వడ్డీరేట్లను ఇంకా తగ్గిస్తాం!

Fri,September 20, 2019 12:47 AM

-ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

ముంబై, సెప్టెంబర్ 19: మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పరుగులు పెట్టించేందుకు మరిన్ని సంస్కరణలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు పెరుగుతున్న వేళ నిర్మాణాత్మక సంస్కరణలు ఎంతో కీలకమన్నారు. ఈ క్రమంలోనే వృద్ధిరేటును పెంచేందుకు ఆర్బీఐ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందని స్పష్టం చేసిన ఆయన వడ్డీరేట్లను ఇంకా తగ్గిస్తామని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే గత నాలుగు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 110 బేసిస్ పాయింట్ల మేర దాస్ కోత పెట్టిన విషయం తెలిసిందే. చివరి సమీక్షలో ఏకంగా 35 బేసిస్ పాయింట్లను దించిన సంగతీ విదితమే. గురువారం ఇక్కడ బ్లూంబర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరంలో దాస్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, వచ్చే ఏడాది కాలంలో 4 శాతం దిగువనే నమోదు కాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ మాంద్యం ఇంకా మొదలు కాలేదన్నారు. విదేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటున్నదన్న దాస్.. జీడీపీలో విదేశీ రుణభారం 19.7 శాతంగానే ఉందని గుర్తుచేశారు. కాగా, ఎగుమతులు, దిగుమతుల వాణిజ్యం పడిపోవడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తాజాగా తగ్గించిన వడ్డీరేట్లతో భారత్‌లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగవచ్చని అంచనా వేశారు. అయితే ఈ నిధుల స్వభావాన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)కు రుణాల పునరుద్ధరణ మొండి బకాయిలను పెంచే వీలుందని బ్యాంకులను దాస్ హెచ్చరించారు.

సౌదీ ప్రభావం తక్కువే

ప్రపంచంలోని ముడి చమురు దిగుమతిదారులను వణికిస్తున్న సౌదీ అరేబియా సంక్షోభం ప్రభావం.. భారత్‌పై పెద్దగా ఉండకపోవచ్చని దాస్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై పరిమిత స్థాయిలోనే ప్రభావం ఉండవచ్చని అంచనా వేశారు. అయినప్పటికీ విదేశీ ఒడిదుడుకులను దగ్గరగా గమనిస్తామని స్పష్టం చేశారు.

674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles