గౌరవం కోసమే సినిమాలు చేస్తున్నా

Thu,November 7, 2019 12:26 AM

వైవిధ్యమైన సినిమాల్ని చేస్తానని నాపై ఉన్న నమ్మకంతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తి పరిచే చిత్రమిది అని అన్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం తిప్పరా మీసం. కృష్ణవిజయ్ దర్శకుడు. ఈ నెల 8న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో శ్రీవిష్ణు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..


నైట్‌క్లబ్ డీజేగా పనిచేసే నిర్లక్ష్యధోరణితో కూడిన మనస్తత్వమున్న యువకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాను. వృత్తిరిత్యా నైట్‌లైఫ్‌కు అలవాటుపడిన అతడి జీవనగమనంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయన్నది ఆసక్తిని పంచుతుంది. మీసం అనేది బాధ్యతను సూచిస్తుంది. తన బాధ్యతను నెరవేర్చే క్రమంలో ఓ యువకుడు ఎలాంటి పోరాటం సాగించాడు? ఏ సందర్భంలో మీసం తిప్పాడు?అన్నది ఉత్కంఠను పంచుతుంది. నెగెటివ్ షేడ్స్‌తో నా పాత్ర వినూత్నంగా ఉంటుంది. ఇదివరకు నేను చేసిన సాఫ్ట్ పాత్రలకు భిన్నంగా నా ఆహార్యం, పాత్రచిత్రణ ఉంటాయి. ఈ పాత్ర కోసం బరువు పెరిగాను. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రోహిణికి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాటిక్ ఫీల్‌తో కాకుండా సహజంగా ఉంటాయి.టైటిల్, నా గెటప్ చూసి మాస్ సినిమా అనుకుంటున్నారు. కానీ మాస్ సన్నివేశాలు, సంభాషణలు ఈ సినిమాలో కనిపించవు.

హద్దులు విధించుకోకూడదు.

కొడితే విలన్‌లు గాళ్లో ఎగిరిపోవడం లాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా రియలిస్టిక్‌గా యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉంటాయి. తెలుగు తెరపై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని వాణిజ్య హంగులతో దర్శకుడు కృష్ణవిజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకావడమే కమర్షియాలిటీగా నేను భావిస్తాను. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో నాతో పాటు కొంత మందిహీరోలు చేసిన సినిమాలు ఎక్కువగా మల్టీప్లెక్స్, ఏ సెంటర్స్ ప్రేక్షకుల్నే మెప్పించాయి. బీ, సీ సెంటర్స్ ప్రేక్షకులకు చేరువ అవ్వాలనే సంకల్పంతో వారికి కావాల్సిన హంగులను ఇందులో జోడించాం. కామెడీ కథాంశాలతో పోలిస్తే మిగతా ఇతివృత్తాలు అంతగా ఆకట్టుకోలేవనే హద్దులు నిర్ధేశించుకుంటూ సినిమా చేయడం సరికాదు. కామెడీతో పాటు బలమైన కథ ఉన్న సినిమాలే ఆడుతాయి. నవ్యతను అందించినప్పుడే ప్రేక్షకుడు చక్కటి అనుభూతితో థియేటర్ నుంచి బయట అడుగుపెడతాడు.

దేశభక్తి నేపథ్యంతో

నటుడిగా గౌరవం కోసమే వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నాను. నాపై ఉన్న ఆ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను. కమర్షియల్ సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. కానీ నటుడిగా మాత్రం రియలిస్టిక్ సినిమాలు చేయడమే కంఫర్ట్‌జోన్‌గా భావిస్తాను. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త దర్శకులతో మూడు సినిమాల్ని అంగీకరించాను. కృష్ణవిజయ్ నిర్మాణంలో ఓ సినిమా ఉంటుంది. నారారోహిత్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నాను. దేశభక్తి నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకిరానున్నది.

679

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles