రచయితల్ని గౌరవించకపోతే మనుగడ లేదు

Mon,November 4, 2019 12:12 AM

దర్శకనిర్మాతల తర్వాత తాను అత్యంత గౌరవించేది రచయితల్నే. వారు లేకపోతే నటులు లేరు అని అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ వేడుకలో సీనియర్ దర్శక రచయితలు కె. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు, సత్యానంద్, భువనచంద్ర, ఆదివిష్ణు, రావికొండలరావు, గొల్లపూడి మారుతీరావులకు జీవితసాఫల్య పురస్కారాల్ని అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సత్యానంద్, పరుచూరి బ్రదర్స్, ఆకెళ్ల సహా రచయితలందరితో సుదీర్ఘ కాలంగా చక్కటి అనుబంధం కొనసాగుతున్నది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వారిని కుటుంబసభ్యుల్లా భావిస్తాను. నా జీవితంలో మర్చిపోలేని అద్భుతఘట్టమిది. రచయితల్ని గౌరవించకపోతే మనుగడ లేదు. కె. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు లాంటి అరుదైన వ్యక్తుల గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు.


రచయితలంతా డైరెక్టర్స్‌గా మారడంతో ఔత్సాహిక దర్శకులందరికి కష్టకాలం వచ్చిందని రాఘవేంద్రరావు తెలిపారు. మోహన్‌బాబు మాట్లాడుతూ రచయితల్ని చూస్తుంటే తొలినాటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయి. నాకు వేషం ఇప్పించమని సత్యానంద్ వెంటపడ్డాను. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావుతో పాటు ఎందరో దర్శక రచయితల వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. హీరోకు పేరు, నిర్మాతకు డబ్బులు సంపాదించిపెట్టేది రచయితలే అని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ యర్రంశెట్టి, ఎల్చూరితో పాటు పలువురు రచయితలు తాము ముళ్లబాటలో నడిచి ఎందరికో పూలబాటలు వేశారు. రచయితలకు గౌరవం దక్కాలనే తలంపుతో ఈ సంఘాన్ని ప్రారంభించారు. శిలను శిల్పంగా మలిచే శక్తి రచయితలకే ఉంది అని పేర్కొన్నారు.

284

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles