శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ జాతీయ పురస్కారం

Fri,November 15, 2019 12:07 AM

అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అందజేసే ఏఎన్నార్ జాతీయ పురస్కారం భారతీయ చిత్రసీమలో ఎంతో ప్రత్యేకతను సంపాదించుకుంది. 2018 సంవత్సరానికిగాను దివంగత శ్రీదేవికి ఈ అవార్డును ప్రకటించారు. 2019 సంవత్సరానికిగాను సీనియర్ నటి రేఖకు ఈ అవార్డును ప్రదానం చేయబోతున్నారు. ఏఎన్నార్ నేషనల్ అవార్డ్‌కు సంబంధించి గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించేబోయే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నాన్నగారి పేరు కలకాలం గుర్తుండిపోయేలా ఈ అవార్డును కొనసాగిస్తాం. ఆయన కలల్ని నిజం చేస్తాం. ఈ అవార్డు ఇంత విజయవంతం కావడానికి సుబ్బరామిరెడ్డిగారు కూడా ఓ కారణం. ఆయనకు నాన్నగారితో ఎంతటి సాన్నిహిత్యం ఉందో నాతో కూడా అంతటి అనుబంధం ఉంది. నాన్నగారు వెళ్లిపోయిన తర్వాత మా కుటుంబానికి దిక్సూచిలా నిలుస్తున్నారు సుబ్బరామిరెడ్డి. మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్థాపించి ఏడేళ్లు అవుతున్నది. అది క్రమంగా ఎదుగుతూ నేడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.


ప్రస్తుతం 450 మంది విద్యార్థులు ఉన్నారు. వారి గ్రాడ్యుయేషన్ ఉత్సవాన్ని ఏఎన్నార్ నేషనల్ అవార్డుతో కలిపి చేయడం మొదలుపెట్టాం. ఈ ఏడాది కూడా దాదాపు 70మందికి పట్టాలు అందించబోతున్నాం. శ్రీదేవిగారి తరపున అవార్డును స్వీకరించడానికి బోనీకపూర్ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు వస్తున్నారు. ఈ పురస్కార ప్రదానోత్సవానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతారు అని చెప్పారు. ఏఎన్నార్ నేషనల్ అవార్డు కమిటీ ఛైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ 2006లో ఈ అవార్డును ఆరంభించాం. అందరూ గర్వించే మహానటి శ్రీదేవికి అ పురస్కారాన్ని ప్రకటించాలన్నది ఏఎన్నార్‌గారి కోరిక. తెలుగమ్మాయిలైన శ్రీదేవి, రేఖలను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది అన్నారు. 2006లో తొలిసారి ఈ అవార్డును దేవానంద్‌కు అందించారు. 2017 సంవత్సరంలో ఈ అవార్డును ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్వీకరించారు.


293

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles