ఒక పాయింట్‌తో వందసినిమాలు తీయొచ్చు!


Thu,September 5, 2019 11:42 PM

Director Sujeeth Press Meet About Saaho

సాహో సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. అయితే మరికొన్ని రోజులు ఆగితే కమర్షియల్‌గా ఏ స్థాయి విజయమో అంచనా వేయగలం. ఈ సినిమా దర్శకుడిగా నాపై మరింత బాధ్యతను పెంచింది. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ కథా చిత్రాల్ని తీయడానికి ప్రేరణనిచ్చింది. ఈ సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చినా..వసూళ్లు బాగున్నాయి. దీన్ని బట్టి ప్రజలు మెచ్చితే సినిమాను ఎవరూ ఆపలేరనే విషయం స్పష్టమైంది. అయితే సమీక్షకుల అభిప్రాయాలపై నేను స్పందించను. అంతిమంగా ప్రజలకు సినిమా నచ్చడమే ముఖ్యం.

ఇదే ఆఖరు సినిమా కాదు..
నా మీద విశ్వాసంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించారు. నిర్మాణంలో అందరూ నా ఆప్తులే ఉన్నారు కాబట్టి ఈ సినిమా విషయంలో భయం కంటే బాధ్యత ఎక్కువైనట్లు ఫీలయ్యాను. ప్రభాస్ అన్నతో పాటు నిర్మాతలు నాకు ప్రతి అంశంలో మద్దతుగా నిలిచారు. అయితే సినిమా రివ్యూలు చదువుతుంటే అందరు కక్ష్య కట్టుకొని రాశారనిపించింది. అందుకే వాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌తోనే నా సినీ ప్రయాణం ఆఖరు కాదు. ఇంకో ముఫ్పైఏళ్లు సినిమాలు తీస్తాను. ఈ ప్రస్థానంలో జయాపజయాలు ఎలా ఉన్నా స్వీకరిస్తాను. సినిమా అర్థం కాలేదు అని చెప్పడం వేరు..సినిమాకే అర్థం లేదు అని పేర్కొనడం వేరు. అందుకే చూసినవాళ్లని కూడా మరోసారి సినిమా చూడమని చెబుతున్నాను.

బాహుబలి-3 కావాలన్నారు..
సాహో విషయంలో విడుదలకు ముందే భారీ అంచనాలేర్పడ్డాయి. అందరూ బాహుబలి-3 కావాలనుకున్నారు. అది తీయాలంటే రాజమౌళిగారు కావాలి (నవ్వుతూ). ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తేనే అందులోని ఆనందం అర్థమవుతుంది. బాలీవుడ్‌లో సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఉత్తరాదిన మన తెలుగు హీరోకు ఇంతటి ఫాలోయింగ్ రావడం, నేను ఆ సినిమాను డైరెక్ట్ చేయడం గర్వంగా ఉంది.

ఇదొక కొత్త వివాదం..
ఇది ఫ్రెంచి సినిమా లార్గో వించ్‌కు కాపీ అని ఆ చిత్ర దర్శకుడు ట్విట్టర్‌లో వ్యాఖ్యానించడం అర్థం లేనిది. అతను సాహో సినిమా చూడలేదనుకుంటా. తండ్రి చనిపోతే ఆ వారసత్వాన్ని కొడుకు కొనసాగించడానికి ప్రయత్నించడమనే పాయింట్ కొన్ని వందల తెలుగు సినిమాల్లో వచ్చింది. మా సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నాయి కాబట్టి ఫ్రెంచి సినిమాకు కాపీ అంటూ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఒకే పాయింట్‌తో కొన్ని వందల సినిమాలు రూపొందుతుంటాయి. కాబట్టి కాపీ అంటూ చేస్తున్న అనవసర రాద్ధాంతం గురించి పట్టించుకోను.

షార్ట్‌ఫిల్మ్ కూడా తీయొచ్చు..
కథను బట్టే నేను బడ్జెట్ గురించి ఆలోచిస్తాను. నా తదుపరి సినిమా ఏమిటో ఇంకా నిర్ణయించుకోలేదు. 300కోట్ల సినిమా తీశాను కాబట్టి నా తర్వాతి చిత్రం అదే స్థాయిలో ఉండాలని లేదు. అవసరమైతే చిన్న సినిమా చేయొచ్చు. బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను.

917

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles