చిత్రసీమలోని రూల్స్, ప్రొటోకాల్స్ నేను ఫాలో కాలేదు!

Mon,August 12, 2019 11:26 PM

బోల్డ్, క్లీన్, వల్గారిటీ మధ్య హద్దులు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ హద్దులు దాటినప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతాయి అని చెప్పింది రెజీనా. జయాపజయాలకు అతీతంగా విలక్షణ పాత్రల్ని ఎంచుకుంటూ సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నదామె. రెజీనా కథానాయికగా నటించిన తాజా చిత్రం ఎవరు. వెంకట్ రామ్‌జీ దర్శకుడు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో రెజీనా పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..


ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఏమిటి?

-ఈ కథ విన్న వెంటనే ఎలాంటి ప్రశ్నలు, సంశయాలు లేకుండా వెంటనే సినిమా చేస్తానని చెప్పాను. తొలిరోజు షూటింగ్‌లో నన్ను దృష్టిలో పెట్టుకొనే ఈ కథను సిద్ధం చేసుకున్నానని దర్శకుడు చెప్పింది వినగానే సంతోషం కలిగింది.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

-సమీర అనే యువతిగా నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ముఖంలో ఎక్కువ హావభావాలు కనిపించవు. తక్కువగా మాట్లాడుతూ షార్ట్ హెయిర్‌తో వినూత్నంగా ఉంటుంది. కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్న సమీర జీవితాన్ని ఓ అనూహ్య సంఘటన మలుపుతిప్పుతుంది? అదేమిటి? ఆమె జీవితంలోని శేషప్రశ్నలకు విక్రమ్ వాసుదేవ్ అనే పరిశోధన అధికారి ఎలా సమాధానం చెప్పాడన్నది ఆకట్టుకుంటుంది. నా కెరీర్‌లో తీవ్రమైన ఉద్వేగాలతో కూడిన క్యారెక్టర్ ఇది. అన్ని రకాల ఎమోషన్స్‌తో విందుభోజనంలా ఉంటుంది. సినిమా మొత్తంలో 80 శాతానికిపైగా నేనే కనిపిస్తాను. ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను.

బాలీవుడ్ చిత్రం బద్లాతో ఈ సినిమాకు పోలికలు ఉన్నాయనే విమర్శలువినిపిస్తున్నాయి?

-ఆ వార్తలు నేను విన్నాను. ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది నన్ను ఆ ప్రశ్న అడిగారు. విడుదల తర్వాత రెండు సినిమాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో ప్రేక్షకులే గ్రహిస్తారు

పెద్ద సినిమాలు చేయలేకపోయాననే అసంతృప్తి ఉందా?

-తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడేళ్లు అవుతోంది. తొలి సినిమా సమయంలో చిత్ర పరిశ్రమ గురించి ఎలాంటి అవగాహన లేదు. మా కుటుంబానికి సంబంధించిన వారు, స్నేహితులు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అందువల్లే ఇండస్ట్రీ తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. చిత్రసీమలో చాలా రూల్స్, ప్రొటోకాల్స్ ఉంటాయి. అందరూ వాటినే ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నేను మాత్రం నా స్వీయ నిర్ణయాలకే కట్టుబడి ప్రయాణం సాగించాను. నా మనసుకు నచ్చిన విధంగా సొంత అడుగులు వేయడానికే ప్రయత్నించాను. పెద్ద సినిమాలు అవకాశాలు రాకపోవడానికి కారణలేమిటో తెలియదు. తప్పొప్పుల గురించి ఆలోచించడం లేదు. నా కెరీర్ ఇంకా ముగిసిపోలేదు. ఎంతో భవిష్యత్తు ఉంది.

హిందీలో మీరు అరంగేట్రం చేసిన ఏక్ లడ్‌కీకో దేఖాతో ఐసా లగా ఎలాంటి సంతృప్తిని మిగిల్చింది?

-కథ విన్న తర్వాత అలాంటి మంచి పాత్ర మళ్లీ దొరకదనిపించింది. వినూత్నమైన కథల్ని చెప్పాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో అంగీకరించాను. లెస్బియన్‌గా నా పాత్ర చాలా మందిని మెప్పించింది. కమర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నేను పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశానని ప్రశంసించారు.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

-తమిళంలో కసడతబర సినిమా చేస్తున్నాను. సందీప్‌కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చింబుదేవన్ దర్శకుడు. దీనితో పాటు పార్టీ సినిమా చేస్తున్నాను. రానాతో చేసిన 1945 సినిమా చిత్రీకరణ పూర్తయింది. అయితే నిర్మాణపరమైన కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

కీర్తిసురేష్‌కు జాతీయ అవార్డు రావడం ఏమనిపించింది?

-మహానటి లాంటి సినిమాలో నటించే అవకాశం అందరికి రాదు. సావిత్రి పాత్రలో కీర్తి జీవించింది. వందశాతం న్యాయం చేసింది. ఆమెకు జాతీయ అవార్డు రావడం సంతోషాన్నిచ్చింది.

963

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles