నిత్యజీవిత ఘటనలతో

Wed,November 6, 2019 12:07 AM

పబ్‌లో డీజేగా పనిచేసే మణి అనే యువకుడి కథ ఇది. నైట్‌లైఫ్‌కు అలవాటుపడిన భిన్నమైన మనస్తత్వమున్న అతడి జీవితంలో ఐదేళ్ల కాలగమనంలో ఏం జరిగిందన్నది ఆసక్తిని పంచుతుంది అని అన్నారు కృష్ణవిజయ్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం తిప్పరా మీసం. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటించారు. ఈ నెల 8న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో కృష్ణవిజయ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో గర్వపడే క్షణాలుంటాయి. అలా ఓ యువకుడు మీసం తిప్పే సందర్భం ఎప్పుడొచ్చిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. తల్లి కోసం ఓ యువకుడు ఎలాంటి పోరాటం సాగించాడు? మౌనిక అనే అమ్మాయితో అతడి ప్రేమాయణం ఏ తీరాలకు చేరుకున్నదన్నది ఆకట్టుకుంటుంది. యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో భావోద్వేగప్రధానంగా సాగుతుంది. నిత్యజీవితంలో నేను చూసిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందించాను. తెలుగుతో పాటు కన్నడంలో ఏకకాలంలో విడుదలచేయనున్నాం.


ఆర్కిటెక్చర్‌గా పనిచేశా..

నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం అసురలో శ్రీవిష్ణు ఓ పాటలో నటించాడు. ఆ సినిమా నుంచి మా స్నేహం కొనసాగుతున్నది. అతడు హీరోగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ సినిమాలకు నేను ఓ నిర్మాతగా వ్యవహరించాను. ఓ కంపెనీలో ఆర్కిటెక్చర్‌గా పనిచేసే నేను సృజనాత్మక రంగంపై ఆసక్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టాను. సహాయ దర్శకుడిగా ఎవరి దగ్గర పనిచేయకుండా నాకున్న అనుభవం, పరిజ్ఞానంతోనే అసుర సినిమా తీశాను. కె. విశ్వనాథ్ నా అభిమాన దర్శకుడు. నా దృష్టిలో నిర్మాణంతో పోలిస్తే దర్శకత్వంలోనే ఎక్కువ కష్టం ఇమిడి ఉంటుంది. ప్రతి రోజు సవాళ్లను ఎదుర్కొంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం సులభం కాదు. శ్రీవిష్ణుతో మా సంస్థలో మరో సినిమాను నిర్మించబోతున్నాను. అలాగే నా దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ఓ సినిమా ఉంటుంది.

194

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles