కొమరంభీం, అల్లూరి వీరగాథ ఆర్ ఆర్ ఆర్!


Thu,March 14, 2019 11:01 PM

Rajamoulis RRR Release On July 30 2020

- అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్
- కొమరం భీంగా ఎన్టీఆర్
- 2020 జూలై 30న విడుదల

స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న ఇద్దరు మహా వీరులు, చరిత్రలో ఎప్పుడూ కలవని వాళ్లు నిజంగా మనకు తెలియని సమయంలో కలిసి వుంటే..ఒకరిని ఒకరు స్ఫూర్తిగా తీసుకుని తరువాత కాలంలో వాళ్ల మధ్య స్నేహం చిగురించి ఇద్దరు కలిసి పోరాటం చేస్తే ఎలా వుంటుంది అన్నది నాకు చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. ఈ అంశాన్ని తీసుకుని ఈ చిత్రానికి రూపకల్పన చేశాను అన్నారు ప్రముఖ దర్శకులు రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ (వర్కింగ్ టైటిల్). రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియాభట్, డైసీ ఆడ్గార్జియోన్స్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాల్ని చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో వెల్లడించింది.

ఇద్దరు వీరుల తెలియనికథ..

ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతంలో 1897లో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఆంగ్లంతో పాటు వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యోగా తెలుసు. యుక్తవయసులో వుండగానే ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మూడేళ్ల పాటు కనిపించకుండా పోయారు. ఆ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు? అన్నది ఎవరికీ తెలియదు. తిరిగొచ్చిన తరువాత స్వాతంత్య్ర ఉద్యమాన్ని మొదలుపెట్టారు. బ్రిటీష్ వారిపై ఆయన ఎలా పోరాడారు. గెరిల్లా యుద్ధాన్ని ఎలా చేశారు? ఎలా చనిపోయారు అన్నది మనకు తెలిసిందే. 1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమరం భీం పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో వుండగా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది ఎవరికీ తెలియదు. చదువుకున్న వారిలా తిరిగొచ్చారు. ఆయన కూడా నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేశారు. అల్లూరి సీతారామరాజు తరహాలోనే గెరిల్లా పోరాటం చేశారు. ప్రజల్ని ఉత్తేజపరుస్తూ అల్లూరి తరహాలోనే చనిపోయారు. వాళ్లిద్దరి చరిత్ర చదువుతున్నప్పుడు ఒకే సమయంలో పుట్టి ఒకే సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. తిరిగి వచ్చిన తరువాత ఇద్దరూ ఒకే విధానంలో అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం అనేది నాకు ఆసక్తికరంగా, ప్రత్యేకంగా అనిపించింది. దాన్నే మా సినిమాలో చూపించబోతున్నాం.

మనకు తెలియని కథని ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా ఓ ఫిక్షనల్ కథగా దీన్ని రూపొందిస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు రియల్ హీరోల కథని భారీ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో అజయ్ దేవగన్ కథకు చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. తమిళ నటుడు సముద్రఖని మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్‌ని ముందు వర్కింగ్ టైటిల్‌గా అనుకున్నాం. కానీ డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యాన్స్ వర్కింగ్ టైటిల్‌నే టైటిల్‌గా ఖరారు చేయండని అడుగుతున్నారు. అయితే దాన్ని అన్ని భాషల్లో కామన్ టైటిల్‌గా పెట్టి ప్రతి భాషకు ఓ టైటిల్‌ని పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాన్ని ఈ రోజే ప్రకటించాలని అనుకున్నాం. అయితే ప్రేక్షకుల్లో ఎక్కువ మంది టైటిల్‌ని సజెస్ట్ చేస్తున్నారు. వారందరు చెప్పే టైటిల్స్‌ని పరిశీలించిన తరువాత అందులో బెటర్ అనిపించినవి తీసుకుని ఖరారు చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాలో నాకు తెలిసిన యువ అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, మనకు తెలియని కొమరంభీంగా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఈ ఇద్దరిని ఈ పాత్రల్లో చూడటం ఆనందంగా వుంది అన్నారు.

ఇదొక ఫిక్షనల్ స్టోరీ..

రామ్‌చరణ్ మాట్లాడుతూ తారక్‌తో పనిచేయడం మరింత ఆనందాన్నిస్తోంది. ఇద్దరికి ఒకేసారి రాజమౌళి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. ఆయన చెప్పిన వెంటనే ఒక్కసారిగా ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకుని రాజమౌళిని ఆలింగనం చేసుకున్నాం. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ తరువాత మేము ముగ్గురం కలిసి సోఫాలో కూర్చున్న ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. రాజమౌళి చెప్పినట్లే ఇదొక ఫిక్షనల్ స్టోరీ. మా ఇద్దరి కాంబినేషన్‌పై ఎంత నమ్మకం వుందో అంతకు మించి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మేమేంటో నిరూపించే చిత్రమిది..

ఎన్టీఆర్ మాట్లాడుతూ జక్కన్నతో నేను చేస్తున్న నాలుగవ చిత్రమిది. అన్నిటికంటే నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ నటులుగా మేమేంటో నిరూపించే చిత్రమిది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు. వీరిద్దరు కలిసి పోరాటం చేస్తే ఏం జరిగివుండేది? అనే అంశాన్ని జక్కన్నఎప్పుడైతే పైకి తీసుకొచ్చాడో అప్పుడే నటులుగా మాకు పెద్ద ఛాలెంజ్‌గా అనిపించింది. ఇప్పటి వరకు చేసిన 28 చిత్రాలకంటే ఈ సినిమా విషయంలో ఎదురైన అనుభవం భవిష్యత్తులో మేము చేయబోయే సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాజమౌళి ఆలోచన నుంచి వచ్చిన ఈ కథ నూటికి నూరు శాతం గొప్ప సినిమాగా నిలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ చిత్రంలో అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా. ఎలాంటి భేషజాలకు పోకుండా నాతో కలిసి నటించడానికి ముందుకొచ్చిన చరణ్‌కు హ్యాట్సాఫ్. మా జనరేషన్‌లో ఇది సంభవించింది అంటే అది రాజమౌళి వల్లే. మాలో నమ్మకాన్ని కలిగించారాయన. ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని మనసారా నమ్ముతున్నాను అన్నారు.

2020 జూలై 30న విడుదల..

డీవీవీ దానయ్య మాట్లాడుతూ భారతదేశం గర్వించే దర్శకులు రాజమౌళితో ఈ సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతం. రెండు పెద్ద కుటుంబాలైన నందమూరి ఫ్యామిలీ, కొణిదెల ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు సమ ఉజ్జీలతో ఈ సినిమా నిర్మించే అవకాశంకల్పించిన రాజమౌళి గారికి జీవితాంతం రుణపడి వుంటాను. ఇప్పటికి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో అహ్మదాబాద్, పూణేలో 30 రోజుల పాటు షెడ్యూల్ జరుగుతుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీపడకుండా దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం. ఇతర భాషల్లోనూ విడుదల చేయమని కోరుతున్నారు. అందుకే మొత్తం పది భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

2320

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles