మార్కెట్లకు టీసీఎస్ దన్ను

Tue,April 16, 2019 12:44 AM

Sensex moves up 139 points

-139 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై, ఏప్రిల్ 15: వరుసగా మూడోరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గతేడాది చివరి త్రైమాసికంలో ఐటీ కంపెనీలు అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మార్కెట్లకు జోష్‌నిచ్చింది. ప్రారంభంలో తీవ్ర ఆటుపోటులకు గురైన సూచీలు చివరి గంటలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ ఏడాది సాధారణ స్థాయిలో వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ ముందస్తు అంచనాను విడుదల చేయడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలు మదుపరుల్లో సంతోషాన్ని నింపింది. ఫలితంగా విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు ఎగబడి కొనుగోళ్లు జరుపడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 138.73 పాయింట్లు లాభపడి 38,905.84 వద్ద ముగియగా, నిఫ్టీ మరో 46.90 పాయింట్లు బలపడి 11,690.35 వద్ద స్థిరపడింది. టీసీఎస్‌తోపాటు టాటా మోటర్స్‌లు అత్యధికంగా లాభపడటం సెన్సెక్స్ పుంజుకోవడానికి దోహదపడింది. వీటితోపాటు కోల్ ఇండియా, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటోలు ఐదు శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు సన్‌ఫార్మా, యెస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు నష్టాల్లో ముగిశాయి. 30 రంగాల్లో 19 లాభాల్లో ముగియగా, 11 మాత్రం నష్టాన్ని నమోదు చేసుకున్నాయి. గడిచిన మూడు సెషన్లలో సెన్సెక్స్ 320.49 పాయింట్లు లాభపడింది. రంగాలవారీగా చూస్తే మెటల్, రియల్టీ, ఆటో, టెలికం రంగానికి చెందిన షేర్లు 2.24 శాతం వరకు లాభపడ్డాయి. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి రానుండటంతో మార్కెట్లను లాభాలవైపు నడిపించిందని, కార్పొరేట్ల ఫలితాలు కూడా ఆశావాదంగా ఉండటం ఈ ప్రభావాన్ని మరింత పెంచిందని జియోజిట్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మరిన్ని అంతర్జాతీయ రూట్లకు విమాన సర్వీసులు నడుపనున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు ధర అమాంతం లాభపడింది. ఇంట్రాడేలో 9 శాతానికి పైగా లాభపడిన కంపెనీ షేరు ధర చివరకు 8.56 శాతం ఎగబాకి రూ.119.35 వద్ద ముగిసింది.

వర్షాలతో అవినావ సంబంధం..

వర్షాలకు స్టాక్ మార్కెట్లకు అవినావ సంబంధం ఉన్నది. ఈసారి వర్షపాతం దాదాపు సాధారణంగా కురియనున్నదని వాతావరణ శాఖ అంచనా మార్కెట్లకు జోష్ పెంచనున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గడిచిన కొన్నేండ్లుగా మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకుంటున్నాయి. 2014లో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ముందస్తు అంచనా విడుదల చేసినప్పటికీ సూచీలు ఎగువముఖం పట్టడం విశేషం.

ఇన్ఫోసిస్ డీలా..

ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ఐటీ రంగ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు మిశ్రమ పనితీరు కనబరిచాయి. నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం 17.7 శాతం పెరుగుదలను నమోదు చేసుకోవడంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. దీంతో ఇంట్రాడేలో 5 శాతం వరకు లాభపడ్డ కంపెనీ షేరు ధర చివరకు 4.78 శాతం లాభపడి రూ.2,110.05 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.36, 135.93 కోట్లు పెరిగి రూ.7,91,771.93 కోట్లకు చేరుకున్నది. కానీ, ఈసారి వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితం కానున్నట్లు ఇన్ఫోసిస్ అంచనా వేయడంతో కంపెనీ షేరు ధర ఢమాల్‌మన్నది. ఒక దశలో 4.56 శాతం వరకు నష్టపోయి చివరకు 2.83 శాతం క్షీణించి రూ.726.65 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.9,240 కోట్లు పడిపోయి రూ.3,17,464.40 వద్ద ముగిసింది.

712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles