సైరాతో స్వప్నం నెరవేరింది!

Thu,October 3, 2019 11:51 PM

ఆంగ్లేయులను ఎదురించిన మొట్టమొదటి యోధుడు చరిత్ర తెరమరుగై పోకూడదనుకున్నాం. అతడి కథ ప్రతి ఒక్కరికి తెలియాలి. దానికి సినిమా కంటే గొ ప్ప మాధ్యమం లేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ సినిమా ద్వారా గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి చరిత్ర తెలుసుకునే అవకాశం లభించింది అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాత. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. గురువారం థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా ఉత్తర, దక్షిణాది సినిమాలనే భేదాలు పోయి..భారతీయ సినిమా అనే ముద్ర ఏర్పడిందంటూ ముంబయి మీడియావారు మెచ్చుకున్నారు. చిరంజీవి కెరీర్‌లో చేసిన 150 సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా ఒక ఎత్తు అని కీర్తించడం గర్వంగా అనిపిస్తున్నది. దర్శకుడు సురేందర్‌రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి దొరికిన అద్భుతం. ఒక ఎపిక్ సినిమాను పరిశ్రమకు అందించారు.ఈ సినిమాలో నా గురువు పాత్రలో నటించిన అమితాబ్‌గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఆనందం చూస్తుంటే మూడు సంవత్సరాల కష్టాన్ని మరిచిపోయిన భావన కలుగుతున్నది. ఈ స్క్రిప్ట్ దగ్గర పెట్టుకొని నిద్రలేని రోజులు ఎన్నో గడిపాను. తండ్రికి గొప్ప సినిమా ఇవ్వాలన్నది రామ్‌చరణ్ కల. ఈ సినిమాతో అది తీర్చారు. వారిద్దరి స్వప్నానికి సాఫల్యత చేకూర్చానని నేను గర్వంగా చెప్పుకుంటాను అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమలో సైరా చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 85కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో బలమైన ఉద్వేగాల్ని పండించి దర్శకుడు సురేందర్‌రెడ్డి కన్నీళ్లు తెప్పించాడు అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ మా అందరికి ఆశీస్సులు అందించింది. నా కలలో కూడా ఆ స్థాయి విజయాన్ని ఊహించలేదు. సైరాతో నా కల నెరవేరింది. ఈ సినిమా కోసం నేను షూటింగ్‌కు ఇరవైరోజులు బ్రేక్ తీసుకున్నాను. విడుదలకు కొన్నిరోజులు ముందు రాత్రి 3 గంటల టైమ్‌లో ఉలిక్కిపడి లేచేవాణ్ణి. నిర్మాతగా ఎలాంటి టెన్షన్స్ ఉంటాయో ఈ సినిమాతో తెలిసింది అని చెప్పారు.

864

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles