ఎస్బీఐ పండుగ ఆఫర్

Wed,August 21, 2019 04:51 AM

SBI announces a slew of festive offers for retail banking customers

తక్కువ వడ్డీకే రుణాలు గృహాలపై 8.05%, వాహనాలపై 8.70%

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)..వచ్చే పండుగ సీజన్‌లో రుణాలను తీసుకునేవారిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో గృహ, వాహన రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వినియోగదారులు ఈ చౌక రుణాలతోపాటు ప్రాసెసింగ్ ఫీజు ఎత్తివేయనున్న బ్యాంక్..డిజిటల్ రుణాలకు ముందస్తు అనుమతి, అన్ని రకాల రుణాలపై వడ్డీ తీవ్రతను తగ్గించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎప్పటిలోగా తీసుకునే రుణాలకు వర్తించనున్నదో మాత్రం బ్యాంక్ వెల్లడించకపోయినప్పటికీ, వచ్చే పండుగ సీజన్ ముగిసేవరకు తీసుకునే రుణాలకు వర్తించనున్నదని తెలస్తున్నది. మిగతా బ్యాంకులు కూడా ఎస్బీఐ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేసిన బ్యాంక్..8.70 శాతం ప్రారంభ వడ్డీకే వాహన రుణాలను అందిస్తున్నది. కారు రుణాలు కావాలనుకునేవారు బ్యాంక్‌కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ యోనో లేదా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది. ఇలా దరఖాస్తు చేసుకున్నవారికి పావుశాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నది. వేతన జీవులకు కారు మార్కెట్ ధరలో 90 శాతం రుణం ఇవ్వనున్నది బ్యాంక్. ఇటీవల బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)పై 15 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రుణాల్లో వడ్డీని 35 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ 8.05 శాతానికే గృహ రుణాలు అందిస్తున్నది ఎస్బీఐ కావడం విశేషం. ఇటీవల ఈ రుణాలను రెపోరేటుకు అనుసంధానం కూడా చేసింది. వీటితోపాటు రూ.20 లక్షల లోపు వ్యక్తిగత రుణాలపై వార్షిక వడ్డీని 10.75 శాతంగా విధిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ఆరేండ్ల వరకు తిరిగి చెల్లింపులు జరుపుకునే అవకాశం కల్పించింది.

-రూ.5 లక్షల లోపు రుణం కావాల్సిన వేతన జీవులు వారు యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతున్నది. వెంటనే అనుమతి లభించనున్నది.
-రూ.50 లక్షల లోపు విద్యా రుణాలపై ప్రారంభ వడ్డీ 8.25 శాతంగా నిర్ణయించింది. 15 ఏండ్లలోగా ఈ రుణాలను తిరిగి చెల్లింపులు జరిపేందుకు
వీలు కల్పించింది.


59 నిమిషాల్లో గృహ, వాహన రుణాలు


-ప్రత్యేక సేవలను ఆరంభించిన ప్రభుత్వ బ్యాంకులు
రుణాల పరిధిని మరింత పెంచుకోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులైతే ఏకంగా గృహ, వాహన రుణాలను 59 నిమిషాల్లో అందించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించాయి. psbloansin59minutes పోర్టల్ ద్వారా ప్రస్తుతం కోటి రూపాయల వరకు రుణాలను చిన్న, మధ్య స్థాయి వ్యాపారవేత్తలకు అందిస్తుండగా, ఈ పరిధిని రిటైల్ రుణాలకు వర్తించనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఎస్బీఐతోపాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకులు రూ.5 కోట్ల వరకు రుణాన్ని ఈ పోర్టల్ ద్వారా అందిస్తున్నాయి. గృహ, వాహన రుణాలను ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురావడానికి చర్య లు తీసుకుంటున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ స్వాన్ తెలిపారు. మరో బ్యాంకైన ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నది. 59 నిమిషాల్లో సూత్రప్రాయంగా ఆమోదం లభించిన తర్వాత ఆయా సంస్థలకు 7 నుంచి 8 పనిదినాల్లో రుణం మంజూరుకానున్నది. ఎంఎస్‌ఎంఈలకు ఆర్థికంగా చేయూతనందించే ఉద్దేశంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 2018లో ఈ ప్రత్యేక సేవలను ఆరంభించారు. ఈ పోర్టల్ సేవలు ఆరంభించిన నాలుగు నెలల్లో నే రూ.35 వేల కోట్లకు పైగా రుణాల ను మంజూ రు చేసింది. మార్చి 31, 2019 నాటికి 50 వేల దరఖాస్తులు రాగా, వీటిలో 28 వేల ప్రతిపాదనలకు సూత్రప్రాయ అనుమతులు లభించాయి.

1793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles