అభిమానాన్ని సంపాదించుకున్నాడు!

Mon,September 23, 2019 12:33 AM

‘అందరూ ఆస్తులు సంపాదించుకుంటే కాదంబరి కిరణ్‌ మాత్రం పదిమంది అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు. సేవా మార్గాన్ని అనుసరిస్తూ అనేక మంది సాయపడుతున్నాడు’ అని అన్నారు హాస్యనటుడు అలీ. నటుడు కాదంబరి కిరణ్‌ జన్మదినంతో పాటు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మనం సైతం’ సేవా సంస్థ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకలో అలీ, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కిరణ్‌ ఒక్కడిగా ఎదుగుతూ పైకొచ్చారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా అందరి ఆదరణ చూరగొన్నాడు’ అని తెలిపారు. ‘మనం సైతం’ ద్వారా కాదంబరి కిరణ్‌ మంచి కార్యక్రమాల్ని చేస్తున్నాడని, ఈ సంస్థకు వ్యక్తిగతంగా తాను ఆర్థిక సహాయం చేస్తానని పృథ్వీ తెలిపారు. కాదంబరి కిరణ్‌ మాట్లాడుతూ ‘సేవ చేసే మనసున్న వారే నా దృష్టిలో గొప్పోళ్లు. ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యాన్ని దాచిపెట్టి మరణించిన వారిని చాలా మందిని చూశాను. పేదవారికి జనతా ఆసుపత్రి, వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఒకే ప్రాంగణంలో నిర్మించాలన్నది నా జీవితాశయం. నేను ఉన్నా లేకపోయినా ‘మనం సైతం’ మాత్రం ఇలాగే కొనసాగుతుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్తిక్‌రెడ్డి, అజయ్‌కుమార్‌, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

436

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles