అంతిమ ఫలితాన్ని నిర్ణయించేది వసూళ్లే!


Sun,August 18, 2019 12:04 AM

Ranarangam Movie Hero Sharwanand Interview

వాణిజ్య సమీకరణాలు శర్వానంద్‌కు అస్సలు పట్టవు. నిరంతరం నవ్యమైన కథాంశాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ తనని తాను కొత్తపంథాలో ఆవిష్కరించుకోవాలని తపిస్తారు. ఓ సినిమా వందకోట్ల వసూళ్లు సాధిస్తే తిరిగి అదే దారిలో ప్రయాణించాలా? నటుడిగా వైవిధ్యత కోసం మరో మార్గాన్ని ఎంచుకోవాలా? అనే సందిగ్ధం ప్రతి నటుడికి ఉంటుంది. అంతిమంగా మన అంతరాత్మ ప్రబోధం మేరకు సినిమాలు చేయాలి అంటున్నారు శర్వానంద్. దాదాపు పదిహేనేళ్లుగా సాగుతున్నసుదీర్ఘ కెరీర్‌లో విభిన్న పాత్రల్లో రాణిస్తూ విలక్షణతకు చిరునామాగా నిలుస్తున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన రణరంగం చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి..

స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఓ ైస్టెలిష్ ఫిల్మ్ తీస్తున్నామని మొదటి నుంచి చెప్పాం. కథగా కొత్తగా ఉంటుందని ఎప్పుడూ అనలేదు. అయితే సినిమాల విషయంలో మన అంచనాలన్నీ నిజమవుతాయని ఎవరూ ఊహించలేరు. అలా అయితే ప్రతి సినిమా హిట్టే. సినిమా విషయంలో నిజానిజాలేమిటో అంతిమంగా కలెక్షన్సే నిర్ణయిస్తాయి.


రణరంగం చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తున్నది?

-విడుదలైన తొలిరోజు మార్నింగ్ షోకు మిశ్రమ స్పందన వచ్చింది. మ్యాట్నీకొచ్చేసరికి ఫర్వాలేదన్నారు. ఫస్ట్‌షో యావరేజ్ అన్నారు. ప్రస్తుతానికైతే ఎబౌ యావరేజ్ దగ్గర ఆగింది (నవ్వుతూ). అయితే సినిమా చూసినవారెవరూ బాగాలేదని చెప్పలేదు. ఓ విభిన్నమైన మేకింగ్‌తో కూడిన సినిమా చూశామనే అనుభూతి మిగిల్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

విడుదలకు ముందు సినిమాపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి. ఆశించిన ఫలితానికి చేరువయ్యారని భావిస్తున్నారా?

-వాస్తవం చెప్పాలంటే మేము అనుకున్న ఫలితం రాలేదు. భారీ ఓపెనింగ్స్ వస్తాయనుకున్నాం. ఈ సినిమా సమీక్షలకు, రాబడుతున్న వసూళ్లకు ఏమాత్రం సంబంధం కనిపించడం లేదు. సమీక్షకులు కొంచెం కనికరించి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవి కావొచ్చు (నవ్వుతూ). ఏది ఏమైనా అంతిమంగా సినిమా ఫలితాల్ని నిర్ణయించేది వసూళ్లే కాబట్టి రానున్న రోజులు పాజిటివ్‌గా ఉంటాయని ఆశిస్తున్నాం.

సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. ఓ నటుడిగా ఆ పాత్ర మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది?

-గతకొంతకాలంగా నేను ఎక్కువగా ఫ్యామిలీ, కామెడీ జోనర్ సినిమాల్నే చేస్తున్నాను. ఒకే మూసలో సాగుతున్న ప్రయాణంలో కొత్త మలుపు తీసుకుంటే బాగుంటుందనిపించింది. గ్యాంగ్‌స్టర్‌గా నా పాత్రలో రెండు భిన్న పార్శాలు కనిపిస్తాయి. కథాపరంగా కూడా నేను ఇప్పటివరకు టచ్ చేయని కోణమిది. అందుకే ప్రేక్షకులందరూ గ్యాంగ్‌స్టర్ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశానని ప్రశంసిస్తున్నారు. ఓ నటుడిగా ఇంతకంటే మంచి పాత్రను నేను ఎప్పుడూ ఆశించలేదు.

ఈ సినిమా విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. మీరు పోషించిన పాత్ర బాగుందని అందరూ ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. కథను ఆవిష్కరించిన విధానం మాత్రం విమర్శల్ని ఎదుర్కొంటున్నది?

-ఓ నటుడిగా నేనేమిటో మీ అందరికి తెలుసు. శర్వానంద్ మంచి కథల్ని ఎంచుకుంటాడు అని ప్రతిసారి మీరు నన్ను మెచ్చుకునేవారు. నా కెరీర్ ఆరంభం నుంచి అదే పంథాను నమ్మాను. అయితే రణరంగం విషయంలో ఓ కొత్త ప్రయత్నం చేద్దామనుకున్నా. నేను మొదటి నుంచి చెబుతున్నట్లు కథను దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా కాదిది. ప్రేక్షకులు ఆదరణ, సమీక్షకుల అభిప్రాయాల మధ్య అంతరం కనిపిస్తున్నది. కలెక్షన్స్ బాగున్నాయి. ఎక్కడ తప్పు జరిగిందనే విషయం మాత్రం అర్థంకావడం లేదు. అంతిమ ఫలితం ఏమిటో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు నిరీక్షించాల్సిందే (నవ్వుతూ).

ఈ సినిమాలో మీరు బ్లాక్‌టిక్కెట్స్ అమ్మేవాడిగా, అక్రమ వ్యాపారం చేసేవాడిగా కనిపించారు. గతంలో మీకున్న ఇమేజ్‌కు ఇలాంటి పాత్ర చిత్రణ ప్రతికూలంగా మారుతుందని అనుకోలేదా?

-అలాంటిదేమి లేదు. ప్రేక్షకులు ఎప్పుడూ కథేమిటో చూస్తారు. అది తెరపై ఎంత అర్థవంతంగా ఆవిష్కృతమైందో అని ఆలోచిస్తారు. గతంలో నేను శతమానం భవతి సినిమా చేశానని..అదే దృష్టిలోంచి చూస్తే అసలు ఈ సినిమాకు ఎవరూ రారు (నవ్వుతూ). ఓ నటుడిని వైవిధ్యమైన పాత్రల్లో చూడాలనే ప్రేక్షకులు కోరుకుంటారు.

తెరపై మీ పాత్రని చూసుకున్నప్పుడు ఎలాంటి భావోద్వేగాలు కలిగాయి?

-రణరంగం సినిమాలో నా పాత్రను పరిపూర్ణంగా ఆస్వాదించాను. ప్రస్థానం రన్ రాజా రన్ తర్వాత ఓ విభిన్నమైన ప్రయత్నంలా భావించా. ప్రతి ఫ్రేమ్‌లో బాగున్నాననిపించింది.

రొటీన్ పంథాను బ్రేక్ చేయడానికి ైస్టెలిష్ యాక్షన్ ఫిల్మ్ రణరంగం చేశానని చెప్పారు. భవిష్యత్తులో ఇదే దారిలో ప్రయాణిస్తారా?

-ప్రస్థానం తర్వాత నేను కొత్త జోనర్ సినిమాలు చేశాను. శతమానం భవతి అనంతరం మరో కొత్తదారిని ఎంచుకున్నా. ఏదో ఒక ఇమేజ్‌కు బందీ కావడం నాకు ఇష్టం ఉండదు. శర్వా సినిమా అంటే కొత్త కథ ఉంటుందని ప్రేక్షకులు భావించాలి. భవిష్యత్తులో కూడా వినూత్నమైన ఇతివృత్తాల్ని ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తాను.

ఈ సినిమా ద్వారా బీ, సీ క్లాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యానని చెబుతున్నారు?

-అవును. బీ, సీ కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. థియేటర్లలో ఆక్యుపెన్సీ చూస్తే పై తరగతి టికెట్ల కంటే ముందే క్రింది తరగతి టిక్కెట్లు ఫుల్ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌ను ఏరకంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు.

మంచి కథను ఎంచుకోవడం, వాణిజ్యపరంగా దాని ఫలితాన్ని బేరీజు వేసుకోవడం కత్తిమీదసాములాంటిది. ఈ విషయంలో మీ దృష్టికోణం ఎలా ఉంటుంది?

-అది చెప్పడం చాలా కష్టమైన విషయం. రణరంగం చిత్రానికి వందకోట్లు వచ్చాయనుకో...ఇకముందు నేను అలాంటి సినిమాలే చేయాలా? గతంలో ఒప్పుకున్న మూడు సినిమా చేయాలా? లేదా?..ఇలాంటి సమీకరణాలు అయోమయంగా అనిపిస్తాయి. ఇక్కడ ప్రతి శుక్రవారం పరిస్థితులు మారుతుంటాయి. నావరకైతే ప్రతి సినిమాలో కథ కొత్తగా ఉండాలి. జోనర్ కూడా గతంలో టచ్ చేయనిదై ఉండాలి. ఒకే మూసలో సినిమాలు చేస్తే కొన్నాళ్ల తర్వాత ప్రేక్షకులకే బోర్ కొడుతుంది. కథాంశాల ఎంపికలో ఎలాంటి ప్రమాణాల్ని పెట్టుకోను. నా అంతరాత్మనే అనుసరిస్తాను.

తదుపరి చిత్రాల గురించి...?

-ప్రస్తుతం 96 రీమేక్‌లో నటిస్తున్నాను. యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది. శ్రీకారం అనే ఓ చిత్రాన్ని చేస్తున్నాను. అదొక అద్భుతమైన కథ. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అయితే కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో నాకు తెలియదు. శతమానం భవతి సినిమా చేసినప్పుడు కూడా వాణిజ్యపరంగా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. కథపై నమ్మకంతో సినిమా చేశాను. ఈ రెండు సినిమాలే కాక తమిళ, తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను.

698

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles