మాను అభివృద్ధి పథంలో నడిపిస్తా!


Fri,March 22, 2019 11:29 PM

Rajasekhar corrects MAA New President Actor Naresh

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేసింది. అధ్యక్షుడిగా నరేష్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌తో పాటు ఇతర సభ్యులు బాధ్యతల్ని చేపట్టారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సీనియర్ హీరో కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ఒకే తల్లి బిడ్డల్లా పనిచేస్తూ సభ్యులంతా మాకు మంచి పేరు తీసుకురాలి అని అన్నారు. నూతన అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ అసోసియేషన్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. మా ను అభివృద్ధిపథంలోని తీసుకెళ్లే బాధ్యత నాది. ఏ సహాయం కావాలన్నా స్పందించి మాకు అన్ని విధాలుగా సహకారం అందించిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అనూప్‌రూబెన్స్, జయసుధ, అలీ, శివబాలాజీ, హేమ, ఉత్తేజ్, సురేష్ కొండేటి, తనీష్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు నటుల్ని ప్రోత్సహించాలి


- కోటశ్రీనివాసరావు..
తెలుగు నటీనటులకు అర్హతకు తగినట్లుగా పనికల్పించాలని అన్నారు కోట శ్రీనివాసరావు. ఆయన మాట్లాడుతూ నేను ఐదు భాషల్లో సినిమాలు చేశాను. ఇతర భాషల వారు తెలుగు నటుల్ని ఎలా చూస్తారో నాకు తెలుసు. స్వయంగా అనుభవించాను. మనం మాత్రం ఇతర భాషల వాళ్లకు లక్షల పారితోషికాలు ఇచ్చి తీసుకొస్తున్నాం. వాళ్లు ఇక్కడే ఇళ్లు కట్టుకుంటే మన నటీనటులు మాత్రం తినడానికి తిండిలేక పెన్షన్ తీసుకుంటున్నారు. పరభాష నటులు నాకు ఇష్టంలేదని ప్రచారం చేశారు. అందులో నిజం లేదు. అమితాబ్‌బచ్చన్, నసీరుద్దిన్‌షా, నానాపటేకర్ లాంటి గొప్ప నటుల పక్కన నౌకరు వేషం వేయడానికైనా సిద్ధమే. అందుకు సిగ్గు పడను. షాయాజీషిండే నటుడేనా? అలాంటి నటులు తెలుగులో లేరా? తెలుగు రాకపోయినా అతడితోనే సొంతంగా సంభాషణలు చెప్పిస్తున్నారు.

బాలసుబ్రహ్మణ్యంలా తెలుగు స్పష్టంగా మాట్లాడేవారిని పక్కన పెడుతున్నారు. తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలి అని అన్నారు. ఇదిలావుండగా మా కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, అలకలతో రసాబాసగా మారింది. హేమ మాట్లాడుతున్న తరుణంలో అధ్యక్షుడు నరేష్ మధ్యలోనే మైక్ లాక్కోవడంతో.. మైక్ బలవంతగా లాక్కోవడం మంచిది కాదంటూ హేమా అతడిపై అగ్రహాన్ని వ్యక్తంచేసింది. ప్రమాణస్వీకారం చేస్తూ నరేష్ నేను అనే పదాన్ని ఎక్కువగా వాడటంపై రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. నేను అన్న మాట ఎక్కువగా వాడొద్దు. భవిష్యత్తులోనైనా మేము అని ఆయన సంభోదిస్తే బాగుంటుంది అని సూచించారు.

1196

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles