హైదరాబాద్‌లో సర్వీస్‌నౌ

Sat,August 10, 2019 01:16 AM

ServiceNow opens development centre in Hyderabad

-ప్రారంభించిన ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్

హైదరాబాద్, ఆగస్టు 9: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ సర్వీస్‌నౌ.. ప్రపంచంలో రెండో అతిపెద్ద సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ఇంజినీరింగ్ హెడ్ రావు సూరపనేని మాట్లాడుతూ..నాలుగేండ్ల క్రితం కేవలం ఇద్దరు సిబ్బందితో ప్రారంభమైన సెంటర్ ప్రస్తుతం వేలాది మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదిగిందన్నారు. అమెరికా తర్వాత ఏర్పాటైన ఈ అతిపెద్ద సెంటర్‌లో రెండు వేలకు పైగా మంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ వల్లనే గడిచిన ఐదేండ్లలో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించినట్లు, ఇక్కడ నైపుణ్యం కలిగిన వారు అత్యధిక మంది లభిస్తుండటం కూడా సెంటర్‌ను విస్తరించడానికి పరోక్షంగా దోహదం చేసిందన్నారు. వచ్చే తొమ్మిది నుంచి 12 నెలల్లో మరో అతిపెద్ద సెంటర్‌ను ఇక్కడే నెలకొల్పే అవకాశం ఉందన్నారు. 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో 400 నుంచి 600 మంది సిబ్బంది పనిచేసుకోవచ్చునని చెప్పారు.

ఏడాదిలోగా 1,200 మంది సిబ్బంది

టెక్నాలజీ రంగానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సంస్థ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ క్లస్టర్‌లో అతిపెద్ద సర్వీసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన సంస్థ..వచ్చే ఏడాదిలోగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నూతన సెంటర్ ద్వారా మరో 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సెంటర్ కంపెనీ నూతన ఆవిష్కరణలు, విధానాల్లో కీలక పాత్ర పోషించనున్నది. భవిష్యత్తులో ఉద్యోగులు మెరుగైన రీతిలో పనిచేసేందుకు అనువైన పరిస్థితులను కల్పించనున్నట్లు చెప్పారు.

టాస్క్‌లోకి 100 కాలేజీలు: జయేశ్ రంజన్

రాష్ట్రంలో నైపుణ్యం శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటైన టాస్క్‌లో మరికొన్ని కళాశాలను చేర్చనున్నట్లు జయేశ్ రంజన్ చెప్పారు. ప్రస్తుతం ఈ టాస్క్‌లో 20 కాలేజీలు ఉండగా..ఈ ఏడాది చివరినాటికి వీటిని 100కి పెంచాలనుకుంటున్నట్లు సర్వీస్‌నౌ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన చెప్పారు. టాస్క్ ద్వారా శిక్షణ పొందిన వారిలో ఎంతో మంది ఉపాధి అవకాశాలు లభించాయని, ముఖ్యంగా సర్వీస్‌నౌ కూడా పలువురు ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles