ఎగిసిన మార్కెట్లు

Sat,September 7, 2019 03:04 AM

Sensex rallies 337 points to close at 36,981

-337 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
-వెలుగులోకి ఆర్థిక, ఐటీ, వాహన షేర్లు
-98 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ

ముంబై, సెప్టెంబర్ 6:గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఆటుపోటులకు గురవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. మందగమనంలో కొనసాగుతున్న దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంపై వచ్చే నెలలో మరోమారు చర్చలు జరుగనుండటంతో మార్కెట్లలో జోష్ పెంచింది. ప్రారంభం నుంచి లాభాల బాట పట్టిన సూచీలు ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ బీఎస్‌ఈ సెన్సెక్స్ 337.35 పాయింట్లు(0.92 శాతం) లాభపడి 36,981.77 వద్దకు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 98.30 పాయింట్లు అందుకొని 10,946.20 వద్ద ముగిసింది. శుక్రవారం లాభపడినప్పటికీ మొత్తం మీద ఈ వారంలో నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. కేవలం నాలుగు రోజుల పాటు జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 351.02 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 77.05 పాయింట్లు కోల్పోయింది. జీఎస్టీ రేటు తగ్గింపు విషయం జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందని, మిగతా అన్ని రకాలుగా ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన మార్కెట్లలో ఉత్తేజాన్ని నింపిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పటికీ ర్యాలీ కొనసాగడం విశేషమన్నారు. రంగాలవారీగా చూస్తే ఆటో, ఇంధనం, మెటల్, యుటిలిటీ, ఇంధనం, బ్యాంకెక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆర్థిక రంగ షేర్లు లాభాల్లో కదలాడాయి. ఇదే సమయంలో రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు మాత్రం నష్టాలపాలయ్యాయి.

భారీగా లాభపడ్డ టెక్ మహీంద్రా

దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ టెక్ మహీంద్రా షేరు భారీగా లాభపడింది. అమెరికాకు చెందిన ఏటీఅండ్‌టీ సంస్థతో కొన్నేండ్లపాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించడంతో ఒక దశలో నాలుగు శాతానికి పైగా లాభపడిన షేరు చివరకు 3.77 శాతం లాభంతో రూ.721.55 వద్ద ముగిసింది. వీటితోపాటు మారుతి, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, టాటా మోటర్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కొటక్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల షేర్లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి. వేదాంతా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్బీఐల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. కానీ, యెస్ బ్యాంక్ 2.42 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీల షేర్లు మాత్రం తగ్గుముఖం పట్టాయి.

వాహన షేర్లకు డిమాండ్..

సంక్షోభంలో కూరుకుపోయిన వాహన రంగ సంస్థలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఈ రంగ షేర్లకు ఆక్సిజన్‌లా పనిచేసింది. మార్కెట్లో ఈ రంగ షేర్లు ఏకంగా నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. వీటిలో ఐచర్ మోటర్స్ 4.26 శాతం లాభపడగా, మారుతి సుజుకీ 3.61 శాతం, బజాజ్ ఆటో 2.90 శాతం, టీవీఎస్ మోటర్ 2.79 శాతం, టాటా మోటర్స్ 2.58 శాతం, మహీం ద్రా అండ్ మహీంద్రా 2.34 శాతం, హీరో మోటోకార్ప్ 2.14 శాతం లాభపడ్డాయి. వీటితోపాటు ఈ రంగానికి అనుబంధంగా ఉన్న ఎంఆర్‌ఎఫ్ 1.60 శాతం, బోష్ 1.63 శాతం, అశోక్ లేలాండ్ 1.27 శాతం, మదర్‌సన్ స్యూమి సిస్టమ్ 1.23 శాతం పెరిగాయి.

ఫారెక్స్ రిజర్వుల్లో క్షీణత

గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో కదలాడిన విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. ఆగస్టు 30తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వులు 446 మిలియన్ డాలర్లు తగ్గి 428.604 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ 1.45 బిలియన్ డాలర్లు తగ్గి 429.050 డాలర్లకు పరిమితమయ్యాయి. గత నెలలో రికార్డు స్థాయి 430.572 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకం నిల్వలు ఆ తర్వాత తిరోగమన బాటపట్టాయి. గతవారాంతానికి విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.124 బిలియన్ డాలర్లు తగ్గి 396 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అలాగే పసిడి రిజర్వులు మాత్రం 682 మిలియన్ డాలర్లు ఎగబాకి 27.55 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.

మూడోరోజు పెరిగిన రూపాయి

రూపాయి మరింత బలపడింది. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో వరుసగా మూడోరోజు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు అందుకొని 71.72కి చేరుకున్నది. గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో కరెన్సీ విలువ 67 పైసలు బలపడినట్లు అయింది. 71.87 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ చివరకు 71.72 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో కరెన్సీ 30 పైసలు నష్టపోయింది. వచ్చేవారంలో మారకం విలువ 71.40 నుంచి 72.25 మధ్యస్థాయిలో కదలాడవచ్చని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.

371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles