74,000 కోట్ల నష్టం

Fri,November 15, 2019 03:11 AM

-వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టు దెబ్బ
-ఫీజులు, బకాయిలతో లాభాలు ఆవిరి
-దేశ చరిత్రలోనే అత్యధికం
-క్యూ2లో రికార్డుస్థాయి పతనం
-వొడాఫోన్-ఐడియాకు 51 వేల కోట్లు
-దేశ చరిత్రలోనే అత్యధికం

దేశీయ టెలికం పరిశ్రమలో నష్టాలు ఏరులై పారాయి. వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు మూడు నెలలకు దాదాపు రూ.74 వేల కోట్ల నష్టాలను ప్రకటించాయి. వొడాఫోన్-ఐడియా దేశ చరిత్రలోనే ఏ కార్పొరేట్ సంస్థ చూడని నష్టాలను చూపింది. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి రికార్డు స్థాయిలో ఏకంగా రూ.50,921 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఎయిర్‌టెల్ నష్టం రూ.23,045 కోట్లుగా ఉన్నది. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) అంశంపై సుప్రీం కోర్టు తీర్పు ఇరు సంస్థలకు శరాఘాతమైంది.

న్యూఢిల్లీ, నవంబర్ 14: బకాయిల భారం.. వొడాఫోన్-ఐడియాను నష్టాల ఊబిలోకి నెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో సంస్థ ఏకంగా రూ.50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ మధ్యకాలంలో ఓ భారతీయ సంస్థ ఈ స్థాయిలో నష్టాలను చూపిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2018-19) జూలై-సెప్టెంబర్‌లో రూ.4,874 కోట్ల నష్టాలు వాటిల్లాయి. ఆదాయం మాత్రం గతంతో పోల్చితే ఈసారి 42 శాతం పెరిగి రూ.11,146.4 కోట్లుగా ఉన్నది. మునుపెన్నడూ లేనివిధంగా నమోదైన ఈ రికార్డు స్థాయి నష్టాలకు సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) అంశంపై సుప్రీం కోర్టు ఆదేశం కారణమైంది. మొత్తం దేశీయ టెలికం పరిశ్రమకు సుప్రీం తీర్పు శరాఘాతమైందని, భీకర ఆర్థిక ఇబ్బందులను సృష్టించిందని వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ గురువారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.

ఏజీఆర్‌పై రివ్యూ పిటిషన్

ఏజీఆర్‌పై రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసే పనిలోనే ఉన్నామని తెలిపింది. మరోవైపు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని అంటున్నది. కాగా, సుప్రీం తీర్పు నేపథ్యంలో లైసెన్స్ ఫీజుల బకాయిల కోసం రూ.27,610 కోట్లను, స్పెక్ట్రం వినియోగ చార్జీల కోసం రూ.16,540 కోట్లను మొత్తంగా రూ.44,150 కోట్లను చెల్లించాల్సి వస్తుందని వొడాఫోన్ అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో ఇందులో క్యూ2 కేటాయింపులు రూ.25,680 కోట్లుగా ఉన్నాయి. ఫలితంగానే సంస్థ నష్టం రూ.50,921 కోట్లను తాకింది. టెలికం సంస్థల వార్షిక సర్దుబాటు స్థూల ఆదాయం గణనలో నాన్-టెలీకమ్యూనికేషన్ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయాన్నీ కలుపాలన్న టెలికం శాఖ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి టెలికం సంస్థలు రూ.1.4 లక్షల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి వస్తున్నది. ఇదంతా కూడా లైసెన్స్ ఫీజుల బకాయిలు, స్పెక్ట్రం వినియోగ చార్జీలు, వాటిపై వడ్డీ, జరిమానాలతో కలిపి ఉన్నది. టెలికం శాఖ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్ వాటా రూ.62,187 కోట్లుగా ఉంటుందని అంచ నా. వొడాఫోన్-ఐడియాది రూ.54,184 కోట్లుగా ఉంటుండగా, మిగతాది రిలయన్స్ జియోతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్/ఎంటీఎన్‌ఎల్, ఇతర మూతబడిన, దివాలా తీసిన సంస్థలది.
Vodafone-Idea1

టాటా రికార్డు బ్రేక్

ఇప్పటిదాకా భీకర త్రైమాసిక నష్టాలను ప్రకటించిన సంస్థల్లో టాటా మోటర్స్ టాప్‌లో ఉన్నది. ఇప్పుడు ఆ స్థానంలోకి వొడాఫోన్-ఐడియా వచ్చి చేరింది. 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటర్స్ నష్టం రూ.26,961 కోట్లుగా ఉన్నది.

ఎయిర్‌టెల్‌కు 23 వేల కోట్లు

సుప్రీంకోర్టు దెబ్బకు టెలికం సంస్థలు విలవిలలాడుతున్నాయి. ఇదివరకే జియో దెబ్బకు ఆదాయం పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో లాభాల సంగతి దేవుడు ఎరుగు..రికార్డు స్థాయిలో నష్టాలను ప్రకటిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా అయితే ఏకంగా రూ.50 వేల కోట్ల స్థాయిలో నష్టాన్ని ప్రకటించగా..మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా రూ.23,045 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల్లో ప్రకటించిన నష్టం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. స్పెక్ట్రం ఫీజు, ఇతర లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఒకేసారి సంస్థ రూ.28,450 కోట్ల నిధులను కేటాయించడంతో లాభాల్లో భారీ గండిపడింది. ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 4.7 శాతం పెరిగి రూ.21,199 కోట్లుగా నమోదైంది. ఆఫ్రికాలో టెలికం సేవలు అందించడంతో సమకూరే ఆదాయంలో 12.6 శాతం పెరుగుదల కనిపించగా, దేశవ్యాప్తంగా రూ.15,361కోట్లు లభించాయి. వీటిలో మొబైల్ ద్వారా సమకూరే ఆదాయంలో 7.1 శాతం వృద్ధి నమోదైంది.

సునీల్ మిట్టల్ నేతృత్వం వహిస్తున్న ఎయిర్‌టెల్..లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల పాత బకాయిలను చెల్లించాలని అపెక్స్ కోర్టు తీర్పునివ్వడంతో సంస్థలు షాక్‌కు గురయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను ఎయిర్‌టెల్ గత నెలలోనే ఆర్థిక ఫలితాలను విడుదల చేయాల్సి ఉండేది కానీ, సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఈ గురువారానికి వాయిదాపడింది. ఏజీఆర్ బకాయిలను పూడ్చుకోవడానికి ఎయిర్‌టెల్ ఏకంగా రూ.28,540 కోట్ల నిధులను వెచ్చించింది. వీటిలో రూ.6,164 కోట్లు మొత్తం కాగా, వడ్డీల రూపంలో రూ.12,219 కోట్లు, జరిమానా కింద రూ.3,760 కోట్లు, వడ్డీలపై జరిమానా రూ.6,307 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఈ నిధుల కేటాయింపునకు ముందు సంస్థ రూ.1,123 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాన్ని నమోదు చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఎయిర్‌టెల్ రూ.119 కోట్ల లాభాన్ని గడించింది. గత త్రైమాసికంలో మొత్తంగా రూ.34,260 కోట్లు కేటాయించింది. వీటిలో ప్రిన్సిపల్ అమౌంట్ కింద రూ.8,747 కోట్లు కాగా, వడ్డీల రూపంలో రూ.15,446 కోట్లు, జరిమానా కింద రూ.3,760 కోట్లు, వడ్డీలపై జరిమానా రూ.6,307 కోట్లుగా ఉన్నాయి.

దివాలాకు పోతం!

-ప్రభుత్వం సాయం చేయకపోతే మూసేసే అవకాశాలు
-వొడాఫోన్-ఐడియా మనుగడపై హెచ్చరించిన ఆదిత్య బిర్లా

వొడాఫోన్-ఐడియా లిమిటెడ్‌లో కొత్త పెట్టుబడులను పెట్టే యోచనేదీ లేదని ఆదిత్యా బిర్లా గ్రూప్ గురువారం స్పష్టం చేసింది. లైసెన్స్ ఫీజులు, సర్దుబాటైన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశీయ టెలికం పరిశ్రమపై పెను భారం పడిందని, ఈ విషయంలో తమను ఆదుకోకపోతే దివాలాకు వెళ్తామని హెచ్చరించింది. ఇటీవల భారత్‌లో మా భవిష్యత్తుపై అనుమానమేనని వొడాఫోన్ ఇండియా సీఈవో నిక్ రీడ్ సైతం అన్న విషయం తెలిసిందే. అధిక పన్నులు, చార్జీల భారాన్ని ప్రభుత్వం ఆపకపోతే కొనసాగలేమని ప్రకటించిన సంగతీ విదితమే. సుప్రీం ఆదేశాలతో వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు వొడాఫోన్-ఐడియా జాయింట్ వెంచర్‌లో రెండో భాగస్వామిగా ఉన్న ఐడియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. గతేడాది ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా కలిసిపోయినది తెలిసిందే. ఇవి వొడాఫోన్-ఐడియా లిమిటెడ్‌గా కార్యకలాపాలను సాగిస్తున్నాయి. లైసెన్స్, ఇతర రెగ్యులేటరీ ఫీజుల గణనపై టెలికం ఆపరేటర్లతో ఉన్న వివాదంలో టెలికం శాఖకు అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువరించింది. జరిమానా, వడ్డీతో కలిపి స్పెక్ట్రం యూసేజ్ చార్జీ, లైసెన్స్ ఫీజు బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. ఫలితంగా టెలికం పరిశ్రమపై రూ.1.4 లక్షల కోట్ల భారం పడగా, వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలే ఎక్కువగా ప్రభావితమైయ్యాయి. జియో స్వల్ప మొత్తంలో చెల్లించాల్సి వస్తున్నది.

రూ.44 వేల కోట్ల భారం

వొడాఫోన్-ఐడియాపై ఏజీఆర్ బకాయిల భారం రూ.44 వేల కోట్లపైనేనని సీనియర్ ఉద్యోగుల సమాచారం. వడ్డీ, జరిమానాలతో కలుపుకుని అదనపు లైసెన్సుల ఫీజుల బకాయిలు దాదాపు రూ.28 వేల కోట్లుగా ఉంటే, స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిలు రూ.16,500 కోట్లపైనే ఉన్నాయన్నారు. భారతీయ టెలికం వ్యాపారం.. ప్రతీ ఒక్కరికీ లాభాలను అందిస్తున్నది. ఒక్క టెలికం సంస్థలకు తప్ప. ఈ వ్యాపారం లాభసాటి కాదు. అస్థిరంగా ఉన్నది. మా లాభాలను అంతకంతకూ మింగేస్తున్నది అని వొడాఫోన్ ఇండియా సీఈవో నిక్ రీడ్ వ్యాఖ్యలను సమర్థించారు. కాగా, సంస్థ నికర రుణ భారం రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నది. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం పరిశ్రమ ముఖచిత్రం మారిపోయింది. చౌక ఇంటర్నెట్, ఉచిత వాయిస్ కాల్స్, మెసేజ్‌ల కారణంగా అప్పటిదాకా ఉన్న టెలికం సంస్థల ఆదాయానికి గండి పడింది.

620
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles