మంచి కథల కోసం అన్వేషిస్తున్నా!

Sat,October 26, 2019 12:08 AM

రోజాపూలు ఒకరికొకరు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలతో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు శ్రీరామ్. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాగల 24గంటల్లో. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. నవంబర్ మొదటివారంలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీరామ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి...


కొంత విరామం తర్వాత నేను తెలుగులో నటిస్తున్న అసలేం జరిగింది షూటింగ్ ముగించుకొని చెన్నైలో ఉండగా శ్రీనివాసరెడ్డి ఈ కథ చెప్పారు. వినగానే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మర్డర్‌మిస్టరీ థ్రిల్లర్ ఇతివృత్తంతో సాగుతుంది. కామెడీ, ఫ్యామిలీ కథా చిత్రాల దర్శకుడిగా పేరున్న శ్రీనివాసరెడ్డి ఇలాంటి వినూత్నమైన పాయింట్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు షూటింగ్‌లోనే నాపై పతాక ఘట్టాల్ని చిత్రీకరించారు. బలమైన ఉద్వేగాలు కలబోసిన ఆ సన్నివేశాలు సినిమాకు ఆయువుపట్టుగా ఉంటాయి.

సరికొత్త పోలీస్ పాత్రలో...

నేను గతంలో పోలీస్ పాత్రల్ని పోషించాను. కానీ ఇందులో భిన్న పార్శాల్లో నా పాత్ర సాగుతుంది. మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీస్ అధికారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. 24 గంటల్లో జరిగే కథ ఇది. అనుక్షణం అనూహ్య మలుపులతో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. సినిమాలోని ప్రతి పాత్రకు రెండు భిన్నమైన కోణాలుంటాయి.

మంచి అవకాశాల కోసం...

తెలుగులో వినూత్నమైన కథల కోసం అన్వేషిస్తున్నాను. నచ్చిన కథలు దొరక్కపోవడం వల్లే తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నాను. స్వతహాగా నాకు ప్రేమకథా చిత్రాలంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగులో లవ్‌స్టోరీస్ తెరకెక్కించే ధోరణి ఎక్కువగా ఉండటం సానుకూల పరిణామంగా చెప్పవచ్చు.

రెండు భాషల్లో అవకాశాలు..

ప్రస్తుతం తమిళంలో ఆరు సినిమాలు చేస్తున్నాను. అన్నీ సోలో హీరోగానే తెరకెక్కబోతున్నాయి. ఇక తెలుగులో మధుకర్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. సామాజికాంశాలు మేళవించిన ప్రేమకథ అది. నేను అనుకోకుండా హీరోనయ్యా. కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు వెల్లువెత్తాయి. చేతిలో పుష్కలమైన అవకాశాలు ఉన్న తరుణంలోఓ ప్రమాదం కారణంగా ఏడాది పాటు చిత్రీసీమకు దూరంగా ఉన్నాను. ఆ గ్యాప్ వల్ల వచ్చిన అవకాశాల్ని వదులుకోవాల్సి వచ్చింది.

570

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles