అద్దంలో చూసుకొని రెండురోజులు నిద్రపోలేదు

Tue,October 15, 2019 12:31 AM

హారర్ సినిమాలు ఒంటరిగా చూడటమంటే నాకు చాలా భయం. కుటుంబసభ్యులు, స్నేహితుల తోడు లేకుండా ఈ సినిమాల్ని చూడను అని చెప్పింది అవికాగోర్. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం రాజుగారి గది-3, ఓంకార్ దర్శకుడు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో అవికాగోర్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..


రియాలిటీ షో, టీవీ సిరీస్‌లతో పాటు హిందీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉండటంతో మూడేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నాను. ఈ విరామంలో తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆ కథలేవీ నాలో ఆసక్తిని రేకెత్తించలేదు. డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో ఆ చిత్రాల్ని అంగీకరించలేదు.ఖత్రా ఖత్రా ఖత్రా టీవీ సిరీస్ చేస్తున్నప్పుడు మధ్యలో విరామం దొరకడంతో ఓంకార్ చెప్పిన ఈ కథ విన్నాను. తమన్నాతో ఈ సినిమా చేయాలనుకున్నాను. కానీ ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో కుదరలేదు. అందువల్లే మీ దగ్గరకు వచ్చాను అని ఓంకార్ చెప్పారు.ఇతర నాయికలు చేయాల్సిన పాత్రలో నేను నటిస్తున్నాననే ఆలోచనలేవి మనసులో పెట్టుకోకుండా నా పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయడానికి ప్రయత్నించాను.

సాధారణ ప్రేక్షకురాలిగా ప్రతి కథను వింటాను. ఆ సినిమాను నేను ఎంజాయ్ చేయగలనా? లేదా? ఆలోచించి అంగీకరిస్తాను.

హారర్ సినిమాలు చూశా..

ఓంకార్ కథ చెప్పడం మొదలుపెట్టిన నలభై నిమిషాల్లోనే సినిమాకు ఓకే చెప్పాను. ఆయన కథ చెబుతున్నప్పుడే భయపడ్డాను. హారర్ హంగులతో పాటు చక్కటి వినోదం మిళితమైన చిత్రమిది. నా పాత్ర ప్రేక్షకుల్ని భయపెడుతుంది. తొలి రోజు షూటింగ్‌లో మేకప్‌లో వేసుకున్న తర్వాత నన్ను నేను అద్దంలో చూసుకొని భయపడ్డాను. రెండు రోజులు నిద్రపోలేదు. పాత్రకు సంబంధించిన భావవ్యక్తీకరణను అర్థం చేసుకొని నటించడం కోసం చాలా హారర్ సినిమాలు చూశాను.

కేరళ అమ్మాయిగా..

పక్కింటి అమ్మాయి తరహాలో నా పాత్ర సాగుతుంది. కేరళకు చెందిన ఆమె జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనలేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. అనుభవజ్ఞులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. తెరపై అందంగా కనిపించడానికి లుక్ విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోను. కథ, దర్శకుడితో పాటు నా పాత్రను నమ్మి సినిమాలు చేస్తాను.

హైదరాబాద్‌లో ఉంటున్నా..

తెలుగు సినిమాలు నటిగా నాలో పరిణితిని కనబరచడానికి దోహదం చేశాయి.తెలుగు భాషను అర్థం చేసుకుంటూ నటించడానికి చాలా హార్డ్‌వర్క్ చేస్తాను.అవన్నీ నాకో అనుభవపాఠాలుగా ఉపయోగపడ్డాయి. సినిమాలతో పాటు టీవీకి ప్రాముఖ్యతనిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తాను. ప్రస్తుతం నా దృష్టంతా టాలీవుడ్‌పైనే ఉంది.అందుకే ఎనిమిది నెలలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. వెబ్‌సిరీస్‌లో అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఓ కొత్త సినిమాను అంగీకరించాను. మరో పదిహేను రోజుల్లో ఆ వివరాల్ని వెల్లడిస్తాను.

1218

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles