లక్ష్మీస్ ఎన్టీఆర్‌విడుదల బాధ్యత చంద్రబాబుదే!


Fri,March 22, 2019 11:44 PM

Ram Gopal Varma Lakshmi NTR tells a story that I believe is the truth

నిజం మనదగ్గరుంటే దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. మరి మనం చెప్పేదే నిజమనే నిర్ణయానికి రావడానికి ఖచ్చితమైన ప్రమాణం ఏమిటి? నీ వివేచనకు అందుతూ నీ నమ్మకానికి దగ్గరైనదే అసలు నిజం. ఆ నిజాన్నే లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూపించాను అంటున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ఆనాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి వైస్రాయ్ హోటల్‌లో ఏం జరిగిందో అందరికి తెలుసు. అయితే వైస్రాయ్ ఉదంతానికి దారితీసిన పరిస్థితుల్ని ఈ సినిమాలో ఆవిష్కరించాను. నేను నమ్మిన నిజాన్ని నిర్భయంగా చూపించాను అని అన్నారు వర్మ. విమర్శకుల దృష్టిలో ఆయన వివాదాల సహవాసి, నిత్యకలహప్రియుడు. అభిమానులకు ఓ ఇంటెలెక్చువల్. తన గురించి ఎవరేమనుకున్నా నచ్చింది చేయడమే తన నైజమని చెబుతుంటారు వర్మ. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకున్నారు.

-25 సంవత్సరాల క్రితం జరిగిన కథను సినిమాటిక్‌గా తెరపై ఆవిష్కరించాను. నేను తెలుసుకున్న నిజాల్ని చూపించాను. ఈ సినిమా ఒకరికి అనుకూలమో, మరొకరికి ప్రతికూలమో కాదు. అయితే ఎలాంటి కథ చెప్పినా దానిని కొందరు తమకు అనుకూలంగా తీసుకుంటారు. మరికొందరు ప్రతికూలంగా తీసుకుంటారు. అది ఏ కథాంశం విషయంలోనైనా సహజంగా ఉంటుంది.

-ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిలది ప్లెటానిక్ లవ్(అమలిన ప్రేమ) అని నా అభిప్రాయం. అందుకే ఈ సినిమాలోని పాటలకు ఓ క్లాసిక్ టచ్‌ను అందించే ప్రయత్నం చేశాను. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఇద్దరూ కూడా సాహిత్యంలో గొప్ప ప్రవేశం ఉన్నవారు. కాబట్టి చక్కటి సాహిత్య విలువలతో పాటలు ఉండేలా చూసుకున్నాను.

-ఎన్టీఆర్ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు చేసిందే అతిపెద్ద కుట్ర. నాదెండ్ల భాస్కర్‌రావు చేసింది రాజకీయపరమైనది. రక్తసంబంధీకులు దగ్గరుండి చేసిందే ఎప్పుడైనా పెద్ద కుట్ర అవుతుంది.

-వైస్రాయ్‌లో ఏం జరింగిందన్నది అందరికి తెలుసు. కానీ వైస్రాయ్‌కు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది చాలా మందికి తెలియదు. అవేంటో ఈ సినిమాలో చూపించాను. నేను నమ్మిన నిజాల్ని ఆవిష్కరించాను.
Ram-Gopal-Varma1

ఈ సినిమా విషయంలో మీకు, సెన్సార్‌బోర్డ్‌కు మధ్య సమాచారలోపం వల్ల మనస్పర్థలు వచ్చాయని తెలిసింది?

-మొదటిదశ పోలింగ్ అయ్యేంతవరకు సెన్సార్‌బోర్డ్ ఈ సినిమాను చూసేందుకు సుముఖంగా లేదని నాకు సమాచారం వచ్చింది. సాక్షాత్తూ ఎన్నికల సంఘం సినిమా విడుదలలో జోక్యం చేసుకోమని చెప్పిన తర్వాత కూడా సెన్సార్ వారి నుంచి అలాంటి నిర్ణయం రావడం నన్ను నివ్వెరపరచింది. దాంతో ప్రెస్‌మీట్ ద్వారా నిజలేమిటో బహిర్గతం చేయాలనుకున్నాను. ఈలోపు సెన్సార్‌వారు సినిమా చూసే అంశంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సమాచారం అందించడంతో వెంటనే ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకున్నాను.

ఇంతకి లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ క్రతువు ఎందాక వచ్చింది?

-కోర్టు, ఎలక్షన్ కమీషన్ నుంచి సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఒక్క సెన్సార్ పరిశీలన మాత్రమే మిగిలిపోయింది. చట్టప్రకారం సెన్సార్‌కు సంబంధించిన నియమనిబంధనలకు లోబడే ఈ సినిమాను తీశాను. కాబట్టి సెన్సార్‌బోర్డ్ నుంచి ఎలాంటి అభ్యంతరంరాదనే అనుకుంటున్నాను.

ఈ సినిమా గురించి పరిశోధిస్తున్న సమయంలో కుట్ర ఉదంతం మిమ్మల్ని బాగా కదిలించిందా? లేక ఎన్టీఆర్ ఎదుర్కొన్న సంఘర్షణ సినిమా తీయడానికి ప్రేరణ నిచ్చిందా?

-ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల పవిత్ర ప్రేమసంబంధం, లక్ష్మీపార్వతి ఆగమనం తర్వాత ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకన్న సంఘటనలు, చివరగా ఎన్టీఆర్ వంటి మహావ్యక్తి విషాదాంతం...ఈ మూడు అంశాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.

ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. వాటన్నంటిని వదిలేసి లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌నే ఇతివృత్తంగా ఎంచుకోవడానికి కారణమేమిటి?

-ఒక్క చరమాంకం తప్ప ఎన్టీఆర్ జీవితమంతా ఆయన అనుకున్న విధంగా అద్భుతంగా సాగింది. పార్టీ స్థాపించిన తొమ్మిదినెలల్లో అధికారంలోకి వచ్చారాయన. ఇక నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటును కూడా ఎన్టీఆర్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే లక్ష్మీపార్వతి ఎంట్రీ తర్వాత ఆయన జీవితం ఒడిదుడుకులకు లోనయింది. అనేక రాజకీయ మలుపుల నడుమ చివరకు ఆయన నైరాశ్యానికిలోనై తనువు చాలించారు. జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకున్న ఎన్టీఆర్ వంటి లెజెండ్ చరమాంకంలో తీవ్ర మనోవేదన చెందారు. ఈ అంశమే నన్ను బాగా కదిలించింది.

ఈ సినిమా విషయ సంగ్రహణ కోసం మీరు ఎలాంటి రిఫరెన్స్‌లు తీసుకున్నారు?

-ఈ సినిమా పరిశోధన కోసం నేను చాలా పుస్తకాల్ని చదివాను. అప్పుడు ఎన్టీఆర్‌తో సన్నిహితులుగా ఉండి ప్రస్తుతం అంతగా వెలుగులో లేని వారి నుంచి ఎక్కువ విషయ సేకరణ చేశాను. తటస్థమైన వ్యక్తులు చెప్పిన అంశాల్నే ఎక్కువ ప్రామాణికంగా తీసుకున్నాను. ఎందుకంటే అలాంటివారికి ఎటువంటి రహస్య ఎజెండాలు ఉండవని నా అభిప్రాయం.

ఓ సినీ దర్శకుడిగా కాకుండా అవుట్‌సైడర్‌గా నాటి వైస్రాయ్ ఎపిసోడ్‌లో కుట్ర ఉందని మీరు నమ్ముతున్నారా?

-ఖచ్చితంగా కుట్ర ఉందనే నమ్ముతున్నాను. ఒక వ్యక్తికి తెలియకుండా అతనికి హాని చేసే ఏ పని అయినా కుట్రగానే పరిగణించాలి. వైస్రాయ్ ఘటనలో వందశాతం కుట్ర జరిగింది. ఎన్టీఆర్‌గారే స్వయంగా కుట్ర అని ప్రకటించినప్పుడు అది కాదని చెప్పడానికి నేనెవర్ని?.

రాజకీయపరంగా సున్నితమైన అంశాన్ని కథావస్తువుగా ఎంచుకున్నారు కాబట్టి నిర్మాణక్రమంలో ఏమైనా ఒత్తిళ్లు ఎదుర్కొన్నారా?

-నరికేస్తా, చంపేస్తా...అంటూ కొందరు టీవీ చర్చల్లో వార్నింగ్‌లు ఇచ్చారు. వారిని నేను టీవీరౌడీలంటాను (నవ్వుతూ). కెమెరా తీయగానే అన్నీ మర్చిపోయే బాపతు వాళ్లు. ప్రజాస్వామ్యబద్దంగా నాకున్న స్వేచ్ఛని, రాజ్యాంగపరంగా భావ ప్రకటన విషయంలో నాకున్న హక్కుల్ని కూలంకషంగా తెలుసుకునే చిత్ర నిర్మాణానికి పూనుకున్నాను. ఎలాంటి సమస్యలు వస్తాయో ముందే అంచనా వేసుకున్నాను. చాలా మంది కోర్టులకు వెళ్లి సినిమాను ఆపాలని, పాటల్ని తీసేయాలని కేసులు వేశారు. నా దృష్టిలో అవన్నీ అపరిపక్వమైన పనులు. చిన్న చిన్న అవరోధాలు తప్ప ఇప్పటివరకు నేను అనుకున్న విధంగానే అంతా జరుగుతున్నది.

చంద్రబాబుది వెన్నుపోటని మీరంటున్నారు. మరి ఎక్కువ మంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు పక్షానే ఉన్నారు కదా?

- ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసే చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచారు. అప్పటి కుట్రలో అందరూ భాగస్వాములే.

ఈ సినిమాకు థియేటర్స్ లభించే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయని అనుకుంటున్నారా?

-విడుదలను ఆపడం ఎవరి వల్లా కాదని నేను వందశాతం నమ్ముతున్నాను. నా నమ్మకానికి కారణం చంద్రబాబునాయుడుగారే. ముఖ్యమంత్రి హోదాలో శాంతిభద్రతలను కాపాడుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. కాబట్టి ఆయనే దగ్గరుండి సినిమాను విడుదల చేయిస్తారని అనుకుంటున్నాను.

ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించే సన్నివేశాలు ఉండొచ్చని కొందరు ఆరోపణలు చేస్తున్నారు? దీనిపై మీరేమంటారు?

-ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించే విషయాలేవి ఈ సినిమాలో వుండవు. ఎందుకంటే కుట్ర ఉదంతంలో బాధితుడు ఎన్టీఆరే. కాబట్టి బాధితుని గౌరవానికి భంగం కలిగించడమనేది అర్థంలేని విషయం.

ఈ సినిమాలో అందరూ కొత్తనటీనటులనే తీసుకోవడానికి కారణమేమిటి?

-యథార్థ పాత్రల్ని తెరకెక్కిస్తున్నప్పుడు కొత్తవారైతేనే ఆ పాత్రలకు న్యాయం చేయగలరని నా విశ్వాసం. కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి చిత్రాల్లో నేను కొత్తవారిని తీసుకోవడానికి కారణం అదే. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ పాత్ర కోసం భీమవరానికి చెందిన థియేటర్ ఆర్టిస్టు విజయ్‌కుమార్‌ను తీసుకున్నాను. ఎన్టీఆర్ పాత్ర గురించి ఆయన చాలా హోమ్‌వర్క్ చేశారు.

ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రను పాజిటివ్‌గానే చూపించబోతున్నారా?

-సానుకూల, ప్రతికూల అంశాలు ఒక్కొక్కరి దృష్టికోణంలో ఒక్కోవిధంగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి చర్చ అనవసరం. అసలు లక్ష్మీపార్వతి వైపు ఎన్టీఆర్ ఎందుకు ఆకర్షితుడయ్యారు? ఎన్టీఆర్ వంటి సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తికి సన్నిహితురాలు కావడం మామూలు విషయం కాదు. అందుకు బలమైన కారణాలు ఉండి తీరాలి. ఆ కోణంలోనే లక్ష్మీపార్వతి పాత్రను ఆవిష్కరించాను.

ఈ సినిమా పరిశోధనా క్రమంలో ఎన్టీఆర్ గురించిన మీ అభిప్రాయాలు ఏమైనా మారాయా?

-ఎవరి గురించి అయినా విస్త్రతంగా పరిశోధిస్తున్నప్పుడు మనం తెలుసుకున్న అంశాల్ని బట్టి ఆ వ్యక్తిపై అంతకు ముందున్న మన అభిప్రాయాలు మారుతూఉంటాయి. నా దృష్టిలో నిజానికి ఖచ్చితమైన నిర్వచనం లేదు. నమ్మే విధంగా ఉన్నట్లు అనిపించేదే నిజమని నా అభిప్రాయం. అప్పటి సంఘటనలకు వీడియో సాక్ష్యాలు లేవు. కాబట్టి వివిధ మార్గాల ద్వారా సేకరించిన విషయాల్లో నాకు నమ్మబుద్ధిగా అనిపించిన అంశాల్నే నిజంగా భావించాను. దానినే సినిమాలో చూపించాను.

గతంలో మీరు ఎన్నో వివాదాస్పద అంశాల్ని ఎంచుకొని సినిమాలు తీశారు. ఎన్నడూ రాని వివాదాలు ఈ సినిమా విషయంలోనే ఎందుకొస్తున్నాయనుకుంటున్నారు?

-ఎందుకంటే నిజం బయటకు వస్తుందని అందరికి భయం. నిజం బయటికొస్తుందనే భయం ఉన్నప్పుడే వివాదాలు వస్తాయి. ఆ పనిని ఆపడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. మీ వద్దే నిజం ఉంటే ఎందుకు ఆపడానికి ప్రయత్నిస్తారు?

ఈ సినిమాను విడుదల చేయకుంటే 50కోట్లు ఇస్తామని మీకు ఆఫర్ వచ్చిందట కదా?

-అలాంటిదేమి లేదు. అవన్నీ కేవలం పుకార్లే.

ఒకవేళ సినిమా ఆర్జించే లాభాలుగా ఓ వందకోట్లను మీకు ఇస్తే సినిమాను రద్దు చేసుకుంటారా?

-ఎన్నివందల కోట్లు ఇచ్చినా సినిమాను ఆపను. నేను ఫిల్మ్‌మేకర్‌ను. బిజినెస్‌మెన్‌ను కాదు. ఎంతో కష్టపడి సినిమా తీశాను కాబట్టి తప్పకుండా రిలీజ్ చేసి తీరాల్సిందే.

ఒక ప్రభుత్వం మీద మీరు కసితో సినిమా తీశారనే వ్యాఖ్యలపై ఏమంటారు?

-నేను రాజకీయాల్ని ఏమాత్రం పట్టించుకోను. నా జీవితంలో ఎప్పుడూ ఓటు కూడా వేయలేదు. ఓ వ్యక్తి మీద ద్వేషం పెంచుకోవడానికి ఇద్దరి మధ్య ఏదైనా జరిగి వుండాలి. నాకు చంద్రబాబు వల్ల నష్టం జరగలేదు. జగన్ వల్ల లాభం జరగలేదు. కాబట్టి ఎవరిమీదో కసితో సినిమా తీశాననేది అబద్ధం.

వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ వర్మకు వ్యసనంగా మారిందనే ఓ అపవాదు ఉంది. దీనిపై మీరేమంటారు?

-నాకు చాలా వ్యసనాలు ఉన్నాయి. పబ్లిసిటీ వ్యసనం ఉన్నా ఓకే (నవ్వుతూ). నా కెరీర్‌లో తొంభైశాతం సినిమాల్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్‌లతోనే చేశాను. సర్కార్, వంగవీటి, రక్తచరిత్ర...ఇవన్నీ అవే కోవలోకి వస్తాయి. అలాంటి కథల్ని ఎంచుకోవడం దర్శకుడిగా నా శైలి అనుకుంటాను.

ఈ సినిమా సక్సెస్‌కు కొలమానంగా మీరు దేనిని భావిస్తారు? ఎలక్షన్లపై సినిమా ప్రభావం ఏమైనా ఉంటుందా?

-సినిమాలో చూపించిన సంఘటనలు నిజంగా జరిగాయని ప్రజలు నమ్మితే అదే పెద్ద విజయం అనుకుంటాను. ప్రజలు ఓటు వేసే ముందు సంక్షేమ పథకాలతో పాటు అన్నింటికంటే ముఖ్యంగా నమ్మకంను పరిగణనలోకి తీసుకుంటారు. మనిషి మీద నమ్మకంతోనే ఓట్లు వేస్తారు. అయితే ఏదో కారణంతో ఒక్కసారిగా మనిషిమీద నమ్మకం పోతే అది ఎలక్షన్లలో ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందన్నది నేను చెప్పలేను. అయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్రభావం మాత్రం ఉంటుందనేది నా నమ్మకం.

మీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచారా?

-అసలు వెన్నుపోట్లు లేకుండా మనిషి జీవించలేడు (నవ్వుతూ). నా వీపు చాలా గట్టిది..కాబట్టి నన్ను ఎవరూ వెన్నుపోటు పొడవలేదు. ఒకవేళ నేను ఎవరినైనా పొడిస్తే ముందుపోటే పొడుస్తా. వెన్నుపోటు కాదు (నవ్వుతూ).

3555

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles