40ఏళ్ల వ్యక్తిగా శర్వా మెప్పించాడు


Tue,August 6, 2019 12:54 AM

trivikram srinivas sharwanand s ranarangam attracts everyon

నా సన్నిహిత మిత్రుడి ద్వారా శర్వానంద్‌తో ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఈ సినిమాలో శర్వా 40ఏళ్ల వ్యక్తిగా బాగా నటించారు. యువకుడైన అతను మధ్యవయస్కుడి పాత్రను సమర్థవంతంగా పోషించడం తొలి విజయంగా భావిస్తున్నాను అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. ఆదివారం ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జరిగిన రణరంగం చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. త్రివిక్రమ్ మాట్లాడుతూ 1980ల కథను నేటికాలంతో అనుసంధానించి మంచి సినిమాను తీశారనిపిస్తున్నది. దర్శకుడు సుధీర్ ఈ సినిమా కోసం బాగా శ్రమించాడు.

కొన్ని సన్నివేశాలను చూస్తే సుధీర్ మంచి ప్రేమకథలు తీయొచ్చనిపించింది అన్నారు. శర్వానంద్‌తో కలిసి రెండేళ్లు పనిచేశా. మంచి ఎనర్జీతో సినిమా చేశాడు. నేను చెప్పదలచుకున్న విషయాలన్నింటిని సినిమాలో చూపించాను. సినిమా అందరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది అని దర్శకుడు తెలిపారు. శర్వానంద్ మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రావడానికి ప్రయత్నించే ముందు క్యారెక్టర్ల కోసం త్రివిక్రమ్‌గారిని కలుస్తుండేవాడిని. ఆ టైమ్‌లో ఆయన పెద్ద రచయిత. ఓసారి కారులో ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా సినిమాలో క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని అడిగాను. నీతో సినిమా చేస్తే హీరోగానే చేస్తాను. క్యారెక్టర్ అయితే ఎప్పటికీ ఇవ్వను అన్నారాయన. రణరంగం ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నాను. కాకినాడలో కొన్ని రోజులు షూటింగ్ చేశాం.

ఇక్కడే ట్రైలర్‌ను విడుదలచ చేయడం మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అన్నారు. సుధీర్‌వర్మ సినిమాల్లో గన్స్, వయొలెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత అందమైన ప్రేమకథను కూడా ఆయన తీయగలరని అర్థం చేసుకుంటారు అని చిత్ర కథానాయిక కల్యాణిప్రియదర్శన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు పీడీవీ ప్రసాద్, నిర్మాత సూర్యదేవరనాగవంశీ, నటులు అజయ్, రాజా, సంగీత దర్శకుడు కార్తీక్, రచయితలు కృష్ణచైతన్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

583

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles