొందరు.. చేసిన అప్పులు తీర్చేది ఎలా? అని ఇంకొందరు.. ఇలా వేల ప్రశ్నలతో వేదనకు లోనవుతున్నారు జెట్ ఉద్యోగులు. మా కలల్ని జెట్ ఎయిర్‌వేస్ చిదిమేసింది అంటూ ఓ ఉద్యోగి కూతురు రాసిన ఆన్‌లైన్ లేఖ.. ప్రస్తుతం జెట్ సిబ్బంది కుటుంబాల ఆవేదనకు అద్దం పడుతున్నది. నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ.. లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన వారిలో కొందరి వద్ద ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. నాలుగు నెలలుగా జెట్ ఎయిర్‌వేస్‌లో జీతాలు లేని విషయం తెలిసిందే. దీంతో గృహ, వాహన ఇతరత్రా రుణాలు తీసుకున్న ఉద్యోగుల నెలసరి వాయిదా చెల్లింపులు పేరుకుపోయాయి. సంస్థ పరిస్థితి చూసి వీరికి కొత్తగా రుణాలు లభించే వీలు కూడా లేకపోయింది. ఫలితంగా తెలిసినవారి దగ్గర కనీస అవసరాల కోసం చేయి చాచి బ్రతుకుతున్నామని పలువుకు ఉద్యోగులు కంటతడి పెట్టారు.

మరో కింగ్‌ఫిషర్ అవుతుందా?

విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరహాలోనే జెట్ ఎయిర్‌వేస్ కూడా మూతబడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థలు తమ చివరి రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితులు, తీసుకున్న నిర్ణయాలూ దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. తొలుత విదేశీ సర్వీసులను, ఆ తర్వాత దేశీయ సర్వీసులను ఆపేశాయి. అయితే అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసిన తర్వాత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. కొన్ని నెలలపాటు దేశీయ విమాన సేవలను అందించగా, జెట్ మాత్రం వారం రోజుల్లోనే గుడ్‌బై చెప్పింది. ఇక 2012 అక్టోబర్ 1న చేసిన ప్రకటనలో అక్టోబర్ 4 వరకు మూడు రోజులపాటు తాత్కాలికంగా సేవల్ని రద్దు చేస్తున్నామని కింగ్‌ఫిషర్ తెలిపింది. మళ్లీ ఇంతవరకు ఆ విమానాలు ఎగురలేదు. దీంతో జెట్ ఎయిర్‌వేస్.. మరో కింగ్‌ఫిషర్ కాకుండా ప్రభుత్వం చూడాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,000 కోట్లకుపైగా బకాయిపడిన నేపథ్యంలో 2016 మార్చిలో విజయ్ మాల్యా లండన్‌కు వెళ్లిపోగా, అదీ జెట్ ఎయిర్‌వేస్ విమానంలోనే ప్రయాణించడం విశేషం.

2295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles