ప్రతి భారతీయుడు గర్వించే సినిమా ‘సైరా’

Mon,September 23, 2019 12:36 AM

‘సెప్టెంబర్‌ 22 నా జీవితంలో చిరస్మరణీయమైనది. ఓ మైలురాయివంటిది. 1978 న ఇదేరోజు నా మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. ఆ సమయంలో సినిమా ఫలితం ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఏమిటో అని ఉద్విగ్నతకు లోనయ్యాను. 41 సంవ్సతరాల తర్వాత మళ్లీ అలాంటి ఉద్విగ్నత, టెన్షన్‌ ఫీలవుతున్నాననేది వాస్తవం. దానికి కారణం ‘సైరా” అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్‌బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్ని పోషించారు. అక్టోబర్‌ 2న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘పుష్కరకాలం నుంచి ఈ సినిమా నా మదిలో మెదులుతున్నది. స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలన్నది నా ఇరవైఏళ్ల కల. ఎవరైనా అడిగితే భగత్‌సింగ్‌ పాత్ర చేయాలనుందని చెప్పేవాడిని. అయితే ఆ కోరిక అలా మిగిలిపోయింది. 12 ఏళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్‌ ఈ కథ గురించి చెప్పారు. ఓ యోగి, స్వాతంత్య్రసమరయోధుడు..భారతీయులందరూ తెలుసుకోవాల్సిన కథ అని తెలిపారు. నరసింహారెడ్డి చరిత్ర మరచిన హీరో. ఆయన కథ ప్రపంచానికి తెలియాజెప్పాలనుకున్నా. ఓ తెలుగు యోధుడి కథ తెరమరుగైపోకూడదని భావించా. పరోక్షంగా ఈ సినిమాకు శ్రీకారం చుట్టించింది, మద్దతు ఇచ్చింది రాజమౌళి. ఆయన గనుక ‘బాహుబలి’ తీసుండకపోతే ఈ రోజు ‘సైరా’ వచ్చేది కాదు.‘బాహుబలి’తో రాజమౌళి తెలుగు సినిమాకు ఓ కొత్త బాట వేశారు. ఎన్ని వందలకోట్లు ఖర్చు పెట్టినా సరే లాభాల్ని రాబట్టుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని సభాముఖంగా చెప్పాలనుకున్నా.


ఈ సినిమాను ఎవరికో అప్పజెప్పడం ఎందుకు మనమే చేద్దామని రామ్‌చరణ్‌ ముందుకొచ్చాడు. నేను సై అన్నాను. ‘ధృవ’ సినిమాలో సురేందర్‌రెడ్డి పనితనం నచ్చి రామ్‌చరణ్‌ ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. సురేందర్‌రెడ్డి ఈ సినిమా కోసం ఎంతో పరిశోధన చేశారు. చరిత్రను వక్రీకరించకుండా యథార్థగాథను అద్భుతంగా దృశ్యమానం చేశారు. ఆయనకు హ్యాట్సాఫ్‌. నేను పోరాట ఘట్టాల విషయంలో డూప్‌ని ఇష్టపడను. అభిమానులు కూడా అలా చేస్తే ఒప్పుకోరు. ఎంతో హింసపెట్టి నా నుంచి యాక్షన్‌ ఘట్టాల్ని రాబట్టుకున్నారు (నవ్వుతూ). కత్తి, డాలు పట్టుకొని ఒక్కసారి గుర్రమెక్కితే నేను ఒళ్లు మర్చిపోతాను. నా వయసూ మర్చిపోతాను. అప్పుడు నాకు గుర్తొచ్చేది నా అభిమానులు, ఇమేజ్‌ మాత్రమే. ‘శంకరాభరణం’ తెలుగు సినిమాకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా అంత గౌరవాన్ని పొందలేదు. ‘శంకరాభరణం తర్వాత తిరిగి ‘బాహుబలి’ అలాంటి గౌరవం తీసుకొచ్చింది. వాటి స్థాయిలో ‘సైరా’ మేము ఆశించిన గౌరవాన్ని తెస్తుందని అనుకుంటున్నా. ఈ సినిమాలో వచ్చే జాతీయగీతం దేశంకోసం త్యాగం చేసిన మహానుభావులకు నివాళిగా ఉంటుంది. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. దేశభక్తి ప్రధానంగా ఇలాంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించినందుకు రామ్‌చరణ్‌ను అభినందిస్తున్నాను. మహాత్మగాంధీ 150వ జయంతి రోజున ఈ సినిమా విడుదల చేయడం ఓ మరపురాని ఘట్టంగా భావిస్తున్నాను’ అన్నారు.

దేశం గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా

పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘పోటీతత్వం ఉన్న ఈ పరిశ్రమలో అన్నయ్య అందరూ బాగుండాలని కోరుకుంటారు. హీరోగా నేను తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవడానికి అన్నయ్య నేర్పించిన పాఠాలే కారణం. అన్నయ్య దేశం గర్వించే సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకునేవాణ్ణి. స్టార్‌డమ్‌ వచ్చినా నేను అలాంటి సినిమాలు చేయలేకపోయాను. కానీ స్వార్థం చూసుకోకుండా వందల కోట్లు ఖర్చుపెట్టి రామ్‌చరణ్‌ ఈ సినిమాను తీసి నా కోరిక నెరవేర్చాడు. దేశం గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా ఇది. ఓ గొప్ప వీరుడి చరిత్రతో సురేందర్‌రెడ్డి ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చిరంజీవే గుర్తొచ్చారు. అనుభవానికి నేను పెద్దపీట వేస్తాను. ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్తవాళ్లు వచ్చినా, ఎన్ని రికార్డులు బద్దలుకొట్టినా అన్నయ్య అనుభవాన్ని అధిగమించలేరు. దేశం కోసం ప్రజల కోసం తీసిన సినిమా ఇది. ఇలాంటి గొప్ప సినిమాలో నేను భాగస్వామినవ్వడం ఆనందంగా ఉంది. ఎవరైనా విజయాల్ని సాధిస్తే మేము అసూయచెందకుండా ఆనంద పడతాం. రాజమౌళి, సురేందర్‌రెడ్డి ఎవరూ గెలిచిన, రికార్డులు బద్దలు కొట్టినా మాకు ఆనందంగానే ఉంటుంది’ అన్నారు.

చిరంజీవికి రుణపడి ఉంటా

దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘200రోజుల పాటు ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఓ కుటుంబంలా శ్రమించారు. తన డ్రీమ్‌ప్రాజెక్ట్‌ అయిన ఈ సినిమాను డైరెక్ట్‌ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చిరంజీవిగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయంలో నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చి ముందుకు నడిపించిన రామ్‌చరణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘ రెండు వందల రోజులు చిత్రీకరణ జరిపాం. ఈ ప్రయాణంలో ప్రతి రోజు సాంకేతిక నిపుణులందరికి కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను. సమిష్టి కృషి వల్లే నాన్న కల నెరవేరింది’ అని తెలిపారు. తెలుగులో తన మొదటి సినిమా చిరంజీవితో చేయడం గౌరవం, అదృష్టంగా భావిస్తున్నానని విజయ్‌ సేతుపతి పేర్కొన్నారు.

తెలుగువాళ్లందరికి బహుమతి ఇది..

రాజమౌళి మాట్లాడుతూ ‘ఇంతటి చారిత్రక సినిమా వేడుక జరుగుతున్నదంటే మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది పరుచూరి బ్రదర్స్‌కు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వారు ఈ కథను తమ గుండెల్లో మోశారు. కేవలం తన తండ్రి చిరంజీవిగారికే కాదు.. మొత్తం తెలుగువాళ్లందరికి రామ్‌చరణ్‌ అందిస్తున్న బహుమతి ఇది. ఈ తరహా సినిమాలు తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘బాహుబలి’లో 2300 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉంటే ‘సైరా’లో 3800 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయని వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ కమల్‌కణ్ణన్‌ నాతో చెప్పారు. అయితే వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ చేయడం కష్టమైన పనికాదు. వాటి మధ్య ఎమోషన్‌ను మర్చిపోకుండా చూపించడం ముఖ్యం. ఎందుకంటే సినిమాను ప్రజలకు దగ్గర చేసేవి ఎమోషన్స్‌. వాటిని బలంగా, అద్భుతంగా చెప్పడం దర్శకుడి భుజస్కందాలపై ఉంటుంది. ట్రైలర్‌ చూసిన వెంటనే సినిమా మీద అందరికి కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఈ క్రెడిట్‌ అంతా సురేందర్‌రెడ్డిదే. ‘సైరా’ యూనిట్‌ మీద పై నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు పైనుంచి వేసిన అక్షింతలు’ అన్నారు. ఈ కార్యక్రమంలో జగపతిబాబు, అల్లు అరవింద్‌, రత్నవేలు, పరుచూరి గోపాలకృష్ణ, సాయిమాధవ్‌బుర్రా, రామ్‌లక్ష్మణ్‌, అమిత్‌ త్రివేది, శ్రీకర్‌ప్రసాద్‌, ఎన్వీప్రసాద్‌, రవిశంకర్‌, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

832

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles