నటనా నిఘంటువు ఏఎన్నార్

Sun,November 17, 2019 11:02 PM

-శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ నేషనల్ అవార్డు ప్రదానం
ఆరుదశాబ్దాల క్రితం ఓ పల్లెటూరిలో నవమాసాలు నిండిన ఓ ఇల్లాలు తన అభిమాన నటుడి సినిమా చూడాలని కలలు కన్నది. తన భర్తతో కలిసి గతుకుల రోడ్డులో జట్కాబండిలో ఆరు కిలోమీటర్లు ప్రయాణించి సినిమా చూసింది. ఆమె ఎవరో కాదు మా అమ్మ అంజనాదేవి. ఆ కడుపులో ఉన్న పిల్లాడిని నేను. ఆ పల్లెటూరు మొగల్తూరు. ఆ సినిమా 1955లో ఏఎన్నార్ నటించిన రోజులు మారాయి అని అన్నారు చిరంజీవి. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కార ప్రదానోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. 2018 సంవత్సరానికిగాను దివంగత నటి శ్రీదేవికి, 2019 ఏడాదికిగాను సీనియర్ కథానాయిక రేఖకు ఈ పురస్కారాల్ని అందించారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్‌కు, రేఖకు అవార్డులను ప్రదానం చేశారు. చిరంజీవి మాట్లాడుతూ మా అమ్మకు నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం.


ఆయన సినిమాలన్ని చూసేది. ఏఎన్నార్, నేను కలిసి మెకానిక్ అల్లుడు సినిమాలో నటించాం. సినిమా ఇండస్ట్రీలోని మంచి, చెడులు, బాధ్యతల గురించి నాకు చెప్పేవారు. ఆయన నేర్పిన విషయాలే నటుడిగా నాకు క్రమశిక్షణను నేర్పాయి. ఏఎన్నార్ నాకు గురుతుల్యులు. నడిచే నటన నిఘంటువు ఆయన. అలాంటి మహానుభావుడితో నాకు సాంగత్యం ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అక్కినేని నేషనల్ అవార్డ్ దాదాసాహెబ్‌ఫాల్కే స్థాయిలో ఎదుగుతుందనడంలో సందేహం లేదు. నాన్న వారసత్వమే కాదు ఆయన ఆశయాల్ని తన ఆశయాలుగా మలుచుకుంటూ నాగార్జున ఈ అవార్డును ముందుకు తీసుకెళుతున్నారు. రేఖ, శ్రీదేవికి ఈ అవార్డును ఇవ్వడం సముచితం. భారతదేశం గర్వించే గొప్ప నటీమణులు వారు. తెలుగు నేలతో వారికి విడదీయలేని అనుబంధం ఉంది. ఈ అవార్డు ద్వారా వారిని సన్మానించుకోవడం గర్వంగా ఉంది. శ్రీదేవితో నేను నాలుగు సినిమాల్లో నటించాను. ఆమె మరణం నిజం కాదేమో, కల అయితే బాగుండునని కోరుకుంటాను. భారతీయ భాషలన్నింటిలో నటించి లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపును తెచ్చుకున్నారు.

కాలేజీ రోజుల నుంచి రేఖ సినిమాలు చూస్తున్నాను. నేను ఆరాధించే నటీమణుల్లో ఆమె ముందువరుసలో ఉంటారు. ఆమెకు నా చేతుల మీదుగా అవార్డును ఇవ్వడం సంతోషంగా ఉంది అన్నారు. నాగార్జున మాట్లాడుతూ తెలుగు సినిమా ఉన్నంతవరకు అక్కినేని నాగేశ్వరరావుగారు ఉంటారు. రేఖ, శ్రీదేవిలకు ఈ అవార్డు అందించాలన్న నాన్నగారి కల ఈ రోజు నెరవేరుతుండటం ఆనందంగా ఉంది. శ్రీదేవిగారితో నాలుగు సినిమాలు చేశాను. ఆమె సెట్స్‌లోకి వస్తుంటే ఓ వెలుగు వచ్చినట్లు అనిపించేది. మేమంతా లేచి నిల్చునేవాళ్లం. రేఖ, శ్రీదేవి ఇద్దరూ తెలుగువాళ్లే. ఈ అవార్డులు వారికి అందించడం గర్వంగా ఉంది అన్నారు.

తెలుగులో సినిమా చేస్తా..

రేఖ మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియోను చూస్తుంటే తిరిగి నా ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతున్నది. ఎన్నో జ్ఞాపకాలు మదిలో మెదలుతున్నాయి. ఇక్కడ పదేళ్లపాటు గడిపాను. బంజారాహిల్స్ వీధులు ఇప్పటికీ నా కళ్లముందున్నాయి. వేదాంతం రాఘవయ్యగారు అక్కినేని నాగేశ్వరరావు గురించి నాతో ఎప్పుడూ చెబుతుండేవారు. అబ్బాయి సిగ్గరి అయినా ఒక్కసారి కెమెరా ఆన్ అయితే చాలు అదరగొట్టేస్తాడు అని చెప్పేవారు. అక్కినేని నటించిన సువర్ణసుందరి సినిమా చూసి మైకం వచ్చేసింది. ఆ చిత్రాన్ని వందసార్లు చూసివుంటాను. ఓ రోజు నాగేశ్వరరావుగారు భోజనానికి పిలిచారు.

ఆహారం, ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. డాక్టర్ సేవ్స్ లైఫ్స్, యాక్టర్స్ సేవ్స్ సోల్స్ అని మా నాన్నగారు ఎప్పుడూ అంటుండేవారు. నేను జీవితాంతం ఆ సూత్రాన్ని నమ్ముతాను. మీ అందరు నా ఫ్యామిలీలాంటి వాళ్లు. అంజలి అత్తయ్య కోసం తెలుగులోఅమ్మకోసం సినిమా చేశాను. అది నాకు బ్రేక్‌నిచ్చింది. మా అమ్మ చనిపోతూ నువ్వు తెలుగుబిడ్డవు...తెలుగులో మళ్లీ ఓ సినిమా చేయాలి అని కోరింది. మీ అందరి దీవెనలు ఉంటే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తా. ఇక శ్రీదేవి నా చిన్నారి చెల్లె...ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నటి. ఆమె దీవెనల వల్లే నేను ఈ వేడుకకు వచ్చాననుకుంటున్నాను అని చెప్పారు. ఈ వేడుకలో మాట్లాడిన బోనీకపూర్ ఉద్వేగానికి గురయ్యారు. సతీమణి శ్రీదేవిని తలుచుకొని కన్నీళ్లుపెట్టుకున్నారు.
Chiranjeevi1

486

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles