డబ్బుకోసం సినిమాలు చేయను

Tue,September 17, 2019 12:13 AM

మాస్ నాడీ తెలిసిన దర్శకుడు హరీష్‌శంకర్. హీరోయిజాన్ని పతాకస్థాయిలో ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు. ఆయన సంభాషణల్లో అదిరిపోయే పంచ్‌లు, వ్యంగ్యం వినిపిస్తాయి. సమకాలీన తెలుగు దర్శకుల్లో చక్కటి సాహిత్యాభిలాష ఉన్న నిర్ధేశకుడాయన. మిరపకాయ్, గబ్బర్‌సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్నారు. హరీష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో హరీష్‌శంకర్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి...


తమిళ చిత్రం జిగర్తాండను తెలుగులో రీమేక్ చేయాలని ఎందుకనిపించింది?

-సినిమాను మనం ఎంచుకోవడం కాదు సినిమానే మనల్ని సెలెక్ట్ చేసుకుంటుందన్నది నా సిద్ధాంతం. మిరపకాయ్ తర్వాత స్ట్రెయిట్ సినిమా చేయాలనుకున్నాను. కానీ గబ్బర్‌సింగ్ తెరకెక్కించాను. అలాగే దాగుడుమూతలు సినిమాను పక్కనపెట్టిన సమయంలోనే తమిళ చిత్రం పేట ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఆ చిత్ర దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించిన జిగర్తాండ గుర్తొచ్చింది. ఇదివరకు తెలుగులో ఈ సినిమాను దిల్‌రాజు, నేను కలిసి రీమేక్ చేద్దామని అనుకున్నాం. కానీ సీరియస్‌గా ప్రయత్నించకపోవడంతో కుదరలేదు. మాతృకలోని బాబీసింహా పోషించిన పాత్రను ఓ హీరోతో చేయిస్తే బాగుంటుందనిపించింది. వరుణ్‌కు నా ఆలోచన నచ్చింది.

వరుణ్‌తేజ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ రీమేక్‌ను తెరకెక్కించారా?

ఈ రీమేక్‌కు ముందు దాగుడుమూతలు అనే స్ట్రెయిట్ స్క్రిప్ట్‌ను వరుణ్‌తేజ్‌కు వినిపించాను. ఆయనకు కథ నచ్చింది. ఫిదా, తొలిప్రేమ విజయాలతో ఉన్న వరుణ్‌తో ఈ సినిమా చేస్తే దర్శకుడిగా నాకు కొత్తగా ఉంటుందనిపించింది. ఆ మాటే వరుణ్‌తో అంటే నాకు మీ శైలి మాస్ సినిమా చేయాలనుందని సమాధానమిచ్చాడు. అలా వాల్మీకి మొదలైంది

ఈ సినిమా నేపథ్యమేమిటి?

మనిషిలో అత్యున్నత మార్పుకు వాల్మీకి మహర్షి గొప్ప నిదర్శనం. ఆ పాయింట్‌తోనే రూపొందిన చిత్రమిది. గద్దలకొండ గణేష్ అనే యువకుడిలో పరివర్తనకు దారితీసిన పరిస్థితులు ఆసక్తిని పంచుతాయి. పదేళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకునేలా ఉంటుంది.

మాతృకతో పోలిస్తే తెలుగులో ఎలాంటి మార్పులు చేశారు?

జిగర్తాండ సినిమాను అద్భుతమైన కథ, స్క్రీన్‌ప్లేతో కార్తిక్ సుబ్బరాజు మలిచిన విధానం నాకు నచ్చింది. అందుకే భాష, నేటివిటీ పరమైనవి తప్ప మిగతా అంశాల్లో పెద్దగా మార్పులేవీ చేయలేదు. తెలుగులో వరుణ్‌తేజ్‌కు ఉన్న ఇమేజ్‌ను అనుసరించి అతడి పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దాం.

వాల్మీకి టైటిల్‌పై అభ్యంతరాలు వచ్చాయి?

టైటిల్ వివాదం కోర్టులో ఉంది కాబట్టి దానిపై నేనేమీ మాట్లాడను. టైటిల్ రిజిస్ట్రేషన్ నిర్మాతలకు సంబంధించిన అంశం. దానికి దర్శకులతో సంబంధం ఉండదు.

డీజే తర్వాత పూజాహెగ్డేను కథానాయికగా ఎంచుకోవడానికి కారణమేమిటి?

పూజాహెగ్డే అతిథి పాత్రలో నటించింది. ఆమె సినిమాలో హీరోయిన్ కాదు. ద్వితీయార్థంలో పూజా పాత్ర కనిపిస్తుంది. కథ డిమాండ్ మేరకు ఆమెను తీసుకున్నాం.

దేవత చిత్రంలోని ఎల్లువొచ్చి గోదారమ్మా పాటను రీమిక్స్ చేయాలని ఎందుకనిపించింది?

కమర్షియాలిటీ కోసం కాకుండా కథానుసారమే ఈ సూపర్‌హిట్ పాటను రీమిక్స్ చేశాం. ఆధునిక ఛాయలు కనిపించకుండా 1980శైలిలోనే పాటను పిక్చరైజ్‌చేశాం. మంచి పాటను పాడుచేశారనే భావన ప్రేక్షకుల్లో కలగనీయకుండా పాతపాటలోనే నేపథ్యం, సిగ్నేచర్ స్టెప్స్‌ను ఉపయోగించాం

ఈ సినిమాలో చాలా మంది నటీనటులు అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారని చెబుతున్నారు?

నితిన్, బ్రహ్మానందం, దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో అతిథులుగా కనిపిస్తారు.

దాగుడు మూతలు సినిమా వర్కవుట్ కాకపోవడానికి కారణమేమిటి?

ఇద్దరు హీరోలతో సాగే కథ ఇది. వరుణ్‌తేజ్‌తో పాటు చాలా మంది హీరోలకు ఈ కథ వినిపించాను. కానీ ఆ పాత్రలకు సరిపోయే నటులు మాత్రం దొరకలేదు. కాంప్రమైజ్ కాకూడదనే ఆలోచనతో సినిమాను పక్కనపెట్టాం.

దాగుడుమూతలు సినిమా విషయంలో మీకు, నిర్మాత దిల్‌రాజుకు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి? అందుకే ఆగిపోయిందని అన్నారు?

సినిమా రూపకల్పనలో దర్శకనిర్మాతల మధ్య సృజనాత్మకపరమైన వైరుధ్యాలు తలెత్తడం సహజం. దిల్‌రాజుతో నేను ఇదివరకు కలిసి చేసిన సినిమాల్లో అలాంటి విభేదాలు చాలా వచ్చాయి. దాగుడుమూతలు సినిమాను స్టార్స్‌తో చేయాలని దిల్‌రాజు భావించారు. నేను మాత్రం మంచి నటుల్ని తీసుకోవాలని అనుకున్నాను. పెద్ద హీరోలతో చేస్తేనే బాగుంటుందని దిల్‌రాజు కోరుకోవడంలో తప్పులేదు.

మీరు నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి?

ప్రస్తుతం నవ్యమైన కథాంశాలతో కూడిన చిన్న సినిమాలు అద్భుతమైన విజయాల్ని సాధిస్తున్నాయి. అలాంటి కొత్త తరహా చిత్రాల్ని నిర్మించే ఆలోచనలో ఉన్నాను. దర్శకుడిగా కొనసాగుతూనే నిర్మాణ వ్యవహారాల్ని చేపట్టడం కష్టం. అందుకే జవాన్ నిర్మాత కృష్ణ, మహేష్‌కోనేరులతో పాటు మరికొందరు మిత్రులతో కలిసి సినిమాల్ని నిర్మించబోతున్నాను.

అంధాదున్ రీమేక్‌కు మీరు దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి?

వాల్మీకి సినిమా సెట్స్‌కు నితిన్ వచ్చినపుడు ఈ రీమేక్ గురించి అతడిని అడిగాను. రీమేక్ చేస్తున్నది నిజమేనని, త్వరలోఅధికారికంగా ఈ చిత్రాన్ని గురించి ప్రకటిస్తానని చెప్పాడు. అంతకుమించి మా మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.

సినిమాల మధ్య విరామం ఎక్కువ తీసుకుంటున్నారెందుకు?

గ్యాప్ తీసుకోవడం కాదు.. వస్తున్నది. దాగుడుమూతలు కథ కోసం తొమ్మిదినెలలు కష్టపడ్డాను. ఆ సమయం వృథా అయిందని అనుకోవడం లేదు. కష్టానికి ఫలితం తప్పకుండా ఏదో ఒక రోజు దక్కుతుంది. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నాను. అందుకే డబ్బుల కోసం, ఆస్తులు కూడబెట్టుకోవడానికి సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు.

షాక్ తర్వాత కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు?

రవితేజ ఇమేజ్‌ను పట్టించుకోకుండా షాక్ ను రూపొందించడంతో సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు నాకు అవకాశం రాలేదు. నాకున్న చదువు, సాహిత్య పరిజ్ఞానాన్ని చూపించకుండా నా సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుంటూ కమర్షియల్ చిత్రాల్ని చేయడం మొదలుపెట్టాను.

కమర్షియల్ దర్శకుడు అనే ముద్ర వల్లే అన్ని రకాల కథలతో సినిమాల్ని చేయలేకపోతున్నారని అనుకోవచ్చా?

తెలుగు చిత్రసీమలో తొలుత నిర్మాత, హీరో కాంబినేషన్ కుదిరిన తర్వాతే దర్శకుడి కోసం అన్వేషణ మొదలవుతుంది. ఒకవేళ దర్శకుడు విజయాల్లో ఉంటే...అతడితో హీరో కలయిక కుదిరిన తర్వాత నిర్మాత వారితో జతకలుస్తాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ట్రెండ్ వల్ల కథ రాయడం మొదలుపెట్టిన తొలి అక్షరంతోనే దర్శకులపై పరిమితులు మొదలవుతాయి. దర్శకుడు ముందుకథ రాసి దానికి తగిన హీరో కోసం వెతికే సంస్కృతి మంచిది. కానీ అది తెలుగులో కనిపించడం లేదు.

మీ దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే ఏమిటి?

ఎక్కువ మంది చూసేవన్నీ కమర్షియల్ సినిమాలే. సాగరసంగమం, మహానటి కమర్షియల్ చిత్రాలుగానే భావిస్తాను. కానీ చాలా మంది ఫైట్స్, డాన్సులున్న సినిమాలను కమర్షియల్ సినిమాలుగా అభివర్ణిస్తున్నారు. అది తప్పని నా భావన.

రీమేక్‌లను తెరకెక్కించడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయి?

సినిమా రూపకల్పనలో నాదైన క్రియేటివిటీని చూపించగలిగాను కాబట్టే మాటలు, మార్పులు, దర్శకత్వం అని టైటిల్ కార్డ్స్‌లో పేరును ధైర్యంగా వేసుకుంటున్నాను. స్ట్రెయిట్, రీమేక్‌లలో దేనికైనా కష్టాలుంటాయి. రీమేక్ సినిమాలు తెరకెక్కిస్తున్నప్పుడు మాతృక రిఫరెన్స్‌గా ఉంటుంది కాబట్టి మేకింగ్ సులభమవుతుంది. కానీ దర్శకులపై ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్‌క్లాస్‌లో పాసయి మార్కులు ప్రకటించిన వాడితో పరీక్ష రాస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నా దృష్టిలో సినిమాలన్నీ రీమేక్‌లే. ఒక సినిమాకు నవల, కథ, విభిన్నంగా మాట్లాడే వ్యక్తులు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటప్పుడు ఓ సినిమాకు మరో సినిమా స్ఫూర్తిగా నిలవడం తప్పుకాదన్నది నా అభిప్రాయం. నాకు నచ్చిన ఏ సినిమానైనా రీమేక్ చేస్తాను.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

-స్టార్ హీరోలందరితో సినిమాలు చేయాలనుంది. ఎన్టీఆర్ నన్ను నమ్మి సినిమా చేశాడు. అతడికి హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఉంది. ఆ రుణం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నాను.
-చలం మైదానం, యండమూరి ప్రేమ నవలలను సినిమాలుగా మలచాలనుంది.కానీ చేయలేకపోతున్నాను.

1074

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles