గంటకు 28 కోట్ల సంపద

Mon,August 12, 2019 02:39 AM

The Walmart Heirs Get 4 Million Richer Every Hour

-పరుగులు పెడుతున్న ప్రపంచ కుబేర కుటుంబాల ఆస్తుల విలువ..
-అగ్రస్థానంలో వాల్‌మార్ట్ వ్యవస్థాపక వంశం..
-తొమ్మిదో స్థానంలో ముకేశ్ అంబానీ

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రపంచ సంపన్న కుటుంబాల సంపద.. నిమిషానికి 70 వేల డాలర్లు, గంటకు 40 లక్షల డాలర్లు, రోజుకు 10 కోట్ల డాలర్లు చొప్పున పెరిగిపోతున్నది. మన కరెన్సీలోనైతే ఈ వరుస క్రమం రూ.49.72 లక్షలు, రూ.28.41 కోట్లు, రూ.714 కోట్లుగా ఉన్నది. అంతెందుకు ఈ వార్తను మీరిప్పటిదాకా చదివిన సమయంలోనే ఈ శ్రీమంతుల సంపద 23 వేల డాలర్లు (రూ.16.33 లక్షలపైనే) పెరిగిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ వ్యవస్థాపకులైన వాల్టన్ వంశీయుల సంపద ఈ సంపన్న కుటుంబాల్లోనే టాప్‌లో కదలాడుతున్నది. గతేడాది జూన్ నుంచి చూస్తే వాల్టన్ల సంపద ఏకంగా 39 బిలియన్ డాలర్లు ఎగబాకి 191 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికాలో వాట్సన్ కుటుంబం తరహాలోనే మరికొన్ని వ్యాపార, పారిశ్రామిక కుటుంబాల సంపద ఈ ఏడాది కాలంలో విపరీతంగా పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదిక చెబుతున్నది. చాక్లెట్ల తయారీదారులైన మార్స్ కుటుంబీకుల సంపద 37 బిలియన్ డాలర్లు ఎగిసి 127 బిలియన్ డాలర్లను తాకింది. కోచ్ కుటుంబ సంపద 26 బిలియన్ డాలర్లు పెరిగి 125 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మొత్తంగా చూసినైట్లెతే అమెరికాలోని 0.1 శాతం సంపన్నుల సంపద.. మిగతా ప్రపంచ దేశీయుల సంపద కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటున్నది. 1929 నుంచి ఇదే ఆనవాయితీ అంటే అర్థం చేసుకోవచ్చు.. సంపద సృష్టిలో అగ్రరాజ్యం దూకుడు ఎలా ఉందోనని. అయితే ఇప్పుడిప్పుడు ఆసియా, ఐరోపా దేశాలవారూ సంపదలో అమెరికాకు పోటీనిస్తున్నారు.
list

ఆర్థిక అసమానత్వం

ఓ వైపు ప్రపంచ కుబేరుల సంపద క్షణక్షణానికి ఆకాశమే హద్దుగా పెరుగుతూపోతుంటే.. మరోవైపు జింబాబ్వే వంటి ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు పాతాళానికి పడిపోతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక అసమానత్వంపై పలువురు విమర్శకులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. పేద-ధనిక వర్గాల మధ్య ఈ అగాథం ఎప్పుడు తొలగిపోతుందన్న ప్రశ్నలు వారి నుంచి వినిపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో ప్రతి పది మందిలో ఒకరు కేవలం 2 డాలర్ల కంటే తక్కువతోనే జీవనం సాగిస్తున్నారని బ్లూంబర్గ్ వర్గాలూ చెబుతుండటం గమనార్హం.

రూ.100 లక్షల కోట్లు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 సంపన్న కుటుంబాల సంపద విలువ ఎంతో మీకు తెలుసా?.. 1.4 లక్షల కోట్ల డాలర్లు (డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం రూ.100 లక్షల కోట్లు). నిరుడుతో చూస్తే 24 శాతం పెరుగడం గమనార్హం. సకల వ్యాపారాలు చేస్తున్న ఈ కుటుంబాల ఆస్తులు ఏటేటా పెరిగిపోతున్నాయని బ్లూంబర్గ్ తెలియజేసింది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ (జీడీపీ)ల విలువ కంటే ఇందులోని ఒక్కో కుటుం బం సంపద విలువే ఎక్కువగా ఉండటం విశేషం. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సంపద కూడా 7 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లను దాటింది.

4046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles