రమేష్‌వర్మతో సినిమా ఎందుకన్నారు!


Mon,August 5, 2019 12:51 AM

Director Ramesh Varma Exclusive Interview Rakshasudu Movie Bellamkonda Sreenivas Anupama

దర్శకుడిగా నాకు చక్కటి సంతృప్తిని మిగిల్చిన సినిమా ఇది. నా శైలి హంగుల కోసం ప్రయత్నించకుండా సక్సెస్‌ను అందుకోవాలనే తపనతో ఈ సినిమా చేశాను అని అన్నారు రమేష్‌వర్మ. ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయితో చిత్రాలతో జయాపజయాలకు అతీతంగా దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం రాక్షసుడు. తమిళ చిత్రం రాచ్చసన్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో రమేష్‌వర్మ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

రాక్షసుడు సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తున్నది?

సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో కీలకమైన సక్సెస్ ఇది. ఇప్పటివరకు మా అబ్బాయికి ఎవరూ బ్లాక్‌బస్టర్ ఇవ్వలేదు. నువ్వు పెద్ద సక్సెస్ ఇచ్చావు అని బెల్లంకొండ సురేష్ సినిమా చూసి ప్రశంసించారు.

దర్శకుడిగా రీమేక్‌ను ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ఈ సినిమా విషయంలో మీకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

రీమేక్ సినిమా చేస్తానని నేను అనుకోలేదు. తమిళ మాతృకలోని కథ నన్ను అమితంగా ఆకట్టుకున్నది. ఇలాంటి మంచి సినిమాను వదులుకోవద్దనే ఆలోచనతో దాదాపు పదకొండు మంది నిర్మాతలతో పోటీపడి ఈ సినిమా రీమేక్ హక్కులను తీసుకున్నాం. నా ఇష్టపూర్వకంగానే సినిమా చేశాను. ఓ అందమైన పెయింటింగ్‌ను మళ్లీ వేయడం సులభం కాదు. తమిళ దర్శకనిర్మాతలు రెండు సంవత్సరాల పాటు కష్టపడి చేసిన సినిమాను కథలోని ఆత్మ మిస్ కాకుండా మూడు నెలల్లోనే పునర్నిర్మించి విజయాన్ని అందుకున్నాను. కత్తిమీదసాములాంటి పనిని ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని విజయవంతంగా పూర్తిచేశాను.

ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశమేది?

నిత్యజీవితంలో మనం చూసే సంఘటనలతో ముడిపడిన కథ ఇది. ఆడపిల్లల విషయంతో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సందేశం మిళితమై ఉంటుంది. ఈ రోజుల్లో ఇంటి నుంచి బయట అడుగుపెట్టిన ఆడపిల్లలు మళ్లీ వస్తారో రారో అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ ఆలోచనను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సినిమా కావడంతోనే దీనిని తెలుగు ప్రేక్షకులకు చెబితే బాగుంటుందనిపించింది. వాణిజ్య, హంగులు, భావోద్వేగాలు, సందేశం అన్ని హంగుల కలబోతగా ఉండే థ్రిల్లర్ సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి మంచి సినిమా ఇది.

విడుదలకు ముందు టెన్షన్ పడ్డారా?

ప్రతి సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ శుక్రవారం నేను విజేతగా నిలవడం ఆనందంగా ఉంది.

హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ను తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?

తొలుత బెల్లంకొండ శ్రీనివాస్‌తో పెద్ద సినిమా ప్లాన్ చేశాం. అందులో అగ్రనాయికలు నటించాల్సి ఉంది. అభిషేక్ నామా నిర్మాతగా అనుకున్నాం. సుకుమార్‌తో పాటు ఇండస్ట్రీలోని పెద్దలంతా కథ విని బాగుందన్నారు. అదే సమయంలో తమిళంలో విడుదలైన రాక్షసుడు చూశాను. ఈ సినిమా నచ్చడంతో సొంత కథను పక్కనపెట్టి రీమేక్‌పై దృష్టిసారించాను. దీని గురించి శ్రీనివాస్‌కు చెబితే కవచం తర్వాత పోలీస్ పాత్రలు వద్దనుకుంటున్నట్లు చెప్పాడు. అతడి స్థానంలో హవీష్‌ను పరిశీలించాం. కానీ అప్పటికే అతడు ఇదే తరహా కథతో మరో సినిమా చేస్తుండటంతో తిరిగి శ్రీనివాస్‌ను సంప్రదించాం. ఈ కథ శ్రీనివాస్‌కు బాగా కుదురుతుందని బెల్లంకొండ సురేష్ చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది.

పంథాకు భిన్నంగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఈ పాత్రను చేయించాలని ఎందుకనిపించింది?

పక్కింటి కుర్రాడి పాత్రలు శ్రీనివాస్ ఇప్పటివరకు చేయలేదు. ఇలాంటి పాత్రలో అతడిని చూపిస్తే కొత్తగా ఉంటుందని అనిపించింది. రైడ్ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మాతృసంస్థకు ఓ పెద్ద విజయాన్ని ఇచ్చాను. అలాంటి సక్సెస్‌ను నాకు ఈ సినిమాతో ఇవ్వాలని శ్రీనివాస్ చిత్రీకరణ సమయంలో ఎప్పుడూ అంటుండేవాడు. అన్నట్లుగానే పెద్ద విజయం లభించింది.

కథలో మార్పులు చేయకుండా యథాతథంగా తెరకెక్కించారెందుకని?

ఈ సినిమాలో ఫైట్స్, కమర్షియల్ హంగులు జోడించమని ఒత్తిడి తెచ్చారు. కథలో ఫీల్ చెడిపోతుందనే మార్పులు చేయలేదు. నన్ను నమ్మి భారీ బడ్జెట్‌తో నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. రమేష్‌వర్మ దర్శకుడు కాదు. డిజైనర్ మాత్రమే. అతడితో సినిమా చేయడం ఏమిటి? మరో దర్శకుడిని తీసుకోండి అని చాలా మంది కోనేరు సత్యనారాయణతో అన్నారట. ఆయన మాత్రం నన్ను పూర్తిగా నమ్మారు. నిర్మాత నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది.

నితిన్‌తో మీరు ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి?

నితిన్‌కు ఓ కథ వినిపించాను. ఆయనకు నచ్చింది. అయితే అధికారిక ప్రకటన వెలువడటానికి ముందే మీడియాలో సినిమాకు సంబంధించిన వార్తలు రావడంతో ఈ చిత్రం వర్కవుట్ కాలేదు. నితిన్ ఒప్పకుంటే అతడితో తప్పకుండా సినిమా చేస్తాను.

806

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles