బడ్జెట్ పెరుగుతుంటేనిద్రపట్టేది కాదు!

Tue,August 27, 2019 12:28 AM

తొలి సినిమా సమయంలో హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతానా?లేదా? అనే సంశయాలు ఉండేవి. బాహుబలి తర్వాత ప్రేక్షకుల్ని ఎలాంటి కథలతో మెప్పించాలి? నా సినిమాలతో ఎన్ని భాషల ప్రేక్షకులకు చేరువ కాగలననే ఒత్తిడులు పెరిగాయి. సక్సెస్‌లకు అనుగుణంగా సినిమాల పట్ల బాధ్యత, ప్రేమ, అంకితభావం పెరుగుతూ వస్తున్నాయి అని అన్నారు ప్రభాస్.బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి హీరోగా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్. భాషాభేదాలకు అతీతంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సాహో. సుజీత్ దర్శకుడు. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రభాస్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...


-శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌లో ఎక్కువగా ప్రేమకథల్లోనే కనిపించింది. వాటికి భిన్నంగా ఈ సినిమాలో యాక్షన్ ప్రధాన పాత్రను చేసింది. ఆమె పాత్ర దృక్కోణం నుంచే ఈ కథ సాగుతుంది. పాటల్లో వచ్చే పాత్ర కాకుండా కథలో ఆమె క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది.

-బాహుబలిలా ఇది పెద్ద కథ కాదు. ఆ సినిమా అనంతరం స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే కథనే ఎంచుకోని నటించడం కరెక్ట్ అనిపించింది. సుజీత్ చిత్ర కథనాన్ని నడిపించిన తీరు వినూత్నంగా ఉంటుంది. కథే ఈసినిమాకు మూలం. ఆ తర్వాతే దర్శకుడు సుజీత్‌ను నమ్మాను.


ప్రస్తుతం తెలుగు సినిమా ధోరణుల్లో వస్తున్న మార్పుల పట్ల మీ అభిప్రాయమేమిటి?

-గత కొంతకాలంగా చిన్న సినిమాలు మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. అర్జున్‌రెడ్డి, జెర్సీ లాంటి కథాబలమున్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు ప్రతిభను చాటాయి. నాని లాంటి స్టార్ హీరోలు జెర్సీ లాంటి కథల్ని అంగీకరించడం శుభపరిణామంగా చెప్పవచ్చు. చిన్న సినిమాలు విజయాల్ని సాధించినప్పుడే కొత్త కథలు వస్తాయి.

అందరి ఒత్తిడులను మీరు తీసుకుంటున్నారు? మీ మానసిక ఒత్తిడిని పంచుకునే వారు మీ జీవితంలోకి ఎప్పుడూ రాబోతున్నారు?

-ఒత్తిడిని పంచుకునేవాళ్లు వస్తారో, మరింత భారం పెంచేవాళ్లు వస్తారో తెలియదు (నవ్వుతూ). పెళ్లి వాయిదా వేయాలని అనుకోలేదు. కానీ అలా జరిగిపోతున్నది.

మిషన్ ఇంపాజిబుల్ తరహాలో భవిష్యత్తును గురించి చర్చించే కథాంశమిదా? ట్రైలర్‌లో కొంచెం ఆ ఛాయలు కనిపించాయి?

-అలాంటిదేమి లేదు. ఈ కథ వర్తమానంలోనే నడుస్తుంది. కమర్షియల్ కథాంశం కాబట్టి నిజ జీవితానికి మించిన విస్త్రృత పరిధి(లార్జర్ దేన్ లైఫ్) ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రథమార్థమంతా ముంబయిలో కథ నడుస్తుంది. ఇందులో వాడిన గన్స్, వస్ర్తాలు అన్నీ నేటి కాలాన్నే ప్రతిబింబిస్తాయి. భవిష్యత్తు గురించిన ప్రస్తావన ఉండదు. బాహుబలి తర్వాత అంతటి విజువల్ ఇంపాక్ట్ ఉండాలనే లక్ష్యంతో ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాల్ని అత్యున్నత సాంకేతికాంశాల మేళవింపుతో రూపకల్పన చేశాం.

దర్శకుడు సుజీత్‌కిది రెండో చిత్రమే. ఏ నమ్మకంతో అతనికి ఇంతటి భారీ బడ్జెట్ సినిమా బాధ్యతల్ని అప్పగించారు?

-సుజీత్‌తో నాకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. రన్‌రాజా రన్ తర్వాత ఈ కథతో నా దగ్గరకొచ్చాడు. సబ్జెక్ట్, నా పాత్ర చిత్రణ విషయంలో సుజీత్‌కు కొన్ని రిఫరెన్స్‌లు ఇచ్చాను. షూటింగ్‌కు ముందు వర్క్‌షాప్స్ నిర్వహించాం. నా పాత్ర చిత్రణ విషయంలో సుజీత్ వినోదానికి పెద్దపీట వేశాడు. మీరు ట్రైలర్‌ను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది.

అసలు ఇంతకి ఈ సినిమా కథేమిటి? మీరు ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని అంటున్నారు?

-ద్విపాత్రాభినయం కాకపోవచ్చు (నవ్వుతూ). కథ గురించి ఇప్పుడే చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు తెలియని ఉత్సుకతతో సినిమా చూస్తేనే బాగుంటుంది.

బాహుబలి తర్వాత తిరిగి యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉన్న కాన్సెప్ట్‌నే ఎందుకు ఎంచుకోవాలనిపించింది?

-బాహుబలి తర్వాత యాక్షన్ సినిమా చేయాలనుకోలేదు. ప్రేమకథ కోసం ప్రయత్నించాం. కానీ వర్కవుట్ కాలేదు. సుజీత్ స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పాడు. బాహుబలి విడుదలైన తర్వాత సాహో కథకు మరింతగా మెరుగులుదిద్దాం. 150కోట్ల బడ్జెట్‌తో పూర్తిచేద్దామనుకున్నాం. కానీ అనుకున్నదానికంటే ఎక్కువైంది.

శ్రద్ధగా సినిమా తీసి వుంటే వందకోట్లు మిగిలేవి అని ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు. ఏ దృష్టితో ఆ కామెంట్స్ చేశారు?

-బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు నా డిపార్ట్‌మెంట్ కాదు (నవ్వుతూ). నిర్మాతలు నా మిత్రులు..వాళ్లు రన్‌రాజా రన్ చిత్రానికే తొమ్మిదికోట్లు ఖర్చుపెట్టారు. దర్శకుడికి రెండో చిత్రమైనా సినిమా నాణ్యత విషయంలో రాజీపడటం వారికి ఇష్టం లేదు. అదీగాక బాహుబలి తర్వాత నా నుంచి వస్తున్న చిత్రమిది. కాబట్టి మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దనుకున్నాం. అయితే కొంచెం శ్రద్ధ పెడితే ఖర్చు తగ్గేదేమో.

Prabhas

సినిమా సాంకేతికంగా ఉన్నతంగా అనిపిస్తున్నది. కథాంశం పరంగా ఎలా ఉండబోతున్నది?

-ఏ సినిమాకైనా ఫస్ట్ కంటెంటే ప్రధానం. అయితే ఇతివృత్తాన్ని మరింత ఉన్నతీకరించడానికి సాంకేతికంగా హంగుల్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఈ రోజు సినిమాలోని ఓ గీతాన్ని విడుదల చేశాం. దానిని మామూలుగా కూడా చిత్రీకరించవొచ్చు. అయితే కంటెంట్‌లోని ఫీల్‌ను ప్రదర్శించాలంటే విజువల్‌గా గ్రాండియర్ అవసరం. ఈ సినిమాలో సాంకేతికాంశాలతో పాటు సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది.

బాహుబలి సినిమాకొచ్చిన క్రేజ్ వల్లే సాహో బడ్జెట్ పెంచారని అంటున్నారు?

-బాహబలి క్రేజ్ అని కాదు. ఆ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగా కన్విన్సింగ్‌గా ఉండాలని బడ్జెట్‌ను పెంచడం జరిగింది. అయితే సినిమాకు బడ్జెట్ పెరుగుతున్నప్పుడల్లా నాకు నిద్రపట్టేది కాదు (నవ్వుతూ). అయితే ఈ సినిమా విషయంలో లాభాల్ని దృష్టిలో పెట్టుకోకుండా క్వాలిటీ సినిమా అందించాలనే తపనతో పనిచేశాం.

ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉందా?

-కథతో పాటు అన్ని పక్కాగా కుదిరితే తప్పకుండా సాహోకు సీక్వెల్ చేస్తాం. వెంటనే సీక్వెల్‌ను మొదలుపెట్టకుండా సమయం తీసుకొని రూపొందించాలని అనుకుంటున్నాం.

నిజజీవితంలో మీరు చాలా సింపుల్‌గా, సైలెంట్‌గా కనిపిస్తారు. కానీ సినిమాలో మాత్రం వయొలెంట్‌గా నటించారు?

-డబ్బులు తీసుకున్నాను కాబట్టే అలా నటించాను(నవ్వుతూ).

పాన్ ఇండియన్ సినిమా చేయడాన్ని ఒత్తిడిగా భావిస్తున్నారా? అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనే టెన్షన్ ఉంటుందా?

-ప్రతి వ్యాపార రంగంలో లక్ష్యం అనేది తప్పకుండా ఉంటుంది. వాటి కోసం కష్టపడాల్సిందే. బాహుబలి తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. సక్సెస్ చేయాలనే తపనతో నిద్రలేకుండా ప్రతి ఒక్కరం సినిమా కోసం శ్రమించాం.

ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ అంశాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తుంది?

-పూర్తి యాక్షన్ ప్రధానంగా కథ సాగదు. ఫైట్స్ నాలుగు మాత్రమే ఉంటాయి. అవన్నీ చాలా గ్రాండియర్‌గా ైస్టెలిష్‌గా సాగుతాయి. కార్స్ ఛేజింగ్ సన్నివేశాలు సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తాయి. ప్రతి ఫైట్‌ను యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వినూత్నంగా డిజైన్ చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఫైట్స్ తీర్చిదిద్దారు.

ఫలితం విషయంలో టెన్షన్ పడుతున్నారా?

-బాహుబలి కంటే ఎక్కువ టెన్షన్ ఉంది. మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

Prabhas1

బాలీవుడ్ హీరోలు ఎవరైనా మీతో టచ్‌లో ఉన్నారా?మీ సినిమాల గురించి మాట్లాడారా?

-రణభీర్, అజయ్‌దేవగణ్‌తో పాటు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. రణభీర్ నేను నటించిన ప్రతి సినిమా చూసి తన అభిప్రాయం చెబుతుంటాడు. నాలుగైదు నెలల క్రితం అమీర్‌ఖాన్ ఓ హిందీ సినిమా చూడటానికి రమ్మని ఆహ్వానించారు. బయట వినిపిస్తున్న ప్రచారాలకు భిన్నంగా బాలీవుడ్ వారితో నా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు.

మీ కెరీర్ ఎదుగుదల పట్ల పెదనాన్న కృష్ణంరాజు ఎలా ఫీలవుతున్నారు. ఆయనకు సాహో సినిమా చూపించారా?

-ట్రైలర్ చూసి పెద్దనాన్న చాలా సంతోషపడ్డారు. ఎక్కడకు వెళ్లినా అందరూ నా గురించి, నేను నటించిన సినిమాల గురించి గొప్పగా చెబుతుండటంతో ఆయన గర్వపడుతున్నారు. ఆయన సాహో సినిమా చూడలేదు.

రాధాకృష్ణతో చేస్తున్న మీ తదుపరి సినిమా కథలో పెద్దనాన్న ప్రమేయం ఎంత ఉంది?

-పెద్దనాన్న జోక్యం సినిమాలో ఏమీ లేదు.

దర్శకుడు చెప్పిన కథ నచ్చి సినిమాను నిర్మిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆధునికంగా ఆలోచిస్తుంటారాయన. ప్రేమకథ ఆయనకు చాలా నచ్చింది.
బాహుబలి తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయని అనుకుంటున్నారు?

-జీవితం సమూలంగా మారిపోయింది. కలలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతున్నది. రాజమౌళి నా జీవితంలో మాయ చేశారు. ఇంకా ఆ మాయలోనే ఉన్నాను.

1506

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles