ఊరికోసం పోరాటం..


Wed,September 11, 2019 12:39 AM

RDX Love Movie Trailer Launch

‘ట్రైలర్‌లో పాయల్‌, తేజస్‌ కెమిస్ట్రీ బాగుంది. నటులుగా వారిద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమిది. నిర్మాత కల్యాణ్‌ డబ్బుకోసం ఆలోచించకుండా తపనతో సినిమాలు తీస్తున్నారు. ఆయన వంద సినిమాల మైలురాయిని పూర్తిచేయాలి’ అని అన్నారు దర్శకుడు వి.వి.వినాయక్‌. పాయల్‌రాజ్‌పుత్‌, తేజస్‌ కంచర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌'. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. శంకర్‌భాను దర్శకుడు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వినాయక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత కల్యాణ్‌ మాట్లాడుతూ ‘గ్రామ ఆశయం కోసం తన స్నేహితులతో కలిసి పోరాడే ఓ యువతి కథ ఇది. పాయల్‌రాజ్‌పుత్‌ పాత్ర భిన్న పార్శాలతో సాగుతుంది. 45 డిగ్రీల ఎండలో కష్టపడి నటించింది.

ఈ సినిమాతో ఆమె మరో విజయశాంతిలా పేరుతెచ్చుకుంటుంది. కథను నమ్మి ఈ సినిమా చేశాం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం. టీజర్‌కు మంచి స్పందన లభించింది’ అని తెలిపారు. పాయల్‌ను గొప్ప నటిగా నిలబెట్టే చిత్రమిదని, రంపచోడవరం, పోలవరం పరిసరాల్లో చిత్రీకరణ జరిపామని దర్శకుడు పేర్కొన్నారు. “ఆర్‌ఎక్స్‌100’తో నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాకు పూర్తి భిన్నమైన ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిది. సామాజికాంశాలు, వినోదం కలబోతగా ఉంటుంది’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ చెప్పింది. తన అభిమాన దర్శకుడు వినాయక్‌ ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తేజస్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

322

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles