మదుపరి బెంబేలు!

Tue,May 14, 2019 12:58 AM

Sensex falls 1,941 points in nine trading sessions

-9 రోజుల్లో రూ.8.53 లక్షల కోట్ల సంపద ఆవిరి..
-సెన్సెక్స్ 1,941, నిఫ్టీ 600 పాయింట్లు పతనం
-నష్టాల ఊబిలో దేశీయ స్టాక్ మార్కెట్లు..
-వెంటాడుతున్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం
-ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం, ఎన్నికల ఫలితాల భయాలూ కారణం

ముంబై, మే 13: గడిచిన తొమ్మిది రోజుల్లో ఏకంగా రూ.8.53 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు మరి. సోమవారం కూడా సూచీలు లాభాలను చూడలేకపోయాయి. నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రంగంపై నెలకొన్న భయాలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఆందోళనలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ మధ్య మదుపరులు కొనుగోళ్ల వైపునకు వెళ్లలేకపోయారు. ముఖ్యంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మళ్లీ నగదు కష్టాలు వచ్చిపడ్డాయన్న ఆందోళనలు మదుపరులను లాభాల స్వీకరణ వైపునకు నెట్టాయని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 59 పైసలు క్షీణించి 70.51 వద్దకు చేరడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 372.17 పాయింట్లు క్షీణించి 37,090.82 వద్ద నిలువగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 130.70 పాయింట్లు పడిపోయి 11,148.20 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో సెన్సెక్స్ 36,999.84 పాయింట్లు, నిఫ్టీ 11,125.60 పాయింట్ల కనిష్ఠాన్ని తాకాయి. బీఎస్‌ఈలో 1,889 షేర్లు నష్టాలపాలవగా, 575 షేర్లు లాభపడ్డాయి. ఇక 185 షేర్లు స్థిరంగా ఉండగా, సోమవారం ట్రేడింగ్‌లో మొత్తం 289 షేర్ల విలువ 52 వారాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) రూ.1,056.01 కోట్ల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. అయితే దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ) మాత్రం రూ.1,057.91 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం విశేషం.

అమ్మకాల ఒత్తిడిలో సూచీలు

జాతీయ, అంతర్జాతీయ పరిణామాల మధ్య స్టాక్ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న అమ్మకాల ఒత్తిడి లాభాల ముఖమెరుగకుండా చేస్తున్నది. మొత్తం తొమ్మిది రోజుల్లో అటు సెన్సెక్స్ 1,940.73 పాయింట్లు, నిఫ్టీ 599.95 పాయింట్లు దిగజారాయి. గత నెల 26 నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. దీంతో మదుపరుల సంపద రూ. 8,53,788.75 కోట్లు కరిగిపోయింది. ప్రస్తుతం బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ.1,44,55,039.74 కోట్లుగా ఉన్నది. 30 షేర్లున్న సెన్సెక్స్‌లో సన్ ఫార్మా అత్యధికంగా 9.39 శాతం నష్టాలతో ముందు వరుసలో ఉండగా, ఇంట్రా-డేలో షేర్ విలువ 20 శాతానికిపైగా పతనం కావడం గమనార్హం. మరో 22 షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యెస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు 5.58 శాతం వరకు పడిపోయాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ షేర్లు మాత్రం లాభపడ్డాయి. అయితే రంగాలవారీగా హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, పవర్, చమురు, గ్యాస్, మెటల్, ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్ సూచీలు 3.53 శాతం వరకు నష్టపోయాయి. కేవలం ఐటీ సూచీ లాభాల్ని అందుకున్నది. మరోవైపు మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలూ 2.15 శాతం మేర క్షీణించాయి. జెట్ ఎయిర్‌వేస్ షేర్ విలువా 8 శాతానికిపైగా దిగజారింది. బీఎస్‌ఈలో రూ.139.45 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్లూ ఢమాల్

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ఉసురు తీస్తూనే ఉన్నాయి. సోమవారం కూడా ఆసియా, ఐరోపా మార్కెట్లు ఈ కారణంగానే నష్టాలపాలయ్యాయి. ఈ ప్రభావం సహజంగానే భారతీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లలో ప్రధానమైన చైనా, జపాన్, దక్షిణ కొరియా సూచీలతోపాటు, ఐరోపా మార్కెట్లలో కీలకమైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలూ లాభాలకు దూరంగానే ఉన్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్‌లో పీపా ముడి చమురు ధర 1.78 శాతం పెరిగి 71.88 డాలర్లను తాకింది. దీంతో భారత్‌సహా పలు ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లకు చమురు సెగ కూడా తగిలినైట్లెంది.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles