మార్కెట్లకు ఫెడ్ దెబ్బ

Fri,September 20, 2019 01:39 AM

-470 పాయింట్లు నష్టపోయిన సూచీ..
-ఏడు నెలల కనిష్ఠానికి నిఫ్టీ

ముంబై, సెప్టెంబర్ 19: స్టాక్ మార్కెట్లలో మరో అలజడి. ఇప్పటికే ఆర్థిక మాంద్యం దెబ్బకు తీవ్ర ఊగిసలాటలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లకు అమెరికా ఫెడరల్ రిజర్వు రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదన్న అంచనాలు, మందకొడి పరిస్థితులు మదుపరులను ఆందోళనకు గురిచేశాయి. ఫలితంగా ప్రారంభం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వడ్డీరేట్లను పావుశాతం తగ్గిస్తున్నట్లు ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకున్నారు. 626 పాయింట్ల స్థాయిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 470.41 పాయింట్లు(1.29 శాతం) పతనం చెంది 36,093.47 వద్దకు జారుకున్నది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా మరో 135.85 పాయింట్లు(1.25 శాతం) క్షీణించి 10,704.80 వద్దకు చేరుకున్నది. నిఫ్టీ ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం గడిచిన ఏడు నెలల్లో ఇదే తొలిసారి. ఫిబ్రవరి 19న నిఫ్టీ 10,604 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు అందుకొని 71.34 వద్ద ముగిసింది.

పడేసిన ట్యాక్స్ వసూళ్లు, యెస్ బ్యాంకు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పన్ను వసూళ్లు కేవలం 4.7 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేయడం మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమైంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 17 శాతం వృద్ధిని ఆశించింది. వీటితోపాటు యెస్ బ్యాంక్ షేరు ధర ఏకంగా 15 శాతానికి పైగా పడిపోవడం కూడా మరో కారణం. బ్యాంక్ షేరు ధర 15.52 శాతం పతనం చెంది రూ.54.15 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,046.07 కోట్లు తగ్గి రూ.13,809.93 వద్ద ముగిసింది. వీటితోపాటు ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు కూడా మూడు శాతానికి పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి. టాటా స్టీల్, మారుతి, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, వేదాంతా, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, టీసీఎస్‌లు 3.66 శాతం వరకు నష్టపోయాయి. కేవలం టాటా మోటర్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్‌లు రెండు శాతం వరకు బలపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఇంధనం, చమురు అండ్ గ్యాస్, బ్యాంకెక్స్, మెటల్, రియల్టీ, ఆటో, హెల్త్‌కేర్, టెక్, ఐటీల షేర్లు దిగువముఖం పట్టగా, టెలికం మాత్రం స్వల్పంగా కోలుకున్నది.

రూ.1.65 లక్షల కోట్ల సంపద హరి

స్టాక్ మార్కెట్ల భారీ పతనం మదుపరుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇప్పటికే భారీగా నష్టపోయిన పెట్టుబడిదారులు గురువారం కూడా రూ.1.65 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోవడంతో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ. 1,65,437.91 కోట్లు తగ్గి రూ.1,38,54,439.41 కోట్లకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా అమ్మకాలకు మొగ్గుచూపడం, ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించడంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ కొరవడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు తగ్గుతాయన్న అంచనాలు నెలకొనడం, మరోవైపు చమురు ధరలు ఎగబాకుతుండటం, ఇప్పట్లో కేంద్రం ఉద్దీపన ప్యాకేజి ప్రకటించే అవకాశాలు లేకపోవడం మార్కెట్ల పతనాన్ని శాసించాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles