తెర వెనక కూడా హీరోగా ఉండాల్సిందే!

Sat,October 5, 2019 12:08 AM

చిన్నతనం నుంచి డబ్బు విలువ తెలియజెపుతూ నానమ్మ విజయనిర్మల నన్ను పెంచింది. 16 ఏళ్ల వయసులోనే ఇంటినుంచి బయటకు వచ్చి రానాకు చెందిన యాడ్ ఫిలిం కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. తొలిజీతం వెయ్యి రూపాయలు నానమ్మకు బహుమతిగా ఇచ్చాను అని అన్నారు నవీన్ విజయ్‌కృష్ణ.ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రంఊరంతా అనుకుంటున్నారు.బాలాజీ సానల దర్శకుడు. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్నారు.నేడు విడుదలకానుంది.ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నవీన్‌విజయ్ కృష్ణ పాత్రికేయులతో ముచ్చటించారు.


రామాపురం అనే ఊరిలో జరిగే కథ ఇది. ప్రేమ, పెళ్లి బంధాల విషయంలో మహేష్, గౌరి అనే జంటకు ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? పట్టణ సంస్కృతికి అలవాటు పడిన వారిలో పల్లె జీవితం ఎలా పరివర్తనను తీసుకొచ్చింది? ఆ జంట ప్రేమ కథకు పరిస్థితులు ఏ విధంగా విలన్‌గా పరిణమించాయన్నదే చిత్ర ఇతివృత్తం.కుటుంబ విలువలు, సెంటిమెంట్‌తో హృద్యంగా ఈ కథ సాగుతుంది. ప్రతి ఒక్కరికి పల్లెటూరి జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది. సాంకేతిక మాయలో పడిన నేటి యువతకు గతకాలపు సంస్కృతి సంప్రదాయాల విలువను తెలియజెపుతుంది.

నా సినిమాలు ఆగిపోయాయి..

నా తొలి సినిమా ఐనా ఇష్టం నువ్వు 90 శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఆగిపోయింది. నేను, నాన్న కలిసి నటిస్తున్న విఠాలచార్య సినిమాకు సమంత నటించిన ఓ బేబీ కథతో దగ్గరి పోలికలు ఉండటంతో ఆపేశాం.నా సినిమాల విషయంలో తెరవెనుక అనూహ్య పరిణామాలు జరిగాయి.వాటన్నింటిని కథగా రాసి సినిమా తీస్తే పెద్ద హిట్టయ్యేదనిపించింది.ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాలు ఆగిపోవడంతో చాలా బాధపడ్డాను.నా ఒక్కడికే కాదు చాలా మందికి అలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయని సర్దిచెప్పుకున్నాను.కాకతాళీయంగా వచ్చిన ఈ గ్యాప్‌లో నటుడిగా చాలా నేర్చుకున్నాను.

హీరో లైఫ్ ఒంటరి..

హీరోగా బతకడం నా దృష్టిలో చాలా కష్టం. తెరమీదే కాదు తెరవెనుక కథానాయకుడిగా ఉండాల్సిందే.ఆహార్యం, మాటతీరు విషయంలో పరిమితుల్లో ఉండాలి.యాటిట్యూడ్ చూపించాలి.వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్పుకోవాలి.వాటన్నింటికి నేను అలవాటు పడటం కష్టమనిపించింది. హీరో లైఫ్ ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది.ఆ పంథాను బ్రేక్ చేయాలనుకున్నాను.అందుకే కారావ్యాన్‌లో ఎప్పుడూ ఉండను.సెట్స్‌లో అందరితో కలిసిపోతూ నాకు నచ్చినట్లుగా ఉంటాను.

కష్టాలు అనుభవించాను..

డేంజర్ సినిమాతో ఎడిటర్‌గా నా ప్రయాణం ప్రారంభమైంది.ఆ తర్వాత చందమామ, రాఖీతో పాటు పలు చిత్రాలకు పదేళ్ల పాటు పనిచేశాను. అరుంధతి చిత్రానికి సౌండ్ డిజైనర్‌గా పనిచేశాను. నటన పట్ల ఉన్న ఇష్టంతోనే హీరోగా మారాను. నా తొలి సినిమాకు ముందు 130 కిలోల బరువు ఉండేవాణ్ణి. ఏడాదిలోగా బరువు తగ్గాను. దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది. నేను నటించే సినిమాల విషయంలో ఎడిటింగ్‌కు సంబంధించి దర్శకుడు సలహాలు అడిగితే ఇస్తాను.నాన్న, నేను స్నేహితుల్లానే ఉంటాం.నాకెరీర్‌లో ఆయన ఎక్కువగా జోక్యం చేసుకోరు. తదుపరి సినిమా ఖరారైంది.త్వరలో ఆ వివరాల్నివెల్లడిస్తాను.

701

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles