అవకాశాల కోసం ఎవరినీ బ్రతిమాలను!

Sun,October 6, 2019 12:08 AM

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం ద్వారా యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది పంజాబీ సోయగం పాయల్‌రాజ్‌పుత్‌. తన అందచందాలతో కుర్రకారు హృదయాల్ని కలవరపెట్టింది. ప్రస్తుతం ఈ సుందరికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కథనాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌' ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా పాయల్‌రాజ్‌పుత్‌ పాత్రికేయులతో సంభాషించింది. ఈ సుందరి చెప్పిన ముచ్చట్లివి..


‘ఆర్‌డీఎక్స్‌' లవ్‌ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది?

-ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత తెలుగులో నేను నటించిన సినిమా ఇది. సంవత్సరం విరామం తర్వాత తిరిగి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాను. నా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ద్వారా వచ్చిన గుర్తింపుతో నన్నందరూ ఓ మహారాణిలా చూస్తున్నారు. దాంతో బలమైన సామాజిక అంశాలున్న కథాంశాన్ని ఎంచుకొని ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌' సినిమా చేశాను.

ట్రైలర్‌లో బోల్డ్‌ కంటెంట్‌ ఎక్కువైందని అంటున్నారు?

-ట్రైలర్‌లో చూపించిన దానికంటే మించి సినిమాలో అందాలఆరబోత ఏమీ ఉండదు. బోల్డ్‌ కంటెంట్‌ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. టీజర్‌ను చూసి సినిమా మొత్తం అదే విధంగా ఉంటుందనే భావన కలుగుతున్నది.

ఇంతకి సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు?

-ఈ సినిమాలో రొమాన్స్‌, యాక్షన్‌, ఎమోషన్‌..అన్ని అంశాలుంటాయి. తొలిసారి నేను పోరాటఘట్టాల్లో నటించాను. ఈ సినిమా కోసం నాకున్న పరిమితులన్నింటికి ఛేదించాను. అభినయపరంగా వైవిధ్యతను ప్రదర్శించే ప్రయత్నం చేశాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు అలివేలు. సోషల్‌వర్కర్‌గా కనిపిస్తాను. పాపికొండలు దగ్గరలోని ఓ గ్రామ సంక్షేమం కోసం అలివేలు పనిచేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొంది? చివరకు తన లక్ష్యాన్ని ఎలా సాధించిందన్నదే చిత్ర ఇతివృత్తం. సమాజంలో చర్చించడానికి భయపడే ఎన్నో అంశాల్ని ఈ సినిమాలో టచ్‌ చేశాం.

ఈ చిత్రంలో యాక్షన్‌ ఘట్టాల్లో నటించారని తెలిసింది?

-నేను సొంతంగా స్టంట్స్‌ పర్‌ఫార్మ్‌ చేశాను. స్వతహాగా నేను ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తాను. కాబట్టి పోరాట ఘట్టా నటించడం కష్టమనిపించలేదు. అయితే ఓ సీన్‌ చిత్రీకరణ సందర్భంగా చిన్న గాయమైంది.

హిందీ ‘ఆర్‌ఎక్స్‌ 100’ రీమేక్‌లో కథానాయికగా ఛాన్స్‌ ఎలా మిస్సయింది?

-హిందీ రీమేక్‌లో తారా సుతారియా కథానాయికగా నటిస్తున్నది. నిర్మాత సాజిద్‌నడియావాలాను ఓ సందర్భంగా కలిసినప్పుడు ‘ఆర్‌ఎక్స్‌ 100’లో నా నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. అయినా ఎందుకనో రీమేక్‌లో అవకాశం ఇవ్వలేదు. ఆ విషయంలో ఎటువంటి బాధ లేదు. అవకాశాల కోసం నేను ఎవరినీ బ్రతిమాలను. మనకు రాసిపెట్టున్న పాత్రలు వెతుక్కుంటూ వస్తాయనే ఫిలాసఫీని నమ్ముతాను.

యువతరంలో మీరు మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. తెలుగులో భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి?

-అతి తక్కువ సమయంలో తెలుగుచిత్రసీమలో ఇంతటి స్టార్‌డమ్‌ సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క అవకాశం కోసం సంవత్సరాలు నిరీక్షించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమను నిలుపుకుంటూ మరింత వారి అభిమానాన్ని పొందేలా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటాను. ప్రస్తుతం తెలుగులో ‘వెంకీమామ’ ‘డిస్కోరాజా’ చిత్రాల్లో నటిస్తున్నాను.

కెరీర్‌ తొలినాళ్లలో ఎలాంటి ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నారు?

- తొలినాళ్లలో అవకాశాల విషయంలో ఎన్నో తిరస్కారాలకు గురయ్యాను. దక్షిణాది సినిమాల కోసం ఆడిషన్స్‌కు వెళితే ప్రతీసారి రిజెక్ట్‌ చేసేవారు. వాళ్ల కథలకు నేను నాయికగా సరిపోనని అనేవారు. తొలుత హిందీ ధారావాహికల్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘సైరత్‌' పంజాబీ రీమేక్‌ ద్వారా నాయికగా చిత్రసీమలోకి ఎంటరయ్యాను. ఆరేళ్లపాటు ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కొన్నాను. నాకు ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ రాలేదు.

1294

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles