ఆ కల నెరవేరలేదు

Tue,October 1, 2019 12:06 AM

నవీన్ అంటే విజయనిర్మలకు చాలా అభిమానం. అతడిని ప్రేమగా చూసేది. నవీన్ చిన్నతనం నుంచి సినిమా వాతావరణంలో పెరిగాడు. అతడి నటనలో హుషారు కనిపిస్తున్నది. తొలి సినిమా కంటే నవీన్‌కు ఈ చిత్రం గొప్ప పేరు తీసుకురావాలి. పెద్ద విజయం సాధించి శతదినోత్సవం జరుపుకోవాలి. అచ్చ తెలుగు టైటిల్ బాగుంది అని అన్నారు సీనియర్ హీరో, సూపర్‌స్టార్ కృష్ణ. నవీన్‌విజయ్‌కృష్ణ, అవసరాల శ్రీనివాస్, సోఫియాసింగ్, మేఘాచౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఊరంతా అనుకుంటున్నారు. బాలాజీ సానల దర్శకుడు. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 5న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణ ట్రైలర్‌ను విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో హృద్యంగా ఈ సినిమా సాగుతుంది. కృష్ణ నటించిన ఊరికి మొనగాడు, పండంటి కాపురం చిత్రాల్ని గుర్తుకుతెస్తుంది అని చెప్పారు. నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ నానమ్మ విజయనిర్మలకు ఈ చిత్రాన్ని అంకితం చేయడం ఆనందంగా ఉంది.


ఈ సినిమా గురించి నానమ్మ చాలా సార్లు నన్ను అడిగింది. తనకు సినిమా చూపిస్తానని మాటిచ్చాను. కానీ ఆ కల నెరవేరలేదు. నేనో మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని, అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలని చెబుతుండేది. నటుడిగా నిరూపించుకో.. ఆ గుర్తింపు నిన్ను ముందుకు తీసుకెళ్తుందని, స్టార్‌డమ్ వెనకాల వెళ్లొద్దు అని నానమ్మ సూచించింది. ఆమె ఇచ్చిన ధైర్యం, పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకుండా నటుడిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని చెప్పారు. కథను నమ్మి నవీన్ ఈ సినిమా చేశాడని, తండ్రిగా అతడి నటన చూసి సంతృప్తిగా ఫీలయ్యానని సీనియర్ నరేష్ పేర్కొన్నారు. నవీన్ ఈ కథకు పూర్తిగా న్యాయం చేశాడని, ఇంటిల్లిపాదిని అలరించే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, సుధీర్‌బాబు, రాధాకృష్ణ, అల్లరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

412

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles