ఫలితాలు, స్థూల ఆర్థికాంశాలు కీలకం

Mon,April 15, 2019 01:18 AM

-స్టాక్ మార్కెట్లకు దిశా-నిర్దేశం చేయనున్న అంశాలు
-ఈ వారం మూడు రోజులే ట్రేడింగ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, దేశీయ స్థూల ఆర్థికాంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ వారంలో స్టాక్ మార్కెట్లు మూడు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరుగనున్నది. మహవీర్ జయంతి సందర్భంగా మంగళవారం, గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం మార్కెట్లు సెలవుపాటించనున్నాయి. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం విడుదలకానున్నాయి. గత శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత విడుదలైన పారిశ్రామిక వృద్ధిరేటు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశావాదంగా ఉండటంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చునని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించే అవకాశాలున్నాయి. ఈ వారంలో రెండో దఫా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం, గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను కార్పొరేట్ సంస్థలు విడుదల చేయనున్న ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్లకు కీలకం కానున్నాయని బీఎన్‌పీ పరిబాస్ హెడ్ హేమంగ్ జానీ తెలిపారు. ఫలితాలు అంచనాలకుమించి నమోదు చేసుకుంటే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నదని, అలాగే ఇంధన కంపెనీలు వృద్ధిని నమోదు చేసుకుంటే స్టాక్ మార్కెట్ల దౌడుతీయనున్నయని ఆయన చెప్పారు. వీటితోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ గమనం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు కార్పొరేట్ల ఫలితాలపై మదుపరులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 18న జరుగబోతున్నాయి. ఫలితాలు మాత్రం వచ్చే నెల 23న విడుదల కానున్నాయి. గత శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 160.10 పాయింట్లు పెరిగి 38,767.11 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 46.75 పాయింట్లు బలపడి 11,643.45 వద్ద స్థిరపడింది. మొత్తంమీద గత వారంలో సెన్సెక్స్ 95 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 22.5 పాయింట్లు పతనం చెందింది.

బ్లూచిప్ కంపెనీలకు షాక్


గడిచిన కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన బ్లూచిప్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టాప్-10 బ్లూచిప్ కంపెనీల్లో ఆరింటి మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.42, 827.39 కోట్లు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. వీటిలో ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా పతనమైంది. ఐటీసీ, హెచ్‌యూఎల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు లా భపడగా..రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐలు అత్యధికంగా నష్టపోయాయి. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.14,146.5 కోట్లు తగ్గి రూ.7,55, 636.47 కోట్లకు పరిమితమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ కూడా రూ.9,967.3 కోట్లు జారుకొని రూ.6,16, 869.80 కోట్లకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.8, 327.77 కోట్లు తగ్గి రూ. 8,50,628.63 కోట్లకు పడిపోయ్యాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ నికర విలువ కూడా రూ. 5,198.74 కోట్లు తగ్గి రూ.3,48,806.25 కోట్లకు, ఇన్ఫోసిస్ రూ.3,669.90 కోట్లు తగ్గి రూ.3,26, 730.54 కోట్లకు, ఎస్‌బీఐ రూ. 1,517.19 కోట్లు కరిగిపోయి రూ. 2,81,393 కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ఐటీసీ మార్కె ట్ విలువ మాత్రం రూ.13,424.20 కోట్లు పెరిగి రూ. 3,74,623.78 కోట్లకు, హెచ్‌యూఎల్ రూ. 13,237.17 కోట్లు పెరిగి రూ. 3,72,515.16 కోట్లుకు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,540.65 కోట్లు ఎగబాకి రూ. 2,54,278.86 కోట్లకు పెరిగింది.

ఈక్విటీలది దూకుడే..

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం దూకుడును ప్రదర్శించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అమెరికా, బ్రిటన్‌లతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలైన చైనా, బ్రెజిల్ మార్కెట్లు సింగిల్ డిజిట్‌కు పరిమితమవగా.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 17.3 శాతం ఎగబాకగా, నిఫ్టీ 14.9 శాతం లాభపడ్డాయి. అమెరికా సూచీ 7.6 శాతం, బ్రిటన్ 3.2 శాతం, చైనా(-2.5 శాతం), బ్రెజిల్ 11.8 శాతం, జపాన్ -1.2 శాతం, దక్షిణ కొరియా -12.5 శాతం, హాంకాంగ్ -3.5 శాతం చొప్పున పనితీరును కనబరిచాయి. అంతక్రితం ఏడాదిలోనూ బ్రిటన్, చైనా దేశాల మార్కెట్ల కంటే యూఎస్, బ్రెజిల్, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, భారత్‌లకు చెందిన సూచీలు మెరుగైన వృద్ధిని నమోదు చేసుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లో లిైస్టెన కంపెనీల విలువ మరో ఆరు శాతం పెరిగి రూ.151 లక్షల కోట్లకు చేరుకున్నది. మరోవైపు మ్యూచువల్ ఫండ్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ 11.4 శాతం పెరిగి రూ.24 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

1254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles