ఎనిమిది రోజుల ర్యాలీకి బ్రేక్

Sat,March 23, 2019 01:21 AM

Sensex closes 222 points lower on profit booking

-222 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై, మార్చి 22: సెన్సెక్స్ ఎన్నికల ర్యాలీకి బ్రేక్‌పడింది. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివరకు నష్టాలే ఎదురొచ్చాయి. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడటం, మరోవైపు వచ్చే ఏడాది భారత వృద్ది అంచనాను తగ్గిస్తున్నట్లు ఫిచ్ ప్రకటించడంతో అమ్మకాలు పోటెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, రూపాయి పతనమవడం మార్కెట్లలో నెలకొన్న ఆందోళనను మరింత తీవ్రతరం చేసింది. ఒక దశలో 38,452.47 పాయింట్లను తాకిన బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 38,089.36 పాయింట్ల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీ 38,164.61 వద్ద ముగిసింది. దీంతో నిన్నటి ముగింపుతో పోలిస్తే 222.14 పాయింట్లు(0.58శాతం) నష్టపోయింది. సెన్సెక్స్‌తోపాటు నిఫ్టీ కూడా 64.15 పాయింట్లు దిగువకు పడిపోయి 11,456.90 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 140 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభపడినట్లు అయింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకటించగానే మదుపరుల్లో ఆందోళన మరింత తీవ్రతరం చేసిందని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. మార్కెట్లో టాటా మోటర్స్ అత్యధికంగా 2.47 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.44 శాతం, మారుతి 1.84 శాతం, ఎస్‌బీఐ 1.76 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.23 శాతం చొప్పున మార్కెట్ వాటాను కోల్పోయాయి. కానీ, ఎన్‌టీపీసీ 3.67 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. వీటితోపాటు ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్‌లు రెండు శాతం వరకు లాభపడ్డాయి. దేశీయ మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో గడిచిన రెండు వారాలుగా కొనసాగిన సెన్సెక్స్ ర్యాలీకి బ్రేక్ పడిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వు ఈ ఏడాదిలో మళ్లీ వడ్డీరేట్లు పెంచే అవకాశం లేదని స్పష్టంచేసినప్పటికీ మార్కెట్లలో ఆందోళన నెలకొన్నది.

రూపాయి 12 పైసలు డౌన్


రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు తగ్గి రూ.68.95కి జారుకున్నది. ఎగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరుగడం, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనుడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నది. రూ.68.60 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఒక దశలో 69.10 స్థాయికి పడిపోయింది. చివరకు 13 పైసలు నష్టపోయి 68.83 వద్ద ముగిసింది. హోలీ సందర్భంగా గురువారం ఫారెక్స్ మార్కెట్ ముసివేసివుంచారు. అయినప్పటికీ ఈ వారంలో రూపాయి విలువ 15 పైసలు బలపడింది. వరుసగా ఆరు వారాలుగా బలపడినట్లు అయింది.

విమానరంగ షేర్లు పైపైకి


విమానయాన రంగానికి చెందిన షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. ఫిబ్రవరి నెలలో ప్రయాణికుల్లో స్వల్ప వృద్ధి నమోదైందని డీజీసీఏ విడుదల చేసిన నివేదిక ఇందుకు దోహదం చేసింది. దీంతో ఈ రంగ షేర్లు ఏకంగా 7 శాతంవరకు లాభపడ్డాయి. అత్యధికంగా స్పైస్‌జెట్ 7.04 శాతం లాభపడి రూ.98.10కి చేరుకోగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్వల్పంగా పెరిగి రూ.1,425.85 వద్ద ముగిసింది. గడిచిన కొన్ని రోజులుగా భారీగా పడిపోయిన జెట్ ఎయిర్‌వేస్ షేర్లు 3.60 శాతం లాభపడి రూ.225.85 వద్ద ముగిసింది.

899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles