రాయితీలు రద్దు?

Mon,February 11, 2019 01:00 AM

US considers withdrawal of zero tariffs for India

-భారత్‌కు షాకివ్వబోతున్న అమెరికా
-దేశీయ ఎగుమతులపై విషం చిమ్మనున్న ట్రంప్
-రూ.40 వేల కోట్ల జీరో టారీఫ్‌ల ప్రయోజనం వెనక్కి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయంటూ ప్ర పంచ దేశాలపై అక్కసు వెళ్లగక్కుతున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు భారత వాణిజ్య అవకాశాలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతుల్లో సుంకాల మినహాయింపున్న వాటిపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నారు. జీరో టారీఫ్‌లను వెనుకకు తీసుకునే యోచనలో ట్రంప్ ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇదే జరిగితే భారత్‌కు దాదాపు రూ.40,000 కోట్ల నష్టం తప్పదు. అమెరికాకు భారత్ ఎగుమతుల్లో 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సుంకాల రాయితీ లభిస్తున్నది. ఈ ఎగుమతులకు ఎలాంటి సుంకాలు వర్తించవు. అయితే వాణిజ్య రాయితీని ఆపేయాలని ట్రంప్ ఇప్పుడు చూస్తున్నట్లు సదరు వర్గాలు చెబుతున్నాయి. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్‌పీ) ప్రయోజనాలను భారత్‌కు నిలిపివేసేలా అమెరికా పరిశీలిస్తున్నది. కేంద్ర ప్రభు త్వం ఇటీవల అమలుపరిచిన కొత్త ఈ-కామర్స్ పాలసీ.. అమెరికాకు చెందిన అమెజాన్, వాల్‌మార్ట్‌లను విపరీతంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ సర్కారు పోకడ ప్రాధాన్యంను సంతరించుకున్నది.

జీఎస్‌పీ అంటే?..


ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధి బలోపేతానికిగాను అమెరికా ఈ జీఎస్‌పీ పథకాన్ని ఆచరణలో పెట్టింది. ఈ పథకంలో భాగంగా 129 దేశాలు, రాజ్యాలకు గరిష్ఠంగా 4,800 ఉత్పత్తుల వరకు సుంకాల మినహాయింపు లభిస్తుంది. అమెరికాకు చేసే వాణిజ్య ఎగుమతుల్లో ఈ ప్రయోజనాన్ని ఆయా దేశాలు పొందవచ్చు. ఇలా లాభం పొందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉన్నది. 1970 నుంచి జీఎస్‌పీ ఆచరణలోకి వచ్చింది.

ట్రంప్ దుందుడుకు వైఖరి


ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నలా ఉన్న అమెరికాను.. అన్నివిధాలా ట్రంప్ అబాసుపాలు చేస్తున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు అసలుసిసలు చిరునామాగా ఉన్న అగ్రరాజ్యానికి ట్రంప్ దుందుడుకు వైఖరి తలనొప్పిగా పరిణమించిందిప్పుడు. విశాల భావాలు కలిగిన అమెరికాకు సంకుచిత స్వభావాన్ని అలవరుస్తున్న ట్రంప్.. ఇతర దేశాలపై తన వివాదాస్పద నిర్ణయాలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. స్థానికులకే ఉద్యోగాలన్న నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్.. ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేసిన సంగతీ విదితమే. దీంతో అమెరికా ఉద్యోగావకాశాలు విదేశీయులకు దూరమయ్యాయి. ఇక ఇతర దేశాలతో అమెరికా వాణిజ్యం లోటులో ఉందం టూ సుంకాల పోరుకు తెరతీశారు. అమెరికా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న చైనాపై వేల కోట్ల డాలర్ల సుంకాలను బాదుతున్నది చూస్తూనే ఉన్నాం. ఇది వాణిజ్య యుద్ధానికి దారితీయగా, ఇప్పుడు భారత్‌పైనా సుంకాల సమరానికి ట్రంప్ కాలుదువ్వుతున్నారు. ఒకప్పుడు శాంతి, సౌభ్రాతృత్వాలకు నెలవైన అమెరికాను నిలువెత్తు స్వార్థానికి నిదర్శనంగా ట్రంప్ మారుస్తున్నారు.

భారత్‌కు పెద్ద దెబ్బే


సుంకాల మినహాయింపును అమెరికా సర్కారు ఉపసంహరించుకుంటే భారత్‌పై తీవ్ర ప్రభావమే పడనున్నది. దాదాపు 2,000 భారతీయ ఉత్పత్తులపై పన్ను భారం పడనుండగా, ఇది జ్యుయెల్లరీ వంటి చిన్నతరహా ఎగుమతులనే ఎక్కువగా దెబ్బ తీయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై అటు అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఇటు భారతీయ వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందనలు లేవు. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతానికి కృషి జరుగుతున్నదని, వ్యవసాయ, పాల ఉత్పత్తుల మార్కెట్లలో పరస్పర సహకారం దిశగా అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. అయితే మేక్ ఇన్ ఇండియా పేరుతో మోదీ సర్కారు.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ప్రచారంతో ట్రంప్ ప్రభుత్వం స్వదేశాల కోసం భారీ ప్రచారం చేస్తున్న క్రమంలో ఇలాంటి వాణిజ్యపరమైన ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017లో అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 126 బిలియన్ డాలర్లుగా ఉన్నది.

4327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles