పెళ్లయ్యాకే హీరోయిన్‌ అయ్యాను!

Mon,September 23, 2019 12:32 AM

‘మళ్లీరావా’ చిత్రం ద్వారా తెలుగుచిత్రసీమకు పరిచయమైంది ఆకాంక్షసింగ్‌. అభినయప్రధాన పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత ‘దేవదాస్‌' సినిమాలో మెరిసింది. ఇటీవల విడుదలైన ‘పహిల్వాన్‌' చిత్రంలో సుదీప్‌తో జతకట్టిందీ సుందరి. తెలుగులో సవాలుతో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతున్న ఈ భామ శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించింది..


తెలుగులో నా తొలిచిత్రం ‘మళ్లీరావా’ ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. నాకు ఉత్తమ తొలి చిత్ర నాయికగా అవార్డును అందించింది. నా హృదయానికి దగ్గరైన సినిమా అది. తెలుగులో అరంగేట్రం చిత్రం ద్వారా భిన్న పార్శాలు కలిగిన పాత్ర దొరకడం అదృష్టంగా భావించాను. ఇటీవల విడుదలైన ‘పహిల్వాన్‌' చిత్రంలో కథానాయికగా నటించాను. స్ఫూర్తివంతమైన కథ కాబట్టి వినగానే వెంటనే ఓకే చెప్పాను. సుదీప్‌వంటి పెద్ద స్టార్‌తో నటించడం వల్ల ఎన్నో విషయాల్ని తెలుసుకోగలిగాను.

సినీ ప్రయాణం సాఫీగా ఉంది...

నా సినీ ప్రయాణం సంతృప్తికరంగా సాగిపోతున్నది. తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు అంగీకరించడం వల్ల తెలుగు చిత్రాల్లో నటించడం కుదరలేదు. పాత్రలో నవ్యత ఉంటే ఏ భాషా చిత్రంలోనైనా నటిస్తాను. దక్షిణాది పరిశ్రమలో మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. నటిగా నవ్యతకే ప్రాధాన్యతనిస్తాను.

పెళ్లయ్యాక నాయికగా రాణిస్తున్నా..

పెళ్లిచేసుకున్న తర్వాత నేను నాయికగా వచ్చాను. ఇది తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కెరీర్‌ విషయంలో నా భర్త సహకారం ఎంతో ఉంది. ఆయన అందిస్తున్న మనోధైర్యంతోనే పరిశ్రమలో రాణించగలుగుతున్నాను. నేను 20ఏళ్ల వయసులోనే ప్రేమించి పెళ్లాడాను. నా భర్త సహకారంతో నటనలో శిక్షణ తీసుకొని పరిశ్రమలోకి అడుగుపెట్టాను.

2563

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles