ఒక్కరోజే రూ.1,065 కోట్లు ఆవిరి

Fri,November 8, 2019 12:21 AM

-భారీగా నష్టపోయిన లెగో ప్రమోటర్ కిర్క్‌బీ
-కుప్పకూలిన ఐఎస్‌ఎస్ షేర్లు

బిల్లుండ్, నవంబర్ 7: డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ బొమ్మల తయారీ సంస్థ లెగో ఏ/ఎస్ యాజమాన్యం.. ఒక్క రోజే వందలాది కోట్ల రూపాయలను నష్టపోయింది. లెగో మాతృ సంస్థ కిర్క్‌బీ ఏ/ఎస్ బుధవారం దాదాపు రూ.1,065 కోట్ల నష్టాలను చవిచూసింది. కిర్క్ క్రిస్టెయిన్సన్ కుటుంబ ప్రైవేట్ హోల్డింగ్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థే ఈ కిర్క్‌బీ ఏ/ఎస్. లెగో ఏ/ఎస్‌లో 75 శాతం వాటా కిర్క్‌బీదే. రెన్యువబుల్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్ రంగాలతోపాటు పలు సంస్థల్లో దీనికి పెద్ద ఎత్తున పెట్టుబడులున్నాయి. డెన్మార్క్‌కే చెందిన సేవా రంగ సంస్థ ఐఎస్‌ఎస్ ఏ/ఎస్‌లోనూ కిర్క్‌బీకి పెట్టుబడులుండగా, స్టాక్ మార్కెట్‌లో ఐఎస్‌ఎస్ మార్కెట్ విలువ బుధవారం ఏకంగా 20 శాతం క్షీణించింది.

దీంతో కిర్క్‌బీ సంపద కూడా ఒక్కసారిగా కరిగిపోయింది. మొత్తం నష్టాల్లో కిర్క్‌బీ వాటానే 15 శాతంగా ఉంది మరి. ఐఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా భాగస్వామ్య పెట్టుబడుల రకానికి చెందిన హెడ్జ్-ఫండ్ ఊహాగానాలు పుట్టుకువచ్చాయి. భారీ క్లయింట్లే మా లక్ష్యమని, చిన్న కస్టమర్లు కాదని ఐఎస్‌ఎస్ సీఈవో జెఫ్ గ్రావెన్‌హాస్ట్ చేసిన వ్యాఖ్యలు కొంప ముంచాయి. ఇవి మదుపరులకు ఎంతమాత్రం రుచించకపోవడంతో లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా భీకర నష్టాలు తప్పలేదు. వెంటనే సదరు సీఈవో దిద్దుబాటు చర్యలను ప్రారంభించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. గురువారం కూడా ఐఎస్‌ఎస్ షేర్లు నష్టాల్లోనే కదలాడాయి. ఈ వ్యవహారంపై సంస్థ చైర్మన్ అల్లెన్ కూడా స్పందించగా, కిర్క్‌బీ మాత్రం నిరాకరించింది.

327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles