విప్రో రూ.10,500 కోట్ల బై బ్యాక్

Wed,April 17, 2019 12:44 AM

Wipro approves Rs 10,500 crore buyback

-15 నెలల్లో ఇది రెండోసారి
-క్యూ4 లాభంలో 38 శాతం వృద్ధి

బెంగళూరు, ఏప్రిల్ 16: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,493.90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ. 1,800.80 కోట్ల లాభంతో పోలిస్తే 38.4 శాతం వృద్ధి నమోదైందని విప్రో సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలి జెడ్ నీముచ్‌వాలా తెలిపారు. అలాగే సంస్థ రూ.10,500 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలకు లోబడి విడుదల చేసిన ఈ ఆర్థికఫలితాల్లో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8.9 శాతం పెరిగి రూ.15,006.30 కోట్లకు చేరుకున్నది. 2017 -18 ఇదే కాలంలో సంస్థ రూ.13,768.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మెరుగైన వృద్ధికోసం ఒక బలమైన పునాదిని నిర్మించడంతో ఆర్డర్లు భారీగా పుంజుకున్నాయని, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ సర్వీసెస్, క్లౌడ్ విభాగాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని నీముచ్‌వాలా చెప్పారు.

ఒక్కో షేరుకు రూ.325 చొప్పున 32.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి అవసరమయ్యే రూ.10,500 కోట్ల నిధులను వెచ్చించడానికి బోర్డు అంగీకారం తెలిపిందని ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు. గడిచిన 15 నెలలో బైబ్యాక్ ప్రకటించడం ఇది రెండోసారి కాగా, 2016 నుంచి ఇది మూడోసారి. 2016లో రూ.2,500 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన సంస్థ..నవంబర్-డిసెంబర్ 2017లో రూ.11 వేల కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. మార్చి 31, 2019 నాటికి కంపెనీలో ప్రమోటర్ల వాటా 73.85 శాతంగా ఉండగా, 6.49 శాతం వాటా ఇండియన్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లకు ఉన్నాయి. అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు 11.74 శాతం వాటా ఉండగా, కేంద్ర, కార్పొరేట్, ఇతరులకు 7.92 శాతం ఉన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి రూ.58,584.5 కోట్ల ఆదాయంపై రూ.9, 017.90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

భవిష్యత్తు నిరాశే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదని నీముచ్‌వాలా అన్నారు. అతిపెద్ద ప్రాజెక్టులపై కంపెనీల మధ్య పోటీ తీవ్రతరంకావడం, తాజా ప్రాజెక్టుల అమలు ఆలస్యంకావడం మొత్తం సంస్థ పనితీరుపై ప్రభావం చూపనున్నదని ఆయన పేర్కొన్నారు. కానీ, రెండో త్రైమాసిక వృద్ధిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. డిజిటల్ ద్వారా వచ్చే ఆదాయంలో 32.2 శాతం పెరుగుదల కనిపించింది. గడిచిన త్రైమాసికంలో 75 మిలియన్ డాలర్ల కంటే అధిక విలువైన మూడు నూతన క్లయింట్లను దక్కించుకున్నట్లు ప్రకటించింది. కంపెనీ షేరు ధర 2.5 శాతం తగ్గి రూ.281.10 వద్ద ముగిసింది.

ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలు హ్యాకింగ్

కంపెనీ ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ..పలువురు ఉద్యోగులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు హ్యాక్‌కు గురైనట్లు తెలుస్తున్నది. దీంతో రంగంలోకి దిగిన కంపెనీ.. ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ సంస్థతో విచారణ జరుపనున్నట్లు ప్రకటించింది. సైబర్‌సెక్యూరిటీ బ్లాగ్ క్రెబ్స్‌ఆన్‌సెక్యూరిటీ ఈ విషయాన్ని గ్రహించి..విప్రో వర్గాలకు సమాచారాన్ని చేరవేసింది.

776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles