భవిష్యత్తును గురించిన ఆలోచనల్ని పక్కనపెట్టి నా మనసుకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తూ ప్రస్తుతం కెరీర్‌ను ఆస్వాదిస్తున్నాను అని అన్నారు సందీప్‌కిషన్. గత కొన్నేళ్లుగా పరాజయాల్ని ఎదుర్కొన్న ఆయన ఇటీవలే నిను వీడని నీడను నేనే చిత్రంతో సక్సెస్‌ల బాట పట్టారు. ఈ విజయోత్సాహంతో తన పంథాను మార్చి వినోదాత్మక కథాంశంతో ఆయన నటించిన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏబీఎల్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సందీప్‌కిషన్ చిత్ర విశేషాల్ని పాత్రికేయులతో పంచుకున్నారు.
తెనాలి రామకృష్ణ నేపథ్యమేమిటి?
కర్నూల్ పట్టణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. తెనాలి రామకృష్ణ అనే లాయర్‌గా నేను కనిపిస్తాను. కేసులు గెలుస్తూ గొప్ప పేరుతెచ్చుకోవాలనుకోకుండా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్ని రాజీతో ముగింపు పలుకుతూ డబ్బుల్ని సంపాదించుకోవాలని చూస్తుంటాడు. అనుకోకుండా అతడో పెద్ద కేసును వాదించాల్సివస్తుంది. అదేమిటన్నది ఈ చిత్ర ఇతివృత్తం.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి?
వినోదాన్ని నమ్మి ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే తీసిన సినిమా ఇది. అంతేకానీ ఇండస్ట్రీని మార్చే కొత్త కథ కాదు. మంచి కథతో చాలా సింపుల్‌గా సాగుతూ థ్రిల్‌ను పంచుతుంది. నాగేశ్వరరెడ్డి శైలి హంగులన్నీ ఉంటాయి.
నటుడిగా ఏ జోనర్లో సినిమా చేయడం కంఫర్ట్‌గా భావిస్తారు?
కామెడీని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఈ జోనర్లో సినిమా చేసి చాలా కాలమైంది. ఈ చిత్ర ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాను. కమర్షియల్, కామెడీ దర్శకుడైన నాగేశ్వరరెడ్డి సినిమా ఎలా చేస్తారో అనే సంశయాలు చిత్రీకరణ ప్రారంభంలో ఉండేవి. నటీనటుల చిన్న చిన్న హావభావాల్ని సైతం జాగ్రత్తగా పరిశీలిస్తూ వారి నుంచి చక్కటి నటనను రాబట్టుకోవడంలో ఆయన దిట్ట అని ఈ సినిమాతో అర్థమైంది.
చాలా రోజుల తర్వాత కామెడీ కథాంశంతో సినిమా చేయడం ఎలాంటి అనుభూతిని పంచింది?
కామెడీ జోనర్లో సరైన కథల్ని ఎంచుకోవడం చాలా కష్టం. మంచి కథలు అరుదుగా దొరుకుతాయి. కథలో కామెడీ ఉండటం మంచిదే కానీ కామెడీ కోసం కథలు రాయకూడదనేది నా నమ్మకం. ఇందులో కథానుగుణంగా చక్కటి వినోదం కుదిరింది. లాయర్ బ్యాక్‌డ్రాప్‌లో నవ్య పంథాలో సినిమా సాగుతుంది.
నిను వీడని నీడను నేనే తర్వాత మీ పంథాలో మార్పులు కనిపిస్తున్నాయి?
కథల ఎంపికలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వరకు ఎలాంటి ప్లానింగ్ లేకుండా సినిమాలు చేశాను. ఆ రోజుల్లో సూపర్‌హిట్ సినిమా చేస్తే చాలనే ఆలోచనే ఉండేది. ఆ సినిమాతో విజయాన్ని అందుకున్న తర్వాత ఫలానా జోనర్లో, ఫలానా దర్శకుడితో సినిమాలు చేయాలనే ఆలోచనలు మొదలయ్యాయి. కొన్ని పరాజయాలు నేర్పించిన పాఠాలతో ప్రస్తుతం నాకు ఏ కథ నప్పుతుందో, ఎలాంటి సినిమాలు చేయాలోఅర్థం చేసుకున్నాను. రెండు మూడు సినిమాలకు ఒకసారి నా పంథాను మార్చుతూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచాలని అనుకుంటున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు.
ఏ1 ఎక్స్‌ప్రెస్ తమిళ్ రీమేక్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి?
టీజర్ చూసిన తర్వాత ఆ వార్తలకు సమాధానం దొరుకుతుంది. తమిళ సినిమాతో పోలిస్తే యాభై శాతం భిన్నంగా మా చిత్రం ఉంటుంది. కథ , కథనాల విషయంలో చాలా మార్పులు చేర్పులు చేశాం.ఈ సినిమా కోసం హాకీ క్రీడలో పదిహేను రోజులు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకోబోతున్నాను. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్
ప్రారంభమవుతుంది.
సక్సెస్ రేటు పెంచడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
సక్సెస్ రేటు సంగతి పక్కనపెడితే ఫాప్ రేటును మాత్రం తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాను. మంచి కథ కుదిరితేనే సినిమా చేస్తాను. లేదంటే ఇంట్లో ఖాళీగా ఉంటాను. ఆరేళ్ల తర్వాత ఈ ఏడాది నా కెరీర్ ఆనందంగా సాగిపోతున్నది.
నిర్మాతగా ప్రయాణం ఎలా ఉంది?
నిర్మాతగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలో రాహుల్‌రామకృష్ణ, ప్రియదర్శిలతో ఓ సినిమాను నిర్మించబోతున్నాను. కొత్త దర్శకుడు చెప్పిన కథ నన్ను ఆకట్టుకుంది.
తెలిసో తెలియకో గత కొన్నేళ్లుగా న్యూఏజ్, బలమైన సంఘర్షణలతో కూడిన సినిమాలు చేస్తూ వచ్చాను. ఇతరుల విజయాల నుంచి స్ఫూర్తి పొంది రాంగ్‌ట్రాక్‌లోకి వెళ్లిపోయాను. ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడం నాకు ఇష్టమే. అలాంటి పాత్రలు మంచి పేరును తెచ్చిపెడతాయి. ఆ పేరు మనలో తెలియని ఉత్సుకతను రేకెత్తిస్తూ అలాంటి సినిమాలకు అలవాటుపడేలా చేస్తుంది. ఆ పంథా నుంచి ప్రస్తుతం దూరమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాను. ఆ ఆలోచనతోనే వినోదాత్మక కథతో ఈ సినిమా చేశాను.