చుట్టుముట్టిన భయాలు

Sat,October 5, 2019 01:29 AM

-434 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
-బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు ఢమాల్

ముంబై, అక్టోబర్ 4:ఆర్థిక భయాలు చుట్టుముట్టడంతో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేసుకున్నాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు.. ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీరేట్లను పావుశాతం తగ్గించడంతోపాటు ఈసారి వృద్ధి అంచనాను తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన వెలువడేగానే ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. వారాంతం ట్రేడింగ్ ప్రారంభంలో 300 పాయింట్లకు పైగా పెరిగిన సూచీ..బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు ఢమాల్‌మనడంతో ఒకదశలో 770 పాయింట్ల స్థాయిలో పతనం చెందింది. చివరకు 433.56 పాయింట్ల(1.14 శాతం) నష్టంతో 37,673.31 వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 139.25 పాయింట్లు(1.23 శాతం) పతనం చెంది 11,174.75 వద్ద ముగిసింది. ఈవారం మొత్తంలో నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,149.26 పాయింట్లు(2.96 శాతం) క్షీణించగా, నిఫ్టీ 337.65 పాయింట్లు(2.93 శాతం) పతనం చెందాయి. ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిరేటును మళ్లీ ఉత్తేజపరుచాలనే ఉద్దేశంతో రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీరేట్లను పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు వృద్ధి అంచనాను 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించడం మదుపరుల్లో ఆందోళనను మరింత పెంచింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లకు దెబ్బకు ఊగిసలాడుతున్న సూచీల్లో ఈ నిర్ణయం మరింత ఆందోళనకు గురిచేసిందని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటర్స్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్‌ల షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీలు మాత్రం ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి.

వడ్డీరేట్ల సంబంధించిన షేర్లు కుదేలు

వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇందుకు సంబంధించిన రంగాల షేర్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థికం, ఆటో, రియల్టీ రంగ షేర్లు 5 శాతం వరకు పతనం చెందాయి. ఫెడరల్ బ్యాంక్ 3.82 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్ 3.46 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.17 శాతం, ఆర్‌బీఎల్ బ్యాంక్ 2.82 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.79 శాతం, ఎస్బీఐ 2 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.81 శాతం, యెస్ బ్యాంకులు నష్టపోయాయి. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టు 5.28 శాతం నష్టపోగా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 3.61 శాతం, శోభ లిమిటెడ్ 2.54 శాతం, డీఎల్‌ఎఫ్ 1.63 శాతం, ఒబేరాయ్ రియల్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, సన్‌టెక్ రియల్టీలు నష్టపోయాయి. ఆటో రంగ షేర్లులో అమ్మకాలు పోటెత్తాయి. టాటా మోటర్స్ 2.37 శాతం, టీవీఎస్ 2.07 శాతం, ఐచర్ 2 శాతం, మదర్‌సన్ సుబీ 1.96 శాతం, మారుతి సుజుకీ 1.53 శాతం, బజాజ్ ఆటో 1.47 శాతం, ఎంఆర్‌ఎఫ్ 1.33 శాతం, ఆపోలో టైర్స్ షేర్లు క్షీణించాయి. మొత్తంమీద స్టాక్ మార్కెట్లో అన్ని రంగాల షేర్లు తగ్గుముఖం పట్టాయి. 1,636 షేర్లు పతనం చెందగా, కేవలం 976 షేర్లు లాభాల్లో ముగిశాయి. 256 స్టాకులు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకగా, 346 స్టాకులు లోహర్ సర్క్యూట్‌ను తాకాయి. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు క్షీణించి 70.97 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ స్వల్పంగా పెరిగి 58.16 డాలర్ల వద్దకు చేరుకున్నది.

448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles