డిఫెన్స్ ఆడటం రాదు..కొడితే సిక్సరే!


Mon,August 12, 2019 12:16 AM

prabhas shraddha kapoor interaction with media in hyderabad over saaho promotions

బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా కావడంతో నాణ్యత విషయంలో రాజీపడకూడదనే ఎక్కువ సమయం తీసుకొని ఈ సినిమా చేశాం అని అన్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రభాస్‌తో పాటు చిత్రబృందం సినిమా విశేషాల్ని పాత్రికేయులతో పంచుకున్నారు...

సాహో కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశమేది?

స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. కథాగమనం విభిన్న రీతిలో సాగుతుంది. బాహుబలి కంటే పెద్ద స్క్రిప్ట్ దొరకడం చాలా అరుదు. ఆ సినిమాకు భిన్నంగా దర్శకుడు సుజీత్ వినూత్నమైన పాయింట్‌తో సాహో చిత్రాన్ని తెరకెక్కించాడు.

బాహబలి తర్వాత మీరు నటిస్తున్న చిత్రమిది. ఈ విషయంలో దర్శకుడు సుజీత్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లుగా కనిపించింది?

సుజీత్‌తో పాటు మా అందరిపై బాహుబలి సినిమా తాలూకూ ఒత్తిడి ఉంది. బాహుబలి వంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత వస్తున్న చిత్రమిది కావడంతో నాణ్యత విషయంలో రాజీపడకూడదనే ఎక్కువ సమయం తీసుకున్నాం. సాబుసిరిల్, కమల్‌కన్నన్, శ్రీకర్ ప్రసాద్.. ఇలా దేశంలోనే ప్రతిభావంతులైన నిపుణులతో పాటు చైనా, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. దర్శకుడు సుజీత్ తనకున్న అనుభవానికి రెండో సినిమాను ఇంత పెద్ద స్థాయిలో తెరకెక్కించడం సులభం కాదు. నేను, నిర్మాతలు కొన్ని సార్లు ఒత్తిడిగా ఫీలయ్యాం. కానీ సుజీత్ సెట్స్‌లో ఏ రోజు కోపాన్ని, అసహనాన్ని బయటపెట్టలేదు.

ట్రైలర్ చూసి మీరు ఎలా ఫీలయ్యారు?

ట్రైలర్ కోసం 137 కట్స్ చేశాం. సినిమా చూసిన తర్వాత ట్రైలర్ కట్ చేయడానికి ఎందుకంత కష్టమైందో అర్థం అవుతుంది. సుజీత్‌తో పాటు నిఖిల్ అనే సహాయ దర్శకుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ట్రైలర్ కట్ చేశారు. థియేటర్‌లో ట్రైలర్ చూసి నేను ఉత్సుకతకు లోనయ్యాను.

ఒకే సినిమా అనుభవమున్న సుజీత్‌పై ఏ నమ్మకంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను అప్పగించారు?

తొలిరోజు సవాలుతో కూడిన ఓ సన్నివేశంతోనే షూటింగ్‌ను మొదలుపెట్టాం. ఐదు భిన్న పార్శాలతో నాలోని నటుణ్ణి చూపించే సన్నివేశం అది. నటుడు, దర్శకుడు కోణం నుంచి అది చాలా కష్టమైది. సుజీత్ తెరకెక్కించిన ఆ సన్నివేశాన్ని సింగిల్‌టేక్‌లో ఓకే చేశాం. ఎలాంటి రీషూట్ చేయలేదు. తొలిరోజు షూటింగ్‌లోనే అతడిలోని కాన్ఫిడెంట్ నన్ను ఆకట్టుకుంది.

ఈ సినిమా మిమ్మల్ని బాలీవుడ్ బాద్‌షాగా మార్చుతుందని అనుకుంటున్నారా?

బాలీవుడ్ బాద్‌షా అనేది నాకు అవసరం లేదు. బాహుబలిని చూసిన ప్రేక్షకుల్ని ఈ సినిమాతో మెప్పించడం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాం. సినిమాపై ఉన్న అంచనాలన్నింటికి విడుదలయ్యాకే సమాధానం దొరుకుతుంది.

ట్రైలర్‌లో స్టేడియంలో సిక్స్‌కొడితేనే థ్రిల్ అని చెప్పారు. నిజంగా క్రికెట్ ఆటలో మీరు ఎప్పుడైనా సిక్సర్ కొట్టారా?

బ్యాటింగ్ వెళ్లినప్పుడు బంతిని బలంగా కొట్టడమే నాకు తెలుసు.. డిఫెన్స్ ఆడటం అస్సలు రాదు. కొడితే సిక్స్ వెళ్లేది.

ఈ నెల 15న విడుదలకావాల్సిన సినిమాను ఎందుకు వాయిదా వేశారు?

యాక్షన్ సన్నివేశాల్లో నాణ్యత కోసం రెండు వారాలు వాయిదా వేశాం.

బాహుబలికి మించిన అంచనాలతో ఈ సినిమా వస్తున్నది. వాటిని ఎలా స్వీకరిస్తున్నారు?

సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు బాగుందని చెబితే నేను సంతోషపడతాను.

తెలుగులో ఈ సినిమాతో జేమ్స్‌బాండ్ తరహా చిత్రాన్ని చూపించబోతున్నారా? ఈ సినిమాకు హాలీవుడ్ స్ఫూర్తి ఏమైనా ఉందా?

ఏ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని చేయలేదు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని కొత్త కథను, విజువల్స్‌ను ప్రేక్షకులకు అందివ్వబోతున్నాం.

హిందీలోమీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారు? ఆ అనుభూతి ఎలా ఉంది?

హిందీ మాట్లాడటం, చదవడం నాకు బాగా వచ్చు. కానీ ఇంట్లో ఎక్కువగా మాట్లాడను. బాలీవుడ్ సినిమాల్లో ఉత్తరప్రదేశ్ హిందీ యాసను ఎక్కువగా వాడతారు. డబ్బింగ్‌లో ఆ పదాలు పలకడం చాలా కష్టమైంది. శిక్షకుడిని పెట్టుకొని డబ్బింగ్ చెప్పాను.

బాహుబలి సాహో కోసం సుదీర్ఘ సమయం తీసుకున్నారని అభిమానులు ఫీలవుతున్నారు?

తదుపరి సినిమాను తొందరగా పూర్తిచేసి దాని ద్వారా అభిమానులకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను.

సుజీత్ ఈ కథ చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏమిటి?

బాహుబలి తొలి భాగం విడుదల కావడానికి ముందు సుజీత్ ఈ కథ వినిపించాడు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే సినిమా చేయాలని భావించాం. బాహుబలి భారీ విజయం తర్వాత సాహో పరిధి విస్త్రతమైంది. అనుకున్నదాని కంటే పెద్ద సినిమా అయింది.

యూవీ క్రియేషన్స్ నిర్మాతలతో మీ అనుబంధం ఎలా ఉంటుంది?

ప్రమోద్ నా చిన్ననాటి స్నేహితుడు. వంశీ నా స్కూల్‌ఫ్రెండ్. వారిని కుటుంబ సభ్యులుగా భావిస్తాను కాబట్టే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది.

మీ తదుపరి సినిమా విశేషాలేమిటి?

గోపీకృష్ణ బ్యానర్‌లో ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్నాను. సాహో విడుదల తర్వాత షూటింగ్‌లో పాల్గొనబోతున్నాను. ఇప్పటికే 30 రోజుల చిత్రీకరణ పూర్తయింది.

ఈ సినిమా ట్రైలర్ పట్ల తెలుగు ఇండస్ట్రీ ప్రముఖుల స్పందన ఎలా ఉంది?

రాజమౌళి ట్రైలర్ చూసి సంతోషంగా ఫీలయ్యారు. బాగుందని అన్నారు. చిరంజీవి గారు మెసేజ్ చేయడం చాలా థ్రిల్‌గా అనిపించింది.

ఈ సినిమాతో మీరు బాలీవుడ్‌లో ఖాన్ త్రయానికి పోటీనివ్వబోతారని అనుకోవచ్చా?

ఖాన్ త్రయం తమ సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపారు. వారితో పోటీ పడాలనే ఆలోచనే తప్పు. అయితే హిందీ చిత్రసీమ నా పట్ల సౌహార్థ్రంగా ఉన్నారు. బాహుబలి విడుదల తర్వాత రణభీర్ వంటి పెద్ద హీరోలు సినిమా చూసి ప్రశంసించారు.

ఇదివరకు శ్రద్ధాకపూర్ పోషించిన పాత్రలతో పోలిస్తే నటిగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్‌లో మీరు గమనించిన కొత్తదనం ఏమిటి?

సినిమాలో శ్రద్ధా పాత్ర కీలకంగా ఉంటుంది. తొలిసారి శ్రద్ధాకపూర్ నటించిన యాక్షన్ సినిమా ఇది. బాలీవుడ్ వారు ఆమెను చూసి సర్‌ప్రైజ్ అవుతారు. సినిమాలో గన్‌ఫైట్ సీన్‌ను ఆమెపై తొలుత తెరకెక్కించాం. అందమైన అమ్మాయిని తుపాకులతో వినూత్నమైన లుక్‌లో కొత్తగా అద్భుతంగా చూపించారనిపించింది. శ్రద్ధా యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది.

శ్రద్ధాకపూర్ తెలుగు మాట్లాడటంలో మీరు ఎంతవరకు హెల్ప్ చేశారు?

శ్రద్ధాకపూర్ తెలుగులో మాట్లాడటానికి చాలా సమయం పడుతుందని మా యూనిట్ అంతా అనుకున్నాం. తొలిరోజు నుంచే ఆమె భాషపై చక్కటి పట్టు సాధించింది. ఆమె చెప్పిన సంభాషణల్లో తప్పుల్ని వెతికే అవకాశం రాలేదు.

Saaho
పాన్ ఇండియన్ చిత్రంగా సాహోను రూపొందించాం. ఇటీవల విడుదలైన రెండు పాటలకు చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఐమాక్స్ ఫార్మెట్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నాం
-నిర్మాతలు విక్కీ, ప్రమోద్

shraddha-kapoor
సాహో సినిమా కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నాను. హైదరాబాద్‌తో విడదీయలేని బంధం ఏర్పడింది. ఈ నగరం నాకు రెండోఇంటిలా మారిపోయింది. సాహో షూటింగ్ ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని మిగిల్చింది. నా హృదయానికి బాగా దగ్గరైన చిత్రమిది. సాహో లాంటి అద్భుతమైన సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలోని రొమాన్స్, యాక్షన్ సన్నివేశాల్ని సమంగా ఎంజాయ్ చేశాను. ప్రతి రోజు షూటింగ్ కొత్తగా అనిపించేది. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా సాహో ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ప్రభాస్‌తో సినిమా చేయడాన్ని మాటల్లో వర్ణించలేను. ఎంతో నిజాయితీ కలిగిన నటుడు. పోరాట ఘట్టాల్లో నటించడం చాలా కష్టమైంది. నా కెరీర్‌లో తొలిసారి ఈ సినిమా కోసం గన్ ఫైట్స్ చేశాను. పోలీస్ అధికారిణి పాత్ర కావడంతో బాధ్యతగా భావించి గన్ పట్టుకోవడంలో మెళకువలను నేర్చుకున్నాను.
-శ్రద్ధాకపూర్

1084

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles