జోరు హుషారు..

Thu,October 10, 2019 02:14 AM

-భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
-సెన్సెక్స్ 646, నిఫ్టీ 187 పాయింట్ల లాభం
-బ్యాంక్, ఆర్థిక సేవల షేర్లకు డిమాండ్

ముంబై, అక్టోబర్ 9:దలాల్ స్ట్రీట్‌లో దీపావళి పటాకులు ముందేపేలాయి. వరుసగా ఆరు రోజులపాటు భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల జోష్ కనిపించింది. దసరా మరుసటి రోజే బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్లకు మదుపరుల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. మధ్యాహ్నం వరకు స్వల్ప లాభాలతో కొనసాగిన సూచీలు..ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ బొనాంజను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనతో సెన్సెక్స్ మళ్లీ 38 వేల మార్క్‌ను దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 645.97 పాయింట్లు(1.72 శాతం) లాభపడి 38,177.95కు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 186.90 పాయింట్లు అధికమై 11,313.30 వద్ద ముగిసింది. కరువు భత్వం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటన మదుపరుల్లో సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని మార్కెట్ పండితులు అంచనావేస్తున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక, టెలికం రంగ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరిగాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 5.45 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, కొటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు షేర్లు కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి.

యెస్ బ్యాంక్‌కు తప్పని తిప్పలు

స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే యెస్ బ్యాంక్ మాత్రం పాతాళంలోకి పడిపోతున్నది. బ్యాంక్ ప్రమోటర్లు తమ వాటాను విక్రయిస్తుండటం, ఆర్థిక పరిస్థితులు నీరుగారుతుండటంతో గత పదిహేను రోజులుగా బ్యాంక్ షేరు భారీగా క్షీణించింది. బుధవారం కూడా బ్యాంక్ షేరు మరో 5.26 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. హీరో మోటోకార్ప్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటోల షేర్లు మూడు శాతం వరకు పతనం చెందాయి. చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు కనిపించాయని, ముఖ్యంగా నిఫ్టీ 11,300 పాయింట్ల పైకీ చేరుకున్నదని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నిధుల లభ్యతను పెంచడానికి మరోదఫా వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న సంకేతాలు మార్కెట్లు పుంజుకోవడానికి దోహదం చేశాయన్నారు. కార్పొరేట్ల ఫలితాలు ఆశాజనకంగా ఉండనున్నట్లు మదుపరులు భావిస్తున్నారు. రంగాల వారీగా చూస్తే టెలికం అత్యధికంగా 4.92 శాతం లాభపడగా, బ్యాంకింగ్ 3.67 శాతం, ఫైనాన్స్ 2.84 శాతం, మెటల్ 2.12 శాతం, రియల్టీ 1.99 శాతం, బేసిక్ మేటిరియల్స్ 1.95 శాతం, ఇంధనరంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు మాత్రం నష్టపోయాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 1 శాతం పెరిగి 58.77 డాలర్లు పలికింది. కాగా, వివిధ ఆర్గనైజేషన్ల నుంచి 300 బస్సుల ఆర్డర్ వచ్చినట్లు బీఎస్‌ఈకి సమాచారం ఇవ్వడంతో జేబీఎం ఆటో షేరు ఏకంగా 20 శాతంవరకు లాభపడింది. చివరకు 19.73 శాతం ఎగబాకి రూ.224.55 వద్ద ముగిసింది. యూఎస్‌ఎఫ్‌డీఏ పరిశీలనలో లేవనెత్తిన అంశాలపై స్పష్టతనివ్వడంతో అరబిందో ఫార్మా షేరు మూడు శాతం లాభపడింది.

హెచ్‌డీఐఎల్ షేరు ఢమాల్

హౌజింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ షేరు ఢమాల్‌మన్నది. కంపెనీ షేరు ధర ఐదు శాతం పడిపోవడంతో తక్కువ సర్క్యూట్‌ను తాకినట్లు అయింది. షేరు ధర 4.73 శాతం పతనం చెంది రూ.3.02కి జారుకున్నది. 52 వారాల తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. గడిచిన 17 సెషన్లలో కంపెనీ షేరు ధర 52.8 శాతం క్షీణించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేరు కూడా 9.86 శాతం తగ్గి తక్కువ సర్క్యూట్‌ను తాకింది.

రూపాయికి స్వల్ప నష్టం

స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకుంటే రూపాయికి మాత్రం చిల్లులు పడ్డాయి. వాణిజ్యంపై అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండటంతో అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గింది. 71.20 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఒక దశలో 70.94కి చేరుకోగా, చివరకు 71.07 వద్ద ముగిసింది.

307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles