స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

Wed,May 15, 2019 02:24 AM

Wholesale Inflation At 3.07 Percent In April

-ఏప్రిల్‌లో 3.07 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, మే 14: ఆహార పదార్థాలు ప్రియమైనప్పటికీ చమురు, తయారీ రంగానికి చెందిన ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో గడిచిన నెలకుగాను టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.07 శాతానికి పరిమితమైంది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిలో ఈ విషయం వెల్లడైంది. మార్చి నెలలో 3.18 శాతంగా నమోదైన గణాంకాలు..ఫిబ్రవరిలో 2.93 శాతం, ఏడాది క్రితం ఇదే నెలలో 3.62 శాతంగా ఉన్నది. మార్చి నెలలో 5.68 శాతంగా నమోదైన ఆహార పదార్థాల ధరల సూచీ ఆ మరుసటి నెలలో 7.37 శాతానికి ఎగబాకింది. కూరగాయల ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. డిసెంబర్‌ 2018లో -0.42 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆ తర్వాతి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌లో 40.65 శాతానికి ఎగబాకింది. ఆహార పదార్థల ధరల సూచీలో బంగాళాదుంప ధరల సూచీ -17.15 శాతానికి పరిమితమవగా, ఉల్లిగడ్డలు 3.43 శాతంగాను, పండ్లు -6.88 శాతం చొప్పున నమోదయ్యాయి. గడిచిన కొన్ని నెలలుగా భారీగా పుంజుకున్న చమురు, ఇంధన ధరలు తగ్గుముఖం పట్టా యి. మార్చి నెలలో 7.33 శాతంగా ఉన్న డీజిల్‌ ధరల సూచీ 3.24 శాతానికి పరిమితమవగా, పెట్రోల్‌ సూచీ కూడా 1.78 శాతం నుంచి 1.74 శాతానికి తగ్గింది.

కానీ, ఎల్‌పీజీ ధరల సూచీ మాత్రం 0.94 శాతం నుంచి ఏకంగా 11.48 శాతానికి ఎగబాకింది. ఇటీవల కాలం లో వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరుగడం ఇందుకు కారణం. సబ్సిడీ సిలిండర్‌ ధరను యథాతథంగా ఉంచిన కేంద్రం.. సబ్సిడీ రహిత సిలిండర్‌ ధరను రూ.5 పెంచడంతో ధర రూ.706.50కి చేరుకున్నది. రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు ఎగువముఖం పట్టడంతో వచ్చే నెల ఆర్బీఐ ప్రకటించనున్న సమీక్షపై అందరి కళ్లుపడ్డాయి. గత సమీక్షలో సెంట్రల్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. అసోచామ్‌ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ సౌరభ్‌ సన్యాల్‌ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణ గణాంకాలు పెరిగినప్పటికీ, ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం కంటే తక్కువగానే ఉండటంతో వచ్చే సమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గించడానికి వీలు కలిగిందన్నారు. సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుండటంతో త్వరలో ఆహార పదార్థాల ధరలు శాంతించే అవకాశం ఉందన్నారు.

పావు శాతం కంటే ఎక్కువే


-జూన్‌లో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపుపై ఎస్‌బీఐ
వచ్చే నెలలో జరుగనున్న పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం కంటే అధికంగా తగ్గించే అవకాశాలున్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మందకొడిగా కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలంటే భారీ స్థాయిలో వడ్డీరేట్ల తగ్గిం పే ఆర్బీఐ ముందున్న ప్రధాన సవాల్‌ అని బ్యాంక్‌ రీసర్చ్‌లో పేర్కొంది. గత వరుస రెండు సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 6న తదుపరి సమీక్షను ఆర్బీఐ ప్రకటించబోతున్నది.

514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles