పండగ వేళ ఆనంద హేల

Thu,October 10, 2019 12:06 AM

విజయదశమి పర్వదినాన్ని సకలశుభాలకు ప్రత్యేకతగా భావిస్తారు. దసరా రోజున తలపెట్టిన ఏ పనైనా నిర్విఘ్నంగా ఫలప్రదమవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.దసరా సెంటిమెంట్‌కు చిత్రసీమలో ఎనలేని ప్రాముఖ్యత ఉన్నది. సరదాలు, విజయాలు, ఉద్వేగానికి చిరునామాగా నిలిచే విజయదశమి రోజున తమ సినిమా విశేషాల ద్వారా పండగ సంబురాన్ని ప్రేక్షకులతో పంచుకొంటుంటారు సినీ వర్గాలు. కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, హీరోల నయాలుక్‌లు, సినిమాల ప్రకటనలతో ఈ దసరా సినీ అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపింది. విజయదశమి రోజున మహేష్‌బాబు, అల్లు అర్జున్ తమ కొత్త లుక్‌లతో ఆకట్టుకోగా..చిరంజీవి, నితిన్, సాయితేజ్ తమ సినిమాల్ని ప్రారంభించారు..


కొండారెడ్డి సెంటర్‌లో..

కొండారెడ్డి బురుజు సెంటర్‌సాక్షిగా తన తెగువను చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన్న కథానాయిక. దసరా సందర్భంగా కొండారెడ్డి బురుజు ముందు మహేష్‌బాబు గొడ్డలి పట్టుకొని నిల్చొన్న కొత్త లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో మాస్, క్లాస్ కోణంలో నవ్య పంథాలో మహేష్‌బాబు కనిపిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. నవంబరు నెలాఖరు వరకు తమిళనాడు, కేరళలో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. సంక్రాంతికి సినిమాను విడుదలచేస్తాం అని చిత్రబృందం తెలిపింది. విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్.

దసరా లుక్స్

భాగ్యనగరంలో మామాఅల్లుళ్లు..


Venkatesh
నచ్చిన నెచ్చెలుల తోడుగా ప్రేమయాత్రకు బయలుదేరారు మామాఅల్లుళ్లు. వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రం వెంకీమామ. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలు. దసరా రోజున చిత్ర టీజర్‌తో పాటు కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ట్రాక్టర్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని వెంకటేష్ చిరునవ్వులు చిందిస్తుండగా ఆయన వెనుక నాగచైతన్య నిల్చున్నారు. వారికి ఇరుపక్కలా రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీసెట్‌లో వెంకటేష్, నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణంపై పాటను చిత్రీకరిస్తున్నామని చిత్రబృందం తెలిపింది.

ఇద్దరి లోకం ఒకటే..


Raj-Tarun
రాజ్‌తరుణ్, షాలినిపాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఇద్దరి లోకం ఒకటే. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విజయదశమి సందర్భంగా చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో షాలినీ పాండే బైక్ నడుపుతుండగా వెనక కూర్చున్న రాజ్‌తరుణ్ ఆమె చూస్తూ మైమరచిపోతున్నారు. నవ్యమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. 90 శాతం షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసి నవంబర్ రెండో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చిత్రబృందం తెలిపింది.

బన్నీ యాక్షన్..


Allu-Arjun
అల్లు అర్జున్ యాక్షన్ అవతారమెత్తారు. వస్ర్తాన్నే తన ఆయుధంగా మలుచుకొని శత్రుసంహారం చేస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అల వైకుంఠపురములో. పూజా హెగ్డే కథానాయిక. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయదశమిని పురస్కరించుకొని అల్లు అర్జున్ కొత్త లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. యాక్షన్ లుక్‌లో ైస్టెలిష్‌గా కనిపిస్తున్న బన్నీ తాజా లుక్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. నిర్మాతలు మాట్లాడుతూ త్రివిక్రమ్ శైలి హంగులతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాం.సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.

దసరాప్రకటనలు

పోలీస్ పాత్రలో శ్రీవిష్ణు


Sree-Vishnu
శ్రీవిష్ణు కథానాయకుడిగా లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఎం.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రదీప్ వర్మ దర్శకుడు మాట్లాడుతూ పోలీస్ ఇతివృత్తంతో రూపొందనున్న డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. శ్రీవిష్ణు పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. త్వరలో మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసఫ్, ఆర్ట్: వివేక్

కామెడీ థ్రిల్లర్ కథ..


Anand-Deverakonda
దొరసాని చిత్రంలో సహజఅభినయంతో తొలి అడుగులోనే ప్రతిభను చాటుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి(యూఎస్‌ఏ) పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనున్నది. విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. దామోదర అట్టాడ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ కామెడీ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఆనంద్ దేవరకొండ పాత్రచిత్రణ, లుక్ వినూత్నంగా ఉంటాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్ని జరుపుతున్నాం. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. త్వరలో ఇతర నటీనటుల వివరాల్ని వెల్లడిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా, సంగీతం: అమిత్ దాసాని, సిద్ధార్థ్ సదాశివుని, రామ్ మిరియాల.

దసరాక్లాప్స్

సీనయ్య మొదలైంది


Dil-Raju
దర్శకుడు వి.వి.వినాయక్ హీరోగా పరిచయమవుతున్న సీనయ్య చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నరసింహా దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, కొరటాల శివ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ 1982-84 బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. సీనయ్య అనే వ్యక్తి జీవితగమనానికి చక్కటి దృశ్యరూపంగా ఉంటుంది. భావోద్వేగ ప్రధానంగా సాగే ఈ కథకు సరిపోయే హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో వినాయక్ గుర్తొచ్చాడు. ఆయన కథ విని సినిమా చేస్తున్నానని చెప్పాడు. వినాయక్ ఫస్ట్‌లుక్ అందరూ బాగుందంటున్నారు అని చెప్పారు. సీనయ్య పాత్ర ప్రధానంగా సాగే కథ ఇదని, ఈ క్యారెక్టర్ కోసం తాను బరువు తగ్గానని వినాయక్ పేర్కొన్నారు. వినాయక్ పుట్టినరోజున సినిమా ప్రారంభించడం ఆనందంగా ఉందని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వేసవిలో సినిమాను విడుదలచేస్తామని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, అనిల్‌రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్.

కొరటాల శివ దర్శకత్వంలో..


Chiranjeevi
సైరా తర్వాత కమర్షియల్ బాట పట్టారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్ర పూజా కార్యక్రమాల్ని విజయదశమి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.

ప్రేమ కథతో రంగ్ దే


Nithiin
నితిన్, కీర్తిసురేష్ కలయికలో రూపొందుతున్న చిత్రం రంగ్ దే దసరా రోజున మొదలైంది. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్‌నివ్వగా..నిర్మాతలు దిల్‌రాజు, ఎస్.రాధాకృష్ణ దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ కుటుంబ విలువలతో ముడిపడిన ప్రేమకథా చిత్రమిది. ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం. 2020 వేసవిలో సినిమాను విడుదలచేస్తాం అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్.

సోలో బ్రతుకే సో బెటర్..


Sai-Dharam-Tej
సాయితేజ్, నభానటేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ వినోదాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయనున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి ఆర్ట్: అవినాష్ కొల్ల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: వెంకట్.సి.దిలీప్.

810

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles